తారాగణం – అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, అభినవ్ గోమతం, సోనియా దీప్తి, తులసి, జయసుధ, నాజర్
డైరెక్టర్ – పీ మహేష్ బాబు
నిర్మాత – ప్రమోద్ ఉప్పలపాటి, వి.వంశీకృష్ణా రెడ్డి
బ్యానర్ – UV క్రియేషన్స్
సంగీతం – రధన్
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ క్రేజీ కాంబోను థియేటర్లలో చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ఎదురుచూపులకు నేటితో తెరపడింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క చేస్తున్న సినిమా కావడంతో ఆమె ఫ్యాన్స్‌లో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. అలాగే జాతిరత్నాలు మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత నవీన్ 2 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమా ట్రైలర్‌లోనే అనుష్క మెస్మరైజింగ్ లుక్స్, నవీన్ కామెడీ టైమింగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. మూవీ యూనిట్ సైతం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది. ఈ సినిమాలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటించగా, అనుష్క చెఫ్‌గా కనిపించింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? అనుష్క శెట్టికి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిందా లేదో? ఈ సమీక్షలో చూద్దాం..
కథేంటంటే..?
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి శెట్టి( అనుష్క) తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో లండన్ నుంచి ఇండియాకు తిరిగి వస్తుంది. అనారోగ్యంతో తల్లి చనిపోయిన తర్వాత అన్విత ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. తల్లి లేని తనకు మరొకరి తోడు, కుటుంబం అవసరం లేదని భావిస్తుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టి( నవీన్ పొలిశెట్టి) స్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. అసలు అన్విత సిద్దూను ఏమి కోరింది.. సిద్దూ తన ప్రేమ కోసం ఏంచేశాడు? పెళ్లి వద్దనుకున్న అన్విత తన మనసు మార్చుకుందా? అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
స్టాండప్ కామెడియన్ పాత్రలో నవీన్ పొలిశెట్టి ఒదిగిపోయాడు. మరో ఏ హీరో చేసినా తనలాగా సెట్ కాదు అనేలా జీవించాడు. తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బ నవ్వించాడు. తాను బయట ఎలా ఉంటాడో సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్‌లో బాగా పర్ఫామ్ చేశాడు. నవీన్ పొలిశెట్టి తాను కనిపించే ప్రతి ఫ్రేమ్‌లో ఆకట్టుకున్నాడు.
హీరోయిన్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రం చేసింది. ఆధునిక భావాలున్న యువతి పాత్రలో చక్కగా నటించింది. ఎమోషనల్ సీన్స్‌లో జీవించింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్రలో అనుష్క నటించిందనే భావన ఆమె ఫ్యాన్స్‌లో తప్పక కలుగుతుంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో అనుష్క యాక్టింగ్ గూస్‌బంప్స్.
ఎలా ఉందంటే?
రోటిన్ లవ్ స్టోరీస్, సెన్స్‌లెస్ యాక్షన్‌లెస్ సినిమాలతో విసుగెత్తిన ప్రేక్షకులకు ఈ సినిమా ఫ్రేష్ ఫీల్‌ను అయితే అందిస్తుంది. పెళ్లి చేసుకోకుండా తల్లికావాలనుకే ఓ యువతికి.. ఆమెతో ప్రేమలో పడే ఓ యువకుడి సంఘర్షణను డైరెక్టర్ పీ మహేష్ బాబు చక్కగా తెరకెక్కించాడు. లవ్ స్టోరీతో ముడిపడి ఉన్న ‘స్పెర్మ్ డోనేషన్’ వంటి సున్నితమైన కథాంశాన్ని ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాడు.
ఇక సినిమా ఫస్టాప్ ఫుల్ హెలారీయస్‌గా నడుస్తుంది. ఈ క్రెడిట్ నవీన్ పొలిశెట్టికే దక్కుతుంది. నవీన్ స్టేజ్ పర్ఫామెన్స్ కడుపుబ్బ నవ్విస్తుంది. ఫస్ట్ 30 నిమిషాలు కాస్త స్లో అయినప్పటికీ నవీన్ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో సినిమాను ట్రాక్‌లోకి తెచ్చాడు. ఫస్టాఫ్‌లో వన్‌మ్యాన్ షో చేశాడు. నవ్వించే వన్-లైనర్స్‌తో పాటు, సెంటిమెంట్ జోన్‌లోని డైలాగ్‌లు ‘క్రిస్ప్ అండ్ సెన్సిబుల్’గా ఉన్నాయి.
ఇక సెకండాఫ్‌లో సినిమాకు మంచి ఎలివేషన్ సీన్లు పడ్డాయి. ఎమోషనల్‌గా సాగుతుంది. ఫర్టిలిటీ ఎలిమెంట్ కారణంగా కొన్ని సార్లు కామెడీ శృతిమించినట్లు అనిపిస్తుంది. కానీ దానిని డైరెక్టర్ చాలా క్లీన్‌గా మెనేజ్ చేశాడు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి కథాంశం ఎంచుకోవడం పట్ల డైరెక్టర్ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇలాంటి స్టోరీని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాలంటే అంత సులువు కాదు. డైలాగ్స్ రైటింగ్ నుంచి భావోద్వేగాలను పండిచడం వరకు డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
ఇక మిగతా నటీనటుల విషయానికొస్తే.. మురళి శర్మ, అభినవ్ గోమఠం తమ పాత్రల పరిధిమేరకు నటించారు. కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని పండించారు.
బలాలు
- నవీన్ పొలిశెట్టి నటన
- అనుష్క పర్ఫామెన్స్
- వన్‌లైన్ కామెడీ పంచ్‌లు
బలహీనతలు
- సెకండాఫ్‌లో నిడివి ఎక్కువ ఉండటం
- సినిమాలోని పాటలు
టెక్నికల్ పరంగా..
ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా సినిమా చాలా రిచ్ ఫీలింగ్ ఇస్తుంది. నిర్మాణం పరంగా ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదు. రాధన్ అందించిన BGM బాగుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. సెకండాఫ్ కాస్త లాగ్ అనిపించినప్పటికీ క్లైమాక్స్ సీన్లు దానిని కవర్ చేశాయి.
చివరగా..
రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలతో వేగిన ప్రేక్షకులకు.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మంచి వినోదాన్ని పంచుతుంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం