‘క్రాక్’ తర్వాత మంచి జోష్ మీద ఉన్న రవితేజ వరుస సినిమాలు ప్రకటించాడు. అందులో ‘ఖిలాడి’ నేడు థియేటర్లలో రిలీజైంది. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు. కోనేరు సత్యనారాయణ నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి మూవీ ఆశించిన స్థాయిలో ఉందా ఇంతకీ కథేంటి ఎలా ఉందో తెలుసుకుందాం.
క్రిమినల్ సైకాలజీ స్టూడెంట్ పూజ (మీనాక్షి చౌదరి), ఇంటలీజెన్స్ ఐజీ జయరాం కూతురు. తన థీసెస్ కోసం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మోహన్ గాంధీ(రవితేజ)ని కలుస్తుంది. మోహన్ గాంధీ తనను తప్పుడు కేసులో ఇరికించి జైలులో పెట్టారని ఒక కట్టు కథ చెప్తాడు. అది నిజమని నమ్మిన పూజ తన తండ్రి సంతకం ఫోర్జరీ చేసి గాంధీని జైలు నుంచి విడిపిస్తుంది. అయితే అప్పుడే అసలు నిజం బయటపడుతుంది. మోహన్ గాంధీ ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ అని, హోం మంత్రి వద్ద డబ్బు కొట్టేసేందుకు విదేశాల నుంచి వచ్చాడని తెలుస్తుంది. దీనికోసం తనను వాడుకున్నాడని అప్పుడు పూజా అర్థం చేసుకుంటుంది. మరి ఇంతకీ ఆ డబ్బు కథేంటి. అది కొట్టేయడానికి మోహన్ గాంధీ ఎందుకొచ్చాడు డింపుల్ హయతి, అనసూయ పాత్ర ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే
ఈ కథ మొత్తం రూ.10 వేల కోట్ల చుట్టూ తిరుగుతుంది. దానికి కాస్త ఫ్యామిలీ డ్రామాను యాడ్ చేశారు. రూ.10 వేల కోట్ల కోసం రవితేజతో పాటు రెండు ముఠాలు తిరుగుతుంటాయి. వారిని పట్టుకునే సీబీఐ ఆఫీసర్ పాత్రలో సీనియర్ హీరో అర్జున్ నటించాడు. ప్రారంభంలో కథ కాస్త థ్రిల్లింగ్‌గా కనిపించినా హీరో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సన్నివేశాలు పేలవంగా అనిపిస్తాయి. డింపుల్, రవితేజ మధ్య లవ్‌స్టోరీ రొటీన్‌గా ఉంటుంది. పాటల్లో మాత్రం డింపుల్ హయతి అందాలను ఆరబోసింది. అనసూయ రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. విరామం సమయానికి గాంధీ అసలు స్టోరీని రివీల్ చేయడంతో కాస్త ఆసక్తి పెరుగుతుంది.
సెకండాఫ్‌లో కూడా థ్రిల్లింగ్‌గా ప్రారంభమైన స్టోరీ కాసేపటికే మళ్లీ రొటీన్ ట్రాక్‌లోకి వెళ్తుంది. కథ కోసం తీసుకున్న అంశాలు బాగున్నప్పటికీ కథనం విషయంలో దర్శకుడు రమేశ్ వర్మ మరి కాస్త కసరత్తు చేయాల్సింది. ఎక్కువగా ట్విస్ట్‌లు పెట్టి ప్రేక్షకులను థ్రిల్ చేయాలనే ఆరాటంలో అసలు కథను చెప్పడంలో విఫలమయ్యాడు. సీబీఐ ఆఫీసర్ అర్జున్, గాంధీ మధ్య వచ్చే సన్నివేశాలు కొంత ఆసక్తికరంగా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలు మెప్పిస్తాయి. క్లైమాక్స్ కూడా ఆశించినంతగా లేదు.
రవితేజ ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ ఫర్ఫార్మెన్స్‌తో అలరించాడు. మీనాక్షి, డింపుల్ హయతీల క్యారెక్టర్లకు పెద్దగా స్కోప్ లేదు. కానీ పాటల్లో మాత్రం ఇద్దరూ రెచ్చిపోయారు. అందాలతో డింపుల్, రొమాన్స్‌తో మీనాక్షి కుర్రకారును అలరిస్తారు. ఇక అనసూయ, మరళీ శర్మ, రావు రమేశ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపించారు. వారి పాత్రల మేరకు చక్కగా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నప్పటికీ నేపథ్య సంగీతం అంతగా హైలెట్ కాలేదు. రొటీన్ సన్నివేశాలతో సినిమాను సాగదీసినట్లు అనిపిస్తుంది.
రేటింగ్: 2/5
Celebrities Featured Articles Movie News Telugu Movies
Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్.. కారణం ఇదే!