గతంలో సినిమా ఎలా ఉందన్న విషయాన్ని ప్రేక్షకులు స్వయంగా చూసి తెలుసుకునేవారు. కొంతకాలం తర్వాత మౌత్ టాక్ తెలుసుకొని సినిమాలను చూడటం మెుదలుపెట్టారు. ప్రస్తుతం ఈ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఫిల్మ్ మీడియా, యూట్యూబ్ ఛానాళ్ల ఫోకస్ కొత్త సినిమాలపై పడటంతో రివ్యూ విధానం తెరపైకి వచ్చింది. కొత్త సినిమా రిలీజైన వెంటనే పలు యూట్యూబ్ ఛానళ్లు థియేటర్ల వద్ద వాలిపోయి ప్రేక్షకుల అభిప్రాయాలను సేకరిస్తున్నాయి. వాటిని తమ యూట్యూబ్ ఛానెళ్లలో పోస్టు చేస్తున్నాయి. దీంతో వాటిని చూసిన సినీ లవర్స్ సినిమాను చూడకుండానే ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ చానెల్స్‌లో వచ్చే నెగిటివ్ రివ్యూల వల్ల సినిమాలు దారుణంగా దెబ్బతింటున్నాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (Tamil Film Active Producers Association) కీలక నిర్ణయం తీసుకుంది.
‘వారిని థియేటర్లలోకి అనుమతించొద్దు’
యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది నెటిజన్లు ఇచ్చే రివ్యూలు, చాలా సార్లు సినిమా ఫలితాలపై ప్రభావం చూపుతుంటాయి. ఇది గమనించిన తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (Tamil Film Active Producers Association) ఆ రివ్యూలను నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. థియేటర్లలోకి మీడియాను అనుమతించవద్దని సినిమా హాలు యజమానులకు విజ్ఞప్తి చేసింది. నెగిటివ్ రివ్యూల కారణంగా ‘ఇండియన్ 2’, ‘కంగువా’, ‘వేట్టయాన్’ సినిమాలపై తీవ్ర ప్రభావం పడినట్లు పేర్కొంది. రానురాను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇది అతిపెద్ద సమస్యగా మారుతున్నట్లు చెప్పింది. దీనిని కట్టడి చేసేందుకు ఫిల్మ్ ఇండస్ట్రీలోని అన్ని సంఘాలు ఏకం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఇందులో భాగంగా యూట్యూబ్ ఛానల్స్‌ను సినిమా థియేటర్ ప్రాంగణంలోకి అస్సలు అనుమతించకూడదని థియేటర్ యజమానులకు సూచించింది. ముఖ్యంగా తొలి రోజు ఫస్ట్ షో సమయంలో థియేటర్ దగ్గర పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని విజ్ఞప్తి చేసింది.
వ్యక్తిగత విమర్శలపైనా..
రివ్యూల మాటున కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు నటీనటులను టార్గెట్ చేయడం ఇటీవల కాలంలో బాగా ఎక్కువైంది. నటన ఎలా ఉందన్న విషయాన్ని సూటిగా చెప్పకుండా ఆ సీన్లో అలా చేశాడు, ఈ సీన్ ఇలా చేసింది అంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. పర్సనల్ గ్రడ్జ్తో హీరో, హీరోయిన్ల ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారన్న అనుమానాలను కలిగిస్తున్నారు. ఈ విషయంపైనా తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (Tamil Film Active Producers Association) స్పందించింది. రివ్యూల పేరుతో నటీ నటులు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌పై చేస్తోన్న వ్యక్తిగత విమర్శలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై అలాంటి వాటికి పాల్పడితే అస్సలు అంగీకరించేది లేదని హెచ్చరించింది. రివ్యూల విషయంలో తమ వైఖరిని మార్చుకోవాలని సదరు యూట్యూబ్ ఛానెళ్లకు గట్టిగా సూచించింది.
తెలుగులోనూ రావాల్సిన అవసరముందా?
తమిళ నిర్మాతల మండలి ప్రస్తావించిన అంశాలన్నీ ప్రస్తుతం టాలీవుడ్లో కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే పలు యూట్యూబ్ ఛానెళ్లు స్టార్ హీరో సినిమా రిలీజ్ అనగానే ప్రసాద్ ఐమాక్స్ దగ్గర వాలిపోతున్నాయి. ఉద్దేశపూర్వకంగానో, ఫేమస్ కావాలనో కొందరు చేసిన కామెంట్స్‌ను హైలెట్ చేస్తూ యూట్యూబ్‌లో పోస్టు చేస్తున్నాయి. దీనివల్ల జెన్యూన్ రివ్యూ ఇచ్చిన ఆడియన్స్ వ్యాఖ్యలు కనుమరుగవుతున్నాయి. పైగా తొలిరోజు న్యూట్రల్ ఆడియన్స్ కంటే హీరో అభిమానులు, యాంటీ ఫ్యాన్స్ ఎక్కువగా థియేటర్‌కు వస్తుంటారు. యాంటీ ఫ్యాన్స్ ముందుగా అనుకున్నట్లుగానే సినిమాలోని మైనస్‌లను భూతద్దంలా పెద్దది చేసి ఏకిపారేతిస్తారు. సినిమా చాలా దారుణంగా ఉందని, తలబొప్పి కట్టిందని విమర్శలు చేస్తారు. ఇది చూసిన జనరల్ ఆడియన్స్ సినిమా మరీ అంతా దారుణంగా ఉందా అని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఓటీటీలో వచ్చాక చూసుకోవచ్చులే అని థియేటర్లకు వెళ్లడం మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు సినీ పెద్దలు కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదని ఫిల్మ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఫలితం ఉంటుందా?
థియేటర్లలోకి యూట్యూబ్ ఛానెళ్లను అనుమతించొద్దు అన్న తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (Tamil Film Active Producers Association) నిర్ణయం బాగున్నప్పటికీ ఆచరణలో అది ఎంతమేరకు ఫలితాన్ని ఇస్తుందన్నది సందేహమే. ఎందుకంటే యూట్యూబ్ ఛానెళ్లను నియంత్రించడం చాాలా కష్టమైన పని. ఎంతో పవర్ఫుల్ అయిన దేశ ప్రధాని, ముఖ్య మంత్రులనే వారు ట్రోల్స్ చేస్తున్నారు. ఒకవేళ వారిని థియేటర్ల పరిసరాలోకి అనుమతించనప్పటికీ వారు గేటు బయట పబ్లిక్ రివ్యూలు తీసుకునే ఛాన్స్ ఉంది. అక్కడ అభ్యంతరం వ్యక్తం చేసిన వీధి చివర నిలబడి వీక్షకుల అభిప్రాయాలను క్యాప్చర్ చేసే అవకాశం లేకపోలేదు. పైగా టీవీ, యూట్యూబ్‌లో కనిపించాలని కుతూహలం ఉన్నవాళ్లు కచ్చితంగా వారు పెట్టిన మైక్ ముందు మాట్లాడతారు. మరి తమిళ నిర్మాతల మండలి సూచనలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.