ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఏదోక కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. న్యూస్ చానళ్లు, సోషల్ మీడియా వేదికగా పలు రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు బాహాటంగా మద్దతు తెలుపుతూ హాట్ టాపిక్‌గా మారుతుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో బండ్ల గణేష్ సంచలన పోస్టు పెట్టారు. శుక్రవారం (నవంబర్ 9) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ చేశారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి మాత్రమే సీఎం కావాలని సినీ ప్రముఖులపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్‌పై బండ్ల గణేష్ ఫైర్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 8న ఘనంగా పుట్టిన రోజు జరుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులు, కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఒకరిద్దరు మినహా తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన బండ్ల గణేష్ సినీ పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్టు క్షణాల్లో వైరల్‌గా మారింది.
తారక్, ప్రభాస్‌కు చురకలు?
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలుగు చిత్ర పరిశ్రమకు మధ్య గ్యాప్ వచ్చినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే మెయిన్‌గా టికెట్ల రేటు పెంపు విషయాన్ని బండ్ల గణేష్ ప్రస్తావించడం చర్చకు తావిస్తోంది. స్టార్ హీరోలు ప్రభాస్, జూ.ఎన్టీఆర్‌లను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’, తారక్ చేసిన ‘దేవర’ చిత్రాలు టికెట్ పెంపునకు తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నాయి. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించింది. అయితే శుక్రవారం రేవంత్ రెడ్డి బర్త్‌డే సందర్బంగా తారక్, ప్రభాస్ నుంచి ఎలాంటి విషింగ్ పోస్టు రాలేదు. దీంతో బండ్ల గణేష్ వారిద్దరిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
విష్ చేసిన స్టార్స్ వీరే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. ‘రానున్న సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి. ప్రజాసేవలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అటు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సైతం రేవంత్ రెడ్డిని విష్ చేశారు. దేవుడు మీకు ఆరోగ్యాన్నివ్వాలని, రాష్ట్రాన్ని మరింత సుభిక్షం వైపు నడిపించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూడా రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. రేవంత్ రెడ్డి లీడర్‌షిప్‌ను ప్రశంసించాడు.
నంది అవార్డుల విషయంలో రగడ!
ఈ ఏడాది జనవరిలో గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. రేవంత్ ఈ ప్రకటన చేసి ఆరేడు నెలలు గడిచినా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ క్రమంలో ఓ వేదికపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, సినీ పెద్దల మౌనంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, అతడి ఫ్యామిలీపై కాంగ్రెస్ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు టాలీవుడ్‌ను కుదిపేశాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సినీ పెద్దలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం