విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రల్లో నటించారు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ మూవీ విజయంపై చిత్రబృందం చాలా నమ్మకంగా ఉంది. మరి వారి నమ్మకం నిజమైందా? సినిమా అంచనాలను చేరుకుందా? తెలుసుకుందాం.
కథేంటంటే..
లైగర్ (విజయ్‌దేవరకొండ) కరీంనగర్ కుర్రాడు. తల్లి బాలామణి (రమ్యకృష్ణ) టీ అమ్ముతూ కొడుకును పోషిస్తుంటుంది. అయితే లైగర్‌కు నేషనల్ MMA చాంపియన్ కావాలని కోరిక ఉంటుంది. దీనికోసం తల్లి కొడుకును తీసుకొని ముంబయికి వెళ్తుంది. MMAలో ట్రైనింగ్ తీసుకుంటాడు. అదే సమయంలో ముంబయిలో బాగా డబ్బు ఉన్న అమ్మాయి తాన్య(అనన్య పాండే)తో ప్రేమలో పడతాడు. కానీ ఆమె లైగర్‌ను ప్రేమించి మోసం చేస్తుంది. దీంతో హార్ట్‌బ్రేక్ అయిన లైగర్ మళ్లీ కోలుకొని ఫామ్‌లోకి ఎలా వస్తాడు. ఇంటర్నేషనల్ MMA చాంపియన్‌షిప్ ఎలా గెలుస్తాడు అనేదే కథ.
విశ్లేషణ:
సినిమా ప్రారంభంలో 30 నిమిషాల వరకు కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా ప్రేక్షకులకు బోర్ కొట్టడం స్టార్ట్ అవుతుంది. ఇది పూరీ జగన్నాథ్ మార్క్ సినిమాలా అస్సలు కనిపించలేదు. లవ్‌స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమీ లేదు. అనన్య పాండే పాత్ర, ఆమె నటన గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కథలో తర్వాత ఏం జరుగుతుందో అంచనా వేసేలా సాగుతుంది. పూరీ జగన్నాథ్ హీరోల్లో ముఖ్యంగా ప్రేక్షకులకు నచ్చేది డైలాగ్ డెలివరి. కానీ ఈ సినిమాలో డైలాగ్స్‌లో లేకుండా హీరోకు నత్తి పెట్టడంతో అది పెద్ద మైనస్ పాయింట్‌గా మారింది. క్లైమాక్స్‌లో వచ్చే మైక్ టైసన్ పాత్ర కూడా పవర్‌ఫుల్‌గా ఏమీ లేదు. అంత పెద్ద లెజెండ్‌ను ఈ సినిమాకు సరిగ్గా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది. పాటలు బాగున్నప్పటికీ సందర్భం లేకుండా వచ్చి చిరాకు తెప్పిస్తుంటాయి.
కానీ విజయ్‌దేవరకొండ రెండేళ్ల పాటు బాడీని పెంచి సినిమా కోసం పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఆయన నటనలో కూడా చాలా నిజాయితీ ఉంది. కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో కష్టమంతా వృథా అయినట్లు అనిపిస్తుంది. రమ్యకృష్ణ పాత్ర, ఆమె నటన కూడా బాగున్నాయి. శివగామి తర్వాత మరో పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించింది. కానీ అది సినిమాకు ప్లస్ కాలేదు. డబ్బింగ్ కూడా చిరాకు తెప్పించింది. తెరపై వాళ్లు చెప్పే డైలాగ్స్‌కు అసలు సింక్ కుదరలేదు. మొత్తానికి సినిమాపై భారీ అంచనాలు పెంచడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఫ్యాన్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకులను కూడా లైగర్ నిరాశపరిచింది.
సాంకేతిక విషయాలు:
ఈ సినిమాకు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. వాళ్లు హిందీవాళ్లు కావడంతో తెలుగు ప్రేక్షకులకు పాటలు అంత కనెక్టింగ్‌గా అనిపించవు. సునీల్ కశ్యప్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదనిపించింది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. జునైడ్ సిద్దిఖీ ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది.
బలాలు:
విజయ్ దేవరకొడ
ఫస్టాఫ్
బలహీనతలు:
హీరోకి నత్తి పెట్టడం
సెకండాఫ్
సందర్భం లేకుండా వచ్చే పాటలు
ఊహించేలా సాగే కథ
లవ్‌స్టోరీ