ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదం రోజురోజుకు ఉద్ధృతంగా మారుతుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పీఆర్సీ విధానం ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందంటూ దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కొంతకాలంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అనేకసార్లు ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర నాన్ గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈరోజు ఛలో విజయవాడ ముట్టడికి పిలుపునిచ్చింది.
నేతలు అరెస్టు
ఛలో విజయవాడ ముట్టడికి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు తరలి వస్తున్నారు. ఈ ఆందోళనకు పోలీసుల అనుమతి లభించకపోవడంతో బస్సులు, రైళ్లు, ఇతర మార్గాల ద్వారా విజయవాడ చేరుకుంటున్నారు. విజయవాడ సరిహాద్దు ప్రాంతాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఉద్యోగస్థులను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే ఉద్యోగ సంఘాల నేతలను ఎక్కడికక్కడే గృహ నిర్బంధం చేశారు. అయినప్పటికీ వేలాది మంది విజయవాడ చేరుకొని ఎన్జీవో భవన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేసుకుంటు ముందుకు కదులుతున్నారు.
71 డిమాండ్లు
ఉద్యోగులు ఆందోళన వీడి సీఎం అధ్యక్షతన చర్చలు జరపాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ కోరారు. కాని ఉద్యోగ సంఘాలు 71 డిమాండ్లను , 30 శాతం ఫిట్‌మెంట్ అంశాన్ని ప్రభుత్వం ముందుంచారు. తమ డిమాండ్లను నేరవేర్చితేనే ఆందోళన విరమిస్తామని వెల్లడిస్తున్నారు.
మారు వేషాల్లో ఉద్యోగులు
అడుగడున చెక్‌పోస్టులు, పోలీసుల తనిఖీలు ఉండటంతో ఉద్యోగులు రైతులు, దినసరి కూలీల వేషంలో విజయవాడకు చేరకున్నారు. భారీగా మోహరించిన పోలీసులను దాటుకొని విజయవాడ వీధుల్లో నిరసన చేపడుతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, ఇతర ప్రతినిధులు ఇప్పటికైనా తమ ప్రతిపాదనలు సఫలీకృతం చేయాలని కోరారు
పలుమార్లు చర్చలు
పీఆర్సీ విషయంపై మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను పూర్తిగా నెరవేర్చడం సాధ్యంకాదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగులు ఛలో విజయవాడ కార్యక్రమం అనంతరం ఈ నెల 7 నుంచి పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో సమ్మె చేపట్టనున్నట్లు సమాచారం.
బహిరంగ సభకూ నిరాకరణ
చలో విజయవాడ కార్యక్రమంతో పాటు బీఆర్‌టీఎస్ రోడ్డులో నిర్వహించే భారీ బహిరంగ సభకు కూడ పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ ఉద్యోగులు ర్యాలీ కొనసాగిస్తున్నారు. సభను నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు.
5 నుంచి సహాయ నిరాకరణ
పోలీసుల ఆంక్షలను దాటుకొని విజయవాడ చేరుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సహాయ నిరాకరణ చేపడతామని పేర్కొన్నారు. అలాగే విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు కూడ నిరసనలో పాల్గొంటారని వివరించారు.