వానలో ఇంట్లో ముసుగు తన్నిపడుకునేవారు కొందరైతే, ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని, జలపాతాల్లో జలకాలాడాలని ఉవ్విళ్లూరే వారు కొందరు. హైదరాబాద్ లో ఉండే యువ ఉద్యోగుల్లో చాలామందికి ఈ ముసురులో దోస్తులతో విహారానికి వెళ్లడమంటే చాలా ఇష్టం. కానీ ఎక్కడి కెళ్లాలో తెలియదు. అలాంటి వారికోసమే ఈ సమాచారం.
బొగత జలపాతం
ప్రకృతి సృష్టించిన సుందర దృశ్యాల్లో బొగత జలపాతం ఒకటి. తెలంగాణ నయాగారాగా ప్రసిద్ధి గాంచింది. ములుగు జిల్లా వాజేడు మండలం బొగత గ్రామంలో ఉన్న ఈ జలపాతం…పచ్చని ప్రకృతిలో, కొండ కోనలు వినిపించే జలసవ్వడితో అద్భుతంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి నీటిలో చిల్ చేయాలనుకునేవారికి..30 అడుగుల ఎత్తు నుంచి ఉప్పొంగే ఈ జలపాతం పక్కాగా సరిపోతుంది.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి రోడ్డు లేదా రైలు మార్గంలో ఎలా అయినా వెళ్లొచ్చు. కొత్తగూడెం వరకు రైలు సౌకర్యం ఉంటుంది. అక్కడి నుంచి వాజేడుకు బస్సులు, ఆటోలు ఉంటాయి. అక్కడి నుంచి కిలోమీటరు ప్రయాణిస్తే అందాల బొగత కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. హైదరాబాద్ కు 440 కి.మీ. దూరంలో ఈ జలపాతం ఉన్నప్పటికీ… ప్రకృతి సోయగాలతో నిండిన మార్గం మీకు దూరం తెలియనివ్వదు.
కుంటాల జలపాతం
తెలంగాణలోని అత్యంత ఎత్తైన ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లా నేరడి గొండ మండలంలో ఉంది. 45 మీటర్ల ఎత్తు నుంచే జాలువారే జలసవ్వడులు మనస్సుకు చెప్పలేని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఏర్పడిన ఈ సహజసిద్ధ జలపాతం వద్ద సరదాగా గడపొచ్చు.
ఎలా వెళ్లాలి?
ఆదిలాబాద్ కు 60కి.మీ. ల దూరంలో ఉంటుంది. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో నేరెడిగొండ నుంచి 12 కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి. బస్సుసౌకర్యం అంతగా ఉండదు. సొంత వాహనాల్లో వెళ్తే ప్రకృతి సోయగాలను కూడా ఆస్వాదించొచ్చు. అలాగే దగ్గరలోనే ఉండే పొచ్చెర జలపాత అందాలను కూడా చూడొచ్చు.
అనంతగిరి హిల్స్
హైదరాబాద్ కు అతి సమీపంలో ఉండే ఈ కొండలు ఆహ్లాదకరమైన వాతావరణానికి చిరునామా. హైదరాబాద్ లోని జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు నీరు ఈ కొండలపై నుంచే జాలువారుతుంది. చలికాలంలో ఇది విహారానికి అద్భుతమైన ప్లేస్ కానీ వానాకాలంలోనూ ప్రకృతి రమణీయతను ఆస్వాదించొచ్చు. ట్రెక్కింగ్, సైట్ సీయింగ్ ను ఇష్టపడేవారికి సరిగ్గా సరిపోతుంది.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్లే మార్గంలో బస్సు, కారు, బైక్ ఎలాగైనా వెళ్లొచ్చు. 70కి.మీల లోపే దూరం ఉంటుంది కాబట్టి సరదాగా వెళ్లి రావొచ్చు.
సిర్నాపల్లి జలపాతం
సిర్నాపల్లి జలపాతం లేక జానకీబాయి జలపాతం ఓ చెరువు తూము. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సిర్నాపల్లి గ్రామ పరిధిలో ఉంది. కానీ భారీగా నిర్మించిన ఈ కట్ట 40 అడుగుల ఎత్తునుంచి జాలువారే నీటితో జలపాతాన్ని తలపిస్తుంది. అందుకే దీనిని ఇందూరు జలపాతం అని కూడా అంటారు. ఊరికి దూరంగా పూర్తిగా అడవిలో ఉండే ఈ జలపాతానికి వెళ్తే….కాంక్రీట్ జంగిల్ లో ఉరుకుల పరుగుల జీవితాన్ని క్షణాల్లో మరచిపోయి మైమరచిపోవచ్చు.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే మార్గంలో ఉంటుంది. డిచ్ పల్లి వరకూ హైవే పైనే వెళ్లవచ్చు కానీ అక్కడి నుంచి గతుకుల రోడ్డులో ప్రయాణించాల్సి ఉంటుంది. సొంత వాహనాలు ఉంటే బాగుటుంది. హైదరాబాద్ కు ఇది సుమారు 180కి.మీల దూరంలో ఉంటుంది.
పోచారం ప్రాజెక్టు, అభయారణ్యం
ప్రకృతి సోయగాలు, జలపాత జలకాలు.. ఈ రెంటినీ ఆస్వాదించాలనుకునే వారికి పోచారం పక్కా ప్రదేశం. పోచారం ప్రాజెక్టు వద్ద జాలువారు జలాల్లో జలకాలు ఆడుకోవచ్చు. అలాగే సమీపంలోనే ఉన్న పోచారం అభయారణ్యంలో తిరుగుతూ ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. కోకిల గానాలు, నెమళ్ల నృత్యాలు కుందేళ్ల గంతుల్లో కాలం తెలియకుండా గడపొచ్చు. కుటుంబంతో సహా వెళ్లాలనుకుంటే మాత్రం ఇంతకన్నా మంచి పర్యాటక ప్రాంతం మరోటి ఉండదు.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి బాన్సువాడ, బోధన్ వెళ్లే మార్గంలో ఉంటుంది. వయా నర్సాపూర్ లేదా వయా చేగుంట ఎలా వెళ్లినా ఒకటే దూరం. మెదక్ దాటాక ఓ 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులో అయినా వెళ్లొచ్చు ప్రైవేటు వాహనంలో అయినా వెళ్లొచ్చు. అన్నట్టు పోచారంలో ఓ తాత చాయ్ భలేగా ఉంటుంది. ఓ సారి ట్రై చేయండి.
టాప్-5 ప్రదేశాలు తెలిసిపోయాయి కదా ఇక ప్లాన్ చేసుకుని పయణమవ్వండి. కానీ జాగ్రత్త సుమా!. కుంటాల, పోచారం, బొగత వంటి చోట్ల రాళ్లపై జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కూడా ఈత కొట్టే ప్రయత్నం చేయవద్దు. పిల్లల్ని వెంట తీసుకెళ్తే కనిపెట్టుకుని ఉండండి. మద్యం వంటివి జలపాతాల వద్ద ప్రయత్నించకపోవడం మంచిది. అలాగే చార్జర్, ఫోన్, రెయిన్ కోట్, భోజనం వంటివి పక్కాగా ప్లాన్ చేసుకుంటే విహార యాత్ర మధురంగా సాగుతుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!