పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం పవన్ చేతిలో ‘ఓజీ’ (OG), ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. క్రిష్ (Krish) దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’ మినహా మిగిలిన రెండు చిత్రాలకు సంబంధించి అడపాదడపా ఏదోక అప్‌డేట్ వస్తూనే ఉంది. దీంతో పవన్ – క్రిష్ చిత్రంపై అభిమానుల్లో ఆశలు సన్నగిల్లుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ నవమి (ఏప్రిల్ 17)ని పురస్కరించుకొని హరి హర వీరమల్లు యూనిట్ అదిరిపోయే అప్‌డేట్‌ను అందించింది. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
‘ధర్మం కోసం యుద్ధం’.. త్వరలో!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఇవాళ (ఏప్రిల్ 17) శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మీ ముందుకు… ‘ధర్మం కోసం యుద్ధం’.. త్వరలో’ అని క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ట్వీట్‌కు మెగా ఫ్యాన్స్ ‘వెయిటింగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో అని కాకుండా ఒక డేట్‌ను అనౌన్స్ చేసి ఉంటే బాగుండేదని పోస్టులు పెడుతున్నారు.
ఆందోళనలకు చెక్!
పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో బిజీ కావడంతో ఆయన చేతిలోని చిత్రాలన్నీ హోల్డ్‌లో పడిపోయాయి. అసలు విడుదలవుతాయా? లేదా? అనే సందేహాలు మెగా అభిమానుల్లో మొదలయ్యాయి. ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ పైన ఎక్కువ అనుమానాలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ మెుదలై మూడేళ్లు దాటినా.. ఇప్పటివరకు విడుదల తేదీపై క్లారిటీ లేదు. పైగా డైరెక్టర్ క్రిష్.. అనుష్కతో ఓ సినిమాకు కూడా అనౌన్స్ చేయడంతో ఇక హరిహర వీరమల్లు ఇప్పట్లో రానట్లేనని అంతా భావించారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హరిహర వీరమల్లు నుంచి అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్‌లో ఆశలు మళ్లీ చిగురించాయి.