టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘గామి’ (Gaami). దర్శకుడు విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita) తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం (మార్చి 8) ప్రేక్షకుల ముందుకు రానుంది. వినూత్న కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. హాలీవుడ్ స్థాయిలో విజువల్ ట్రీట్ ఉండటంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ చిత్రంపైకి మళ్లింది. ప్రేక్షకులకు ఈ సినిమా ఒక గొప్ప అనుభూతిని పంచుతుందని మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్టు షాకిచ్చింది.
సెన్సార్ పూర్తి.. కానీ!
ప్రామిసింగ్ కంటెంట్‌తో వస్తోన్న ‘గామి’ చిత్రం.. సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్ లభించినట్లు వారు ప్రకటించారు. ‘గామి’ట్రైలర్‌లోని విజువల్స్ బట్టి చూస్తే డెఫినెట్‌గా ఈ మూవీకి యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ వస్తుందని అంతా భావించారు. కానీ సెన్సార్ బోర్డు.. అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఈ చిత్రంలో పెద్దలు మాత్రమే చూసే కంటెంట్ ఉండబోతున్నట్లు ‘ఏ’ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని బట్టి తెలుస్తోంది. ఇంతకీ ఆ సన్నివేశాలు ఏంటా అని తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.
‘నా కెరీర్‌లో గామి చివరిది’
‘గామి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విశ్వక్ సేన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడ గామి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గామి సినిమా నాకే కాదు ఆడియన్స్ కి కూడా చాలా ప్రత్యేకం. దాదాపు ఆరు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నాం. కథ, కథనం, విజువల్స్, గ్రాఫిక్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఆడియన్స్‌కి ఒక సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఇలాంటి సినిమా రావడం చాలా అరుదు. నా కెరీర్‌లో నేను చేస్తున్న చివరి ప్రయోగాత్మక చిత్రం కూడా ఇదే. ఇక నుండి నేను చేసే సినిమాలు వేరే లెవల్లో ఉంటాయి. ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తా’ అని అన్నాడు.
‘ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి’
‘కలర్ ఫొటో’ ఫేమ్ చాందినీ చౌదరి (Chandini Chowdary) ‘గామి’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఆమె సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘వారణాసి, కుంభమేళా, కాశ్మీర్, హిమాలయాలు.. ఇలా రియల్ లొకేషన్స్‌లో ‘గామి’ని చిత్రీకరించాం. షూటింగ్‌లో చాలా సవాల్‌తో కూడిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ సినిమా ప్రయాణం ఒక సాహస యాత్రలా జరిగింది. ఐమ్యాక్స్ స్క్రీన్‌లో మా మూవీ ట్రైలర్ చూసినప్పుడు మా కష్టానికి ప్రతిఫలం లభించిందనే ఆనందంతో నాకు కన్నీళ్లు వచ్చాయి’ అని చాందిని తెలిపింది.
విశ్వక్ పారితోషికం ఏంతంటే?
హీరో విష్వక్ సేన్ గత ఆరేళ్లుగా ‘గామి’ సినిమా కోసం పని చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాకు అతడి రెమ్యూనరేషన్ ఎంత అయ్యి ఉండవచ్చని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అయితే ఈ సినిమా కోసం విశ్వక్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆరేళ్ల క్రితమే సినిమా ప్రారంభం కాగా.. అప్పటికీ విష్వక్‌కు ఈ స్థాయిలో ఫేమ్ లేదు. దీంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ సినిమాను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాలకు తగ్గట్లు విష్వక్‌కు భారీ మెుత్తమే ముట్టే అవకాశముంది.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి