• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మేడారం సమ్మక్క- సారక్క జాతరలో ప్రధాన ఘట్టాలు

    ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారక్క ఉత్సవాలకు భక్తులు పొటెత్తుతున్నారు. రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఈ మహా వేడుకకు దాదాపు రెండు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభమేళ అనంతరం అధికమంది పాల్గొనే వేడుక ఇదే కావడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, హిమచల్ ప్రదేశ్ ఇలా పక్కా రాష్ట్రాల ప్రజలే కాకుండా విదేశీయులు కూడ ఈ మహా వేడుకను తిలకించడానికి విచ్చేస్తుంటారు. మరి ఇంతలా ఫేమస్ అయిన ఈ మహా జాతరలో కొన్ని ప్రధాన ఘట్టాలు ఉంటాయి అవేంటో మీరూ తెలుసుకోండి

    మాఘమాసంలో మొదలు

    మేడారం మహాజాతరను మాఘమాసంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి బుధవారం ప్రారంభిస్తారు. నాలుగు రోజులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. కాని ప్రతిసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు వేడుక ప్రారంభంకావడం కష్టమని అందుకే అమ్మవారు కుంకుమ భరిణెగా మారిన రోజైన బుధవారం జాతర ఆరంభమవుతుందని పూజరులు పేర్కొన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత బుధవారం, మాఘశుద్ద పౌర్ణమి ఒకేరోజు కావడం విశేషమని వివరించారు. ఈ వేడుకలను ఎలాంటి మంత్రోచ్చరణలు లేకుండా కోయ పద్ధతిలో గిరిజనులే పూజారులుగా వ్యవహరించి నిర్వహిస్తారు. 

    ప్రథమ ఘట్టం

    జాతర తొలి రోజైన ఫిబ్రవరి 16న ఈ ఘట్టం ప్రారంభమవుతుంది. సమ్మక్క భర్త పగిడిద్ద రాజు, సారలమ్మ, గోవిందరాజులను మేడారం తీసుకొస్తారు. డప్పు దరువుల చప్పుళ్లు, శివసత్తుల పూనకాల నడుమ పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పాదయాత్రగా మేడారానికి వడ్డేలు(గిరిజన పూజరులు) తీసుకొస్తారు. దాదాపు 24 గంటలపాటు ఈ పాదయాత్ర ఘనంగా కొనసాగుతుంది. అలాగే సారలమ్మను కన్నెపల్లి నుంచి, గోవిందరాజును ఏటూరు‌నాగారం మండలం కన్నాయిగూడెం నుంచి తీసుకొచ్చి మేడారంలోని గద్దెలపై కొలువుదీర్చుతారు.

    ద్వితీయ ఘట్టం

    ఫిబ్రవరి 17న జరిగే ఈ వేడుకను జాతరలో ప్రధాన ఘట్టంగా భావిస్తారు. మేడారానికి సమీపంలో ఉన్న చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను వడ్డేలు తీసుకొని వస్తారు. అమ్మవారి ప్రతిరూపంగా భావించే కుంకుమ భ‌ర‌ణికు ఉదయం నుంచి పూజలు నిర్వహించి సాయంత్రం వేళ మేడారానికి తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలోనే లక్షల సంఖ్యలో భక్తులు వేడుకను తిలకించేందుకు వస్తుంటారు.

    తృతీయ ఘట్టం

    సమ్మక్క- సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరి ఫిబ్రవరి 18న భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్లకు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా భావించి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే ఒడిబియ్యం, చీరెసారెలు సమర్పించుకుంటారు. సీఎం కేసీఆర్ శుక్రవారం మేడారం చేరుకొని అమ్మవారిని దర్శించుకోనున్నారు. దేవతలిద్దరు ఒకేరోజు భక్తులకు దర్శనమివ్వడంతో మేడారమంతా భక్తజనసంద్రంగా మారుతుంది.

    ఆఖరి ఘట్టం

    మూడు రోజుల వేడుక అనంతరం ఫిబ్రవరి 19న ఆఖరి ఘట్టాన్ని నిర్వహిస్తారు. గిరిజన పూజారులు(వడ్డేలు) సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నేపల్లికి, పగిడిద్దరాజును పూనుగొండ్ల, గోవిందరాజును కన్నాయిగూడేనికి కాలినడకన తీసుకెళ్తారు. దేవతల వనప్రవేశంతో ఈ మహా జాతర ముగుస్తుంది.

    https://youtu.be/MN_AoRa26pU

    మనుషులే దేవతలుగా మారిన చరిత్ర

    ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఓ మారుమూల గిరిజన ప్రాంతమైన మేడారం మహా జాతరకు వేదికగా మారడం వెనుక ఎన్నో కథనాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువ మంది విశ్వసించే చరిత్ర మాత్రం ఇదే. దాదాపు వెయ్యేళ్ల క్రితం ఓరుగల్లును కేంద్రంగా చేసుకొని కాకతీయులు పరిపాలన సాగించారు. వారికి సామంతులుగా మేడరాజులు ఉండేవారు. ఈ మేడ రాజ్యానికి పగిడిద్దరాజు సామంతునిగా కొనసాగారు. ఇతను సమ్మక్కను వివాహమాడారు. వీరు సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలకు జన్మనిచ్చారు. సారలమ్మని గోవిందరాజు మనువాడారు. 

    అంత ప్రశాంతంగా సాగుతున్న తరుణంలో దాదాపు నాలుగేళ్లపాటు మేడారం రాజ్యంలో విపరీతమైన కరువు సంభవించింది. ప్రజలు పన్ను కట్టలేని పరిస్థితి ఏర్పడింది. కాని కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు మాత్రం పన్ను కట్టితీరాల్సిందేనంటూ పగిడిద్దరాజుకు ఫర్మానా పంపారు. ప్రజలు కట్టే పరిస్థితిలో లేరని పగిడిద్దరాజు చెప్పడంతో కాకతీయ చక్రవర్తి ఆగ్రహంతో యుద్ధం ప్రకటిస్తాడు. ఈ యుద్ధంలో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు, జంపన్న వీరోచితంగా పోరాడి మరణిస్తారు. ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క కదనరంగంలోకి కాలుమోపి కాకతీయుల సైన్యాన్ని హడలెత్తిస్తుంది. కత్తులు, ఈటెలతో వీరోచితంగా ముందడుగు వేస్తుండగా కాకతీయులు ఆమెను వెన్నుపోటు పొడుస్తారు. దీంతో యుద్ధభూమిలో చనిపోవడం ఇష్టంలేక సమ్మక్క చిలకలగుట్ట వైపు వెళ్లి మాయమైతుంది. ఎంత వెతికినా ఆమె జాడ దొరకలేదు. ఆ ప్రాంతంలో కుంకుమ భ‌ర‌ణి మాత్రమే దొరికింది. అందుకే జాతరలో ఆమెకు ప్రతిరూపంగా కుంకుమ భ‌ర‌ణిను చిలకలగుట్ట నుంచి మేడారానికి తీసుకెళ్తారు. ఇలా ప్రజల కోసం ప్రాణాలు వదిలి ఈ గిరిజన మహావీరులు దేవతలుగా మారారు. జంపన్న సంపెంగ వాగులో నేలకొరగడంతో ఆ వాగు కాస్త జంపన్న వాగుగా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv