ఆంగ్లేయులకు ఎదురు నిలబడి పోరాడి, తెల్ల దొరల తలలు తిరిగేలా చేసిన వీరుల్లో తెలుగు గడ్డ మీద పుట్టిన బిడ్డ అల్లూరి సీతారామరాజు ఒకరు. అడవినైనా తగలబెట్టేందుకు నిప్పు రవ్వ చాలన్నట్లు…ఒక్కడే సైన్యాన్ని నిర్మించుకుని ఉద్యమ బాట సాగించారు. ఆంగ్లేయుల అరాచకాలకు ఎదురొడ్డి గిరిజన బిడ్డలకు అండగా నిలిచాడు. చివరికి బ్రిటిష్ వారి చేతికి చిక్కి అమరుడయ్యారు. జూలై 4న ఏటా ఏపీ ప్రభుత్వం అధికారికంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. 125వ జయంతి సందర్భంగా ఈ ఏడు భీమవరంలో 30 అడుగుల కాంస్య విగ్రాహన్ని ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఈ మన్యం వీరుడి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
బాల్యం, చదువు
జులై 4, 1897లో పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో అల్లూరి వంశంలో పుట్టిన సీతారామరాజును చిన్నప్పుడు చిట్టిబాబు అని పిలిచేవారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి కష్టాల కడలిని ఈదుతూ పెరిగాడు. అల్లూరి చిన్నతనంలో చదువు అంత గొప్పగా ఏం సాగలేదు. ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలతో పాఠాలు ఒంటబట్టలేదు. ఓ సారి ప్రధానోపాధ్యాయుడు కొట్టడంతో పూర్తిగా చదువు మానేశాడు. 1918 వరకు తల్లితోనే తునిలో ఉన్నాడు. ఆ సమయంలో గిరిజన జీవన విధానాన్ని దగ్గరగా చూశాడు. అప్పుడే జ్యోతిష్యం, హఠయోగం, సంస్కృతం వంటివి నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి దైవభక్తి, నాయకత్వ లక్షణాలు ఉన్న రామరాజు తుని సమీపంలోని ఓ కొండపై కొంతకాలం తపస్సు కూడా చేశాడు. పాఠశాల రోజుల్లోనే గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నాడు.
ఉద్యమ భావాలకు నాంది
అల్లూరి సీతారామ రాజులో ఉద్యమ భావాలకు నాంది పడింది ఆయన భారతదేశ పర్యటనలోనే. 1916లో తొలిసారి అల్లూరి ఉత్తర భారత యాత్రకు వెళ్లాడు. సురేంద్ర నాథ్ బెనర్జీ వంటి వ్యక్తులను కలుసుకోవడం, కాంగ్రెస్ మహాసభకు హాజరవడం ఆయనలో ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. అక్కడే ఆయన సన్యాస దీక్ష కూడా స్వీకరించి యోగిగా తిరిగొచ్చాడు. ఈ యాత్రలో అనేక భాషలు, విద్యలను కూడా అభ్యసించాడు. ఆ తర్వాత 1918లో మరోసారి యాత్రకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత అనేక యుద్ధవిద్యలు, ఆయుర్వేదంలో పట్టు ఉండటంతో మన్యం ప్రజలకు రాజు త్వరగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే వారి కష్టాలను తీర్చడానికి కృషి చేసేవాడు. బ్రిటిష్ ప్రభుత్వ అధికారుల దురాగతాలకు ఎదురు నిలుస్తూ… గిరిజనులను ఏకం చేసి పోరాడేవాడు. కోయ గిరిజన సోదరులు, మల్లం దొర, ఘంటం దొర రామ రాజుకు తోడయ్యారు. మొదట సమస్యలపై దరఖాస్తులు, వినతులు ఇచ్చేవారు. కానీ బ్రిటిషు వారు పట్టించుకోకపోవడంతో ఉద్యమమే మార్గమని నిర్ణయించుకుని పోరాట బాట పట్టారు. ఈ క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజుల్లో 60 ఎకరాల భూమి ఇస్తానన్నా రామరాజు తిరస్కరించారు.
రంప ఉద్యమం
1922-24 వరకు సాగిన రంప ఉద్యమం బ్రిటీషు వారికి చుక్కలు చూపించింది. పరిమిత వనరులు, బాణాల వంటి ఆయుధాలతోనే రామరాజు తెల్లదొరల పాలిట సింహస్వప్నంగా మారారు. అటవీ సంపదను దోచుకునేలా తీసుకొచ్చిన చట్టాలు, కూలీ వ్యవస్థతో గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై అల్లూరి పోరాటం సాగించారు. అయితే సాంప్రదాయ ఆయుధాలతో బ్రిటీష్ వారితో పోరాడలేమని గ్రహించిన అల్లూరి 300 మంది వీరులతో…. చింతపల్లి, కృష్ణ దేవపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల తదితర పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు సేకరించారు. ఇలా బ్రిటీష్ వారిపై తిరగబడుతున్న రాజుకు గిరిజన జనంలో పేరు ప్రతిష్ఠ పెరుగుతూ వచ్చింది. దమ్ముంటే ఎదురుగా ఢీ కొనమని రామరాజు బ్రిటీష్ వారికి సవాల్ కూడా విసిరేవాడు. అయితే డిసెంబర్లో విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. పెదగడ్డపాలెంలో ఎదురుకాల్పుల్లో రాజు దళంలో అనేకమంది చనిపోయారు. ఆ తర్వాత 4నెలలు స్తబ్దుగా ఉండి 1923లో మళ్లీ పోరాటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి రామరాజుకు వైరం తీవ్రమైంది.
వీరమరణం
1924లో బ్రిటీషు వారు రాజు కోసం రూథర్ ఫోర్డ్ అనే ప్రత్యేక అధికారిని నియమించారు. రూథర్ ఫోర్డ్ అల్లూరి జాడ తెలపమని గిరిజనులను తీవ్రంగా వేధించేవాడు. చంపేస్తామని బహిరంగ ప్రకటనలు కూడా చేశాడు. అల్లూరి తలపై రివార్డులు ప్రకటించారు.గిరిజనులపై వేధింపులతో చలించిన అల్లూరి తాను ఉన్నచోటును పోలీసులకు కబురు పంపాడు. 1924మే 7న ఎటువంటి విచారణ లేకుండానే చెట్టుకు కట్టేసి అల్లూరి బ్రిటీష్ అధికారులు కాల్చి చంపారు.
మరణానంతరం రాజు పేరు మార్మోగిపోయింది. పోరాటయోధుడిగా కీర్తి గడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్లూరి 125 జయంతి సందర్భంగా భీమవరంలో ప్రతిష్ఠాపించిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?