శ్రీయ ప్రధాన పాత్రలో నటించిన ‘గమనం’ సినిమా ఎక్కువ హడావిడి లేకుండా.. ఈరోజు థియేటర్లలో రిలీజైంది. శ్రీయ, ప్రియాంక జువాల్కర్, నిత్యామీనన్ వంటి నటులు నటించడం..ఒక కొత్త దర్శకురాలు సినిమాకు ఇళయారాజా మ్యూజిక్ అందించడం వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మరి సినిమా స్టోరీ ఏంటి ఎలా ఉంది తెలుసుకుందాం.
గమనం సినిమా మూడుకథల సమాహారం. కమల (శ్రీయ శరణ్) తన చిన్నపాపతో దుబాయ్‌కి వెళ్లిన తన భర్త తిరిగొస్తాడని ఆశగా ఎదురుచూస్తుంటుంది. మరో కథలో ఆలీ(శివ కందుకూరి) పెద్ద క్రికెటర్ అవ్వాలని కలలు కంటాడు. పక్కింటి అమ్మాయి జారాని (ప్రియాంక జువాల్కర్) ప్రేమిస్తాడు. మూడో కథలో ఇద్దరు అనాథ పిల్లలు తమ బర్త్‌డేకి కేక్ కొనుక్కోవడం కోసం మూడు వందల రూపాయలు ఎలాగైనా సంపాదించాలని కష్టపడుతుంటారు. అదే సమయంలో హైదరాబాద్‌లో వరదలు వస్తాయి. ఆ ప్రకృతి విపత్తుతో ఈ మూడు కథలు ఎలా మలుపు తిరిగాయి. వాళ్లు కన్న కలలు నేరవేరాయా లేదా సినిమా చూసి తెలుసుకోవాలి.
మూడు లేదా నాలుగు వేర్వేరు స్టోరీలతో వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఈ మధ్యకాలంలో చాలానే వస్తున్నాయి. అందులో ప్రేక్షకులకు కనెక్ట్ అయిన స్టోరీస్‌కు అదరణ లభిస్తుంది. అయితే అలాంటి కథనే తెరపైకి తీసుకొచ్చింది దర్శకురాలు సుజనా రావు. ఇలా మూడు కథలతో స్టోరీ అల్లితే బాగానే ఉంటుంది. కానీ అది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండాలి.
ఫస్టాఫ్ మొత్తం పాత్రల్ని పరిచయం చేయడం.. వాళ్ల స్టోరీలను తెలియజేయడంలోనే ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో వేగం ఏమైనా పెరుగుతుందా అంటే అది కూడా లేదనే చెపపాలి. కథ చెప్పేటప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి..ఆ పాత్రలు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలి.. కానీ డాక్యుమెంటరీ చూస్తున్నట్లు ఉండకూడదు. స్టోరీపై ఆసక్తి పెంచడంతో విఫలమైంది చిత్రం. హైదరాబాద్ వరదలు, వీధిబాలల జీవితం, సమాజంలో ప్రేమకు ఉన్న అడ్డంకులు వంటి చక్కని బలమైన అంశాలు ఉన్నప్పటికీ వాటిని వెండితెరపై చూపించడంలో తడబడ్డారు.
అయితే క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. నిత్యామీనన్ గెస్ట్ రోల్‌లో మెరుస్తుంది. ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం, సీనిమాటోగ్రఫర్ జ్ఞానశేఖర్, మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా లాంటి ప్రముఖులు పనిచేయడం చెప్పుకోదగ్గ విషయం. చెవులు వినిపించని ఒక మహిళ పాత్రలో శ్రీయ జీవించేసింది. ప్రేమికులుగా నటించిన శివ కందుకూరి, ప్రియాంకలు అంతగా ఆకట్టుకోలేదు. ఇద్దరు అనాథ పిల్లలు చాలా చక్కగా నటించారు.
రేటింగ్ 2.5/5