లోకంలో నాన్నలందరూ ఒకేలా ఉండరు. ఒక్కొకరిది ఒక్కో తీరు. ఒకరితో మరొకరికి పోలిక ఉండదు. కొందరు కుటుంబ బాధ్యతల్ని స్వయంగా చూసుకుంటారు. మరికొందరు భార్యతో పంచుకుంటారు. కొన్ని సినిమాల్లోని ఫాదర్ల క్యారెక్టర్‌ని చూస్తే.. అరెరే అచ్చం మా నాన్న లాగే ఉన్నాడే అంటూ పోల్చుకుంటారు. అయితే, కొన్ని సినిమాల్లోని తండ్రి పాత్రలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాన్న అంటే ఇలాగే ఉండాలన్న స్ఫూర్తిని కలిగిస్తాయి. ఫాదర్స్ డే(జూన్ 18) సందర్భంగా ఆ సినిమాలేంటో ఓ సారి చూసేద్దాం.
బొమ్మరిల్లు
నాన్న పాత్ర అంటే మనందరికీ మొదటగా గుర్తొచ్చేది బొమ్మరిల్లు సినిమానే. ‘మీ నాన్న బొమ్మరిల్లు ఫాదర్‌రా..!’ అనేంతలా ప్రాచుర్యం పొందిందీ పాత్ర. ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. సిద్ధార్థ్‌కి తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ జీవించాడు. కొడుకుకి ప్రతీ విషయంలో ‘ది బెస్ట్’ ఇవ్వాలని ఆరాటపడే తండ్రిగా అదరగొట్టాడు. పెంపకంలో తీసుకునే అతి జాగ్రత్తల వల్ల పిల్లలు స్వేచ్ఛ కోల్పోతారన్న వాస్తవాన్ని చివరికి అంగీకరిస్తాడు. అందుకే ఈ పాత్ర ప్రత్యేకం.
సుస్వాగతం
సుస్వాగతం సినిమాలో తండ్రి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పవన్ కళ్యాణ్‌కు తండ్రిగా రఘువరన్ నటించాడు. వైద్యుడిగా, బాధ్యతాయుత తండ్రి పాత్రలో రఘువరన్ ఇరగదీశాడు. అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తూ కొడుకును ఇలా ప్రోత్సహించే తండ్రి ఉండాలని ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది. 1997లో ఈ సినిమా విడుదలైంది.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఈ సినిమాలో తండ్రి పాత్ర నిడివి తక్కువే ఉన్నా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వెంకటేష్‌కి తండ్రిగా కోట శ్రీనివాసరావు నటించాడు. తల్లి లేని పిల్లాడికి బాధ్యతగల తండ్రిగా, ప్రభుత్వ ఉద్యోగిగా కోట జీవించేశాడు. కొడుకు కోసం అవసరమైతే ఒక మెట్టు కిందకి దిగడానికైనా తండ్రి సిద్ధంగా ఉంటాడని సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా మంది తండ్రులకి కొడుకంటే ప్రేమ ఉంటుంది. కానీ, చూపించుకోలేరు. ఈ సినిమాలో మాదిరిగా దాన్ని సందర్భానుసారంగా బయటపెడతారు. మీ నాన్న క్యారెక్టర్ కూడా ఇదే అయ్యుంటుంది కదా.
ఆకాశమంత
కూతురిది, నాన్నది విడదీయలేని అనుబంధం. పంచ ప్రాణాలు పణంగా పెట్టి కూతురిని కాపాడుకుంటాడు తండ్రి. ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతాడు. ఆకాశమంత సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్ర ఇలాంటిదే. త్రిషకు తండ్రిగా ప్రకాశ్‌రాజ్ నటించాడు. ఓ కూతురుపై తండ్రికి ఉండే ప్రేమ, బాధ్యత ఎలా ఉంటుందో ఇందులో చూడొచ్చు. స్కూల్‌లో అడ్మిషన్ నుంచి కూతురి ప్రేమ పెళ్లిని అంగీకరించడం వరకు తండ్రి చూపించే ప్రేమకు ఇది నిదర్శనం. నిజ జీవితంలోనూ ప్రకాశ్ రాజ్ లాంటి నాన్నలు ఎంతో మంది ఉంటారు.
నాన్నకు ప్రేమతో
ఏ తండ్రైనా కొడుకులను గొప్పగా, కష్టం రాకుండా పెంచాలని అనుకుంటాడు. బిడ్డలు అడిగిందల్లా ఇచ్చేస్తుంటాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటించాడు. కుమారుల ఆకలిని తీర్చడానికి తండ్రి ఎంతకైనా తగ్గుతాడనే విషయం సినిమాలోని కొన్ని సీన్లు నిరూపిస్తాయి. కష్టపడి పెంచాల్సిన అవసరం తండ్రికి ఉంటుందేమో కానీ కష్టపడి పెరగాల్సిన అవసరం బిడ్డలకు ఉండదని నిరూపిస్తాడు. బిడ్డల భవిష్యత్తు కోసం త్యాగం చేసే తండ్రులెందరో.
చందమామ
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలకు తండ్రిగా నాగబాబు, హీరోలకు తండ్రిగా ఆహుతి ప్రసాద్ నటించారు. ముఖ్యంగా నాగబాబు నటన ఆకట్టుకుంటుంది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన ఆడపిల్లలను మెట్టింటికి పంపాలంటే ఆ బాధ వర్ణణాతీతం. కూతుర్ల ప్రేమను అర్థం చేసుకునే ఔదార్యం కలిగిన తండ్రిగా నాగబాబు మెప్పించాడు. ఇలా బిడ్డల మనసులను అర్థం చేసుకునే హృదయం ప్రతి తండ్రికీ ఉంటుంది.
నువ్వే నువ్వే
కూతురు అడిగితే చందమామనైనా తెచ్చిచ్చే తండ్రి పాత్ర ఈ సినిమాలో ఉంటుంది. నటి శ్రియకు తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించాడు. కూతురుకి నచ్చిన ప్రతి ఒక్కటి ఇచ్చే తండ్రి.. కోరుకున్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయడంలో మాత్రం ఎందుకు వెనకాడతాడని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రేమగా పెంచుకున్న పిల్లల భవిష్యత్తుపై తండ్రికి ఉండే ఆందోళన ఎలాంటిదో అర్థమవుతుంది. ప్రకాశ్ రాజ్ నటన అద్భుతం.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!