• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Celebrities In Politics: పవన్‌ కల్యాణ్‌ To కంగనా రనౌత్‌.. ఎన్నికల్లో సత్తా చాటిన సెలబ్రిటీలు వీరే!

    దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినీ పరిశ్రమ నుంచి వచ్చి ప్రముఖ రాజకీయ నేతలుగా ఎదిగిన వారు దేశంలో చాలామందే ఉన్నారు. అందులో కొందరు పార్టీలు పెట్టగా, మరికొందరు వివిధ పార్టీల్లో చేరి విజయాలను అందుకున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలు సహా.. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మంగళవారం (జూన్‌ 4) ఓట్ల లెక్కింపు జరగ్గా.. పలువురు సెలబ్రిటీలు గణనీయమైన విక్టరీని సొంతం చేసుకున్నారు. మరికొందరు ఓటమీని చవిచూశారు. వారెవరో ఈ కథనంలో తెలుసుకుందాం. 

    పవన్‌ కల్యాణ్‌ (ఆంధ్రప్రదేశ్‌)

    జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) 2024 ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారారు. అధికార వైకాపా ప్రభుత్వాన్ని కూలతోసే లక్ష్యంతో పని చేసి సక్సెస్‌ అయ్యారు. ఆయన ప్రోత్సాహంతో ఏర్పడిన ఎన్‌డీఏ (టీడీపీ + జనసేన + భాజపా) కూటమి 175 సీట్లకు గాను ఏకంగా 164 కైవసం (టీడీపీ 135, జనసేన 21, భాజపా 8) చేసుకుంది. అటు 25కు గాను 21 ఎంపీ స్థానాలను (టీడీపీ 16, భాజపా 3, జనసేన 2) సొంతం చేసుకుంది. పొత్తులో భాగంగా పవన్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా 100స్ట్రైక్‌రేట్‌తో అన్ని స్థానాల్లో విజయ దుందుభి మోగించడం విశేషం. పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నియోజక వర్గం నుంచి 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీ అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో కొలువుదీరనున్న ఏపీ ప్రభుత్వంలో పవన్‌ కీలక పాత్ర పోషించనున్నారు. 

    నందమూరి బాలకృష్ణ (ఆంధ్రప్రదేశ్‌)

    హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై (TN Deepika) ఆయన 31,602 ఓట్లతో గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. ఎన్టీ రామారావు (Sr NTR) రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే కంచుకోటగా ఉన్న హిందూపురంలో.. బాలకృష్ణ 2014 నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు.

    కంగనా రనౌత్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌)

    హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (భాజపా తరఫున) అరంగేట్రంలోనే విజయం సాధించారు.  కాంగ్రెస్‌ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌పై 74వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

    హేమామాలిని (ఉత్తర్‌ ప్రదేశ్‌)

    ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ హేమమాలిని.. ఈ దఫా కూడా ఎన్నికల్లో నిలబడి సత్తా చాటారు. యూపీలోని మథుర నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ముకేశ్‌ ధంగర్‌పై 2.93 లక్షల మెజార్టీతో ఆమె గెలుపొందారు. 

    రవి కిషన్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌)

    ‘రేసు గుర్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు రవికిషన్‌ కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో మంచి విజయాన్ని అందుకున్నారు. గోరఖ్‌పుర్‌ (యూపీ)లో తన సమీప ప్రత్యర్థి భోజ్‌పురి నటి కాజల్‌ నిషాద్‌ (ఎస్పీ)పై లక్ష ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. 

    శతృఘ్న సిన్హా (బెంగాల్‌)

    సీనియర్‌ సినీ నటుడు, అసన్‌సోల్‌ సిట్టింగ్‌ ఎంపీ శతృఘ్న సిన్హా (టీఎంసీ) వరుసగా రెండోసారి విజయం సాధించారు. భాజపా అభ్యర్థి ఎస్‌.ఎస్‌ అహ్లూవాలియాపై దాదాపు 60వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

    సురేశ్‌ గోపి (కేరళ)

    సినీయర్‌ మలయాళ నటుడు సురేశ్‌ గోపి కేరళలో భాజపాకు తొలి విజయాన్ని అందజేశాడు. త్రిసూర్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సురేశ్‌ గోపి 74వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో భాజపా తొలిసారి కేరళలో బోణి చేసినట్లైంది. 

    మనోజ్‌ తివారి (ఢిల్లీ)

    నార్త్‌ ఈస్ట్‌ దిల్లీ నుంచి భోజ్‌పురి నటుడు మనోజ్‌ తివారీ భాజపా అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేశారు. తాజా ఫలితాల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై 1,38,778 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 

    అరుణ్‌ గోవిల్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌)

    బుల్లితెరపై రాముడిగా అలరించిన ప్రముఖ నటుడు అరుణ్‌ గోవిల్‌ (భాజపా).. ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మేరఠ్‌లో తన సమీప ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మపై 10,585 ఓట్ల ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయాన్ని కైవసం చేసుకున్నారు. 

    విజయ్‌ వసంత్‌ (తమిళనాడు)

    తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ, తమిళ నటుడు విజయ్‌ వసంత్‌ తన సమీప భాజపా అభ్యర్థి పొన్‌ రాధాకృష్ణన్‌పై 1,79,097 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

    దీపక్‌ అధికారి (బెంగాల్‌)

    బెంగాల్‌లోని ఘటల్‌ నుంచి తృణమూల్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన సినీ నటుడు దీపక్‌ అధికారి అలియాస్‌ దేవ్‌ తన సమీప భాజపా అభ్యర్థి, సినీ నటుడు హిరణ్మయ్‌ ఛటోపాధ్యాయపై 1.82 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు.

    ఓడిపోయిన సెలబ్రిటీలు

    నవనీత్‌ రాణా (మహారాష్ట్ర)

    తెలుగులో పలు సినిమాల్లో అలరించిన నటి నవనీత్‌ రాణా వరుసగా రెండోసారి అమరావతి (మహారాష్ట్ర) నుంచి తలపడ్డారు. అయితే.. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్వంత్‌ బసవంత్‌ వాంఖడే చేతిలో 19 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

    లాకెట్‌ ఛటర్జీ (బెంగాల్‌)

    పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి సినీ నటి, సిట్టింగ్‌ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ (భాజపా) మరోసారి ఇదే స్థానం నుంచి బరిలో దిగారు. ఆమెకు పోటీగా టీఎంసీ మరో ప్రముఖ నటి రచనా బెనర్జీని నిలబెట్టింది. ఈ క్రమంలోనే రచన 76 వేల ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv