ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో వివిధ దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోటీకి దిగాయి. అయితే ఇప్పుడిప్పుడే జాతీయ రాజకీయాల్లో కీలకమవుతున్న టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు సైతం ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి నిలిపాయి. ఎన్నికలు ముగియడంతో నేడు (మార్చి 10వ తేదీన) ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
ఉదయం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే బీజేపీ హవా కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో పూర్తిగా బీజేపీ గాలి వీస్తోంది. ఈ రాష్ట్రాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న బీజేపీ పంజాబ్‌లో మాత్రం వెనకపడింది. అనూహ్యంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజార్టీతో పంజాబ్‌లో దూసుకెళ్తుంది.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 262 స్థానాల్లో ముందంజలో ఉండగా, అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ 136 స్థానాల్లో, కాంగ్రెస్ 1 స్థానాల్లో, బీఎస్పీ 2 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి, ప్రధాని మోడీ గాలికి యూపీ ప్రజలందరూ మళ్ళీ బీజేపీకే పట్టం కట్టగా.. ఈ ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న అఖిలేష్ యాదవ్ పార్టీకి రెండవ స్థానం దక్కింది. అటు కాంగ్రెస్ వైపు మాత్రం యూపీ ప్రజలు ఏమాత్రం మొగ్గు చూపలేదు. 268 స్థానాల్లో మెజార్టీతో ఉన్న బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి అధికారంలోకి రావడం దాదాపు ఖాయమైనట్లే.
యూపీలాగానే ఉత్తరాఖండ్‌లో సైతం బీజేపీ పూర్తి ఆధిక్యం చూపించింది. ఆ రాష్ట్రంలో మొత్తం 70 సీట్లు ఉండగా, అధికారం నెలకొల్పడానికి కావాల్సిన 36 సీట్లను భాజపా సాధించే దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఆ పార్టీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 25 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు కమలం పార్టీ సన్నాహమవుతోంది.
చిన్న రాష్ట్రాలైన మణిపూర్, గోవాలో సైతం బీజేపీ సత్తా చాటింది. ఇప్పటికే మణిపూర్‌లో మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసిన.. బీజేపీ గోవాలో సైతం పూర్తి ఆధిక్యం చూపిస్తోంది. మణిపూర్‌లో మొత్తం 60 స్థానాల్లో 31 స్థానంలో ఆధిక్యంలో ఉండగా.. 7 స్థానాల్లో కాంగ్రెస్, 10 స్థానాల్లో ఎన్‌పీపీ, 6 స్థానాల్లో ఎన్‌పీఎఫ్, ఇతరులు 6 స్థానాల్లో ఆదిక్యత కనబరుస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే మణిపూర్‌లో సైతం బీజేపీ అధికారంలోకి రానుండగా.. గోవాలో మాత్రం హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. గోవాలో మొత్తం 40 సీట్లు ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటుకు 21 సీట్లు గెలవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ 18 స్థానాల్లో హవా నడిపిస్తుండగా.. కాంగ్రెస్ 12, టీఎంసీ 4, ఆప్ 2, ఇతరులు 4 స్థానాల్లో తమ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే గోవాలో హంగ్ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.
యూపీ, యూకే, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఆధిక్యం కనబర్చిన బీజేపీ పంజాబ్‌లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ధాటికి చతికిలపడింది. మొత్తం 117 స్థానాల్లో 91 స్థానంలో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 17, బీజేపీ 2, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నాయి. పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 59 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే 91 స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతుండడంతో పంజాబ్‌లో ఆ పార్టీ అధికారంలోకి రావడం దాదాపు ఖరారైంది. అయితే మిగిలిన రాష్ట్రాల్లో దూసుకెళ్లిన బీజేపీ, పంజాబ్‌లో మాత్రం ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.