• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mr. Bachchan Movie Review: రవితేజ – హరీష్‌ శంకర్‌ కాంబో మళ్లీ మ్యాజిక్‌ చేసిందా?

    నటీనటులు : రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్‌ ఖేడ్కర్‌, శుభలేక సుధాకర్‌, కిషోర్‌ రాజు వశిష్ట, సత్య, చమ్మక్‌ చంద్ర తదితరులు

    దర్శకత్వం : హరీష్‌ శంకర్‌

    సంగీతం : మిక్కీ. జె. మేయర్‌

    సినిమాటోగ్రఫీ : అయనంక బోస్‌

    ఎడిటర్‌ : ఉజ్వల్‌ కులకర్ణి

    నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్‌, భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, అభిషేక్‌ 

    మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా హరీష్‌ శంకర్‌ (Harish Shankar) డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan Movie Review). బాలీవుడ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. ‘మిరపకాయ్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రవితేజ-హరీష్‌ శంకర్‌ కాంబోలో రూపొందిన చిత్రం కావడంతో ‘మిస్టర్‌ బచ్చన్‌’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్‌, టీజర్‌, ప్రమోషన్ చిత్రాలు సైతం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ మూవీ స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? రవితేజ ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ పరుడు. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. దానివల్ల సస్పెండ్ కూడా అవుతాడు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సొంతూరు కోటిపల్లికి వెళ్లి అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి ప్రేమలో పడతాడు. పెళ్లికి రెడీ అవుతున్న క్రమంలో తిరిగి ఉద్యోగంలో చేరాలని బచ్చన్‌కు పిలుపు వస్తుంది. తదుపరి రైడ్‌ ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. అధికారులను సైతం భయపట్టే జగ్గయ్య ఇంట్లో బచ్చన్‌ ఎలా రైడ్‌ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? బచ్చన్‌ – జిక్కీ ప్రేమ వ్యవహారం ఏమైంది? పెద్దలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? చివరకు మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు? అనేది మిగిలిన కథ.

    ఎవరెలా చేశారంటే

    మిస్టర్ బచ్చన్‌గా రవితేజ చాలా పవర్ ఫుల్‌గా కనిపించాడు. తనదైన కామెడీ శైలితో అదరగొట్టాడు. మునుపటి రవితేజను గుర్తుచేశాడు. అటు యాక్షన్ సీక్వెన్స్‌, భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్‌ చూపించాడు. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ రవితేజ నటించిన విధానం మెప్పిస్తుంది. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్‌తో అలరించింది. ముఖ్యంగా సాంగ్స్‌లో భాగ్యశ్రీ బోర్సే లుక్స్, స్టెప్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. విలన్‌గా జగపతి బాబు తన పాత్రకు పూర్తి నాయ్యం చేశారు. కమెడియన్ స‌త్య తన కామెడీతో నవ్వించాడు. ఫస్ట్ హాఫ్‌లో స‌త్య సీన్స్ దాదాపు వర్కౌట్ అయ్యాయి. ఇతర కీలక పాత్రల్లో నటించిన సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి, గౌతమి, ప్రవీణ్ తమ పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారి నిజాయతీగా పనిచేస్తే సమాజానికి ఎంత మేలు జరుగుతుందో దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. మిస్టర్‌ బచ్చన్‌ పాత్రను, దాని తాలుకా సన్నివేశాలను దర్శకుడు బాగా రాసుకున్నారు. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ ఈ మూవీకి ప్రధాన బలంగా చెప్పవచ్చు. ప్ర‌థమార్ధాన్ని నిల‌బెట్ట‌డంలో,  ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత కాలక్షేపాన్నివ్వ‌డంలో ఈ ట్రాకే ముఖ్య భూమిక పోషించింది. దీనికి తోడు మ‌ధ్య‌లో దొర‌బాబుగా స‌త్య చేసే అల్ల‌రి ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని పంచింది. విరామానికి ముందు ముత్యం జ‌గ్గ‌య్య ఇంటిపై రైడ్‌కు వెళ్ల‌డం, ఆ త‌ర్వాత అక్క‌డ బ‌చ్చ‌న్ చేసే యాక్ష‌న్ హంగామా క‌థ‌ను ర‌స‌వ‌త్త‌రంగా మార్చారు డైరెక్టర్‌. అయితే ప్ర‌థమార్ధంలో క‌నిపించిన హ‌రీష్ మార్కు మ్యాజిక్ ద్వితీయార్ధంలో సన్నగిల్లింది. ఒక్క ఐటీ రైడ్ నేప‌థ్యంగానే ద్వితీయార్ధ‌మంతా నడపడంతో ఆసక్తి సన్నగిల్లింది. హీరో – విలన్ మధ్య మైండ్ గేమ్‌ని ఇంకా ఇంట్రెస్ట్‌గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు విలన్ పాత్రను ఇంకా బలంగా రాసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. 

    టెక్నికల్‌గా

    సాంకేతికంగా ఈ చిత్రానికి తొలి హీరో మిక్కీ జే మేయర్. ఈ క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా మంచి క్యాచీ టూన్స్ ఇచ్చారు. రెప్పల్ డప్పుల్, జిక్కీ, సితార్, నల్లంచు తెల్ల చీర పాటలు ఓవైపు వీనులవిందును, మ‌రోవైపు క‌నుల విందును అందించాయి. అయానంక బోస్ కెమెరాపనితనం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • రవితేజ నటన
    • లవ్‌ ట్రాక్
    • కామెడీ, డైలాగ్స్‌

    మైనస్‌ పాయింట్స్‌

    • ద్వితియార్థం
    • కొన్ని బోరింగ్‌ సీన్స్
    Telugu.yousay.tv Rating : 2.5/5  
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv