భాషతో సంబంధం లేకుండా అభిమానులకు సంపాందించుకున్న హీరో రజనీకాంత్. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయనకు జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ స్టైల్ అన్నా, డైలాగ్ డెలీవరి అన్నా ఇప్పటికీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారు. అటువంటి రజనీకాంత్ నుంచి ‘వేట్టయన్’ సినిమా రానుండటంతో సహజంగానే దేశవ్యాప్తంగా మంచి హైప్ ఏర్పడింది. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌పై తెలుగు ఆడియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ #BoycottVettaiyanInTelugu హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్స్‌లో ట్రెండ్ చేస్తున్నారు.
‘తెలుగు ప్రేక్షకులంటే లోకువా’
రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేట్టయన్’. ఈ మూవీలో రజినీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు. ‘వేట్టయన్’ అంటే తెలుగులో వేటగాడు అని అర్థం. అయితే తమిళంలో పెట్టిన వేట్టయన్ టైటిల్‌నే తెలుగులోనూ మక్కీకి మక్కీ దించారు. దీనిని తెలుగు ఆడియన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో వేటగాడు అనే పదం ఉన్నప్పటికీ తమిళ టైటిల్‌నే తెలుగులో పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు అంత లోకవయ్యారా? అంటూ నిలదీస్తున్నారు. బాషాభిమానం ఉన్నది మేకేనా? తెలుగు వారికి లేదనకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేట్టయన్‌ను తెలుగు బహిష్కరించాలంటూ ఎక్స్ వేదికగా హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
ఆ సినిమాలు కూడా అంతే!
కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారని తెలుగు ఆడియన్స్‌కు పేరుంది. తమిళంలో ఫ్లాప్ అయిన చిత్రాలు సైతం తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు ‘డబ్బింగ్’ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టేవారు. ఇతర భాషలలో ఉండే బోర్డులని చక్కగా తెలుగులోకి మార్చేవారు. ఇప్పుడు అదంతా మానేసి నేరుగా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ‘కంగువ’, ‘వేట్టయన్’, ‘తంగలాన్’, ‘రాయన్’ ‘వలిమై’ వంటి తమిళ టైటిల్స్‌ను తెలుగులో అదే పేరుతో తీసుకురావడాన్ని తెలుగు ఆడియన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. చక్కగా తెలుగు టైటిల్స్ పెట్టొచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. తెలుగును గౌరవించని వారిని తెలుగు ఆడియన్స్ ఆదరించరని స్పష్టం చేస్తున్నారు.
తెలుగు భాష వద్దా!
గతంలో తమిళ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తుంటే మణిరత్నం లాంటి దర్శకులు తెలుగు డైలాగులు, పాటలు దగ్గరుంచి రాయించుకునేవారు. నేరుగా తెలుగు సినిమా చూస్తున్న భావన కలిగేది. ఘర్షణ, సఖి, యువ, చెలియా లాంటి మంచి మంచి టైటిళ్లు పెట్టడం చూశాం. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం మారిపోయింది. డబ్బింగ్, పాటల విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు. తమిళ వాసనలు గుప్పుమంటున్నాయి. ఇక టైటిల్స్ సంగతి సరే సరి. రజినీకాంత్ లాంటి హీరో కూడా ‘వేట్టయాన్’ టైటిల్ విషయంలో అభ్యంతరం పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు ఆడియన్స్ డబ్బు కావాలి కానీ భాష వద్దా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.