టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అద్భుతమైన నటన, మిస్మరైజింగ్ డ్యాన్స్‌తో తన తొలి ఫిల్మ్‌తోనే చెరగని ముద్ర వేసింది. తాజాగా తమిళంలో ఆమె నటించిన ‘అమరన్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో శివకార్తికేయన్ హీరోగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్న సాయిపల్లవికి సోషల్ మీడియాలో ఊహించని షాక్ తగలింది. గతంలో ఇండియన్ ఆర్మీపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింలోకి వచ్చాయి. దీంతో నెటిజన్లు సాయిపల్లవిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అమర జవాన్ బయోగ్రఫీ
శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. నటుడు శివకార్తికేయన్ ముకుంద్ పాత్ర పోషించగా, సాయిపల్లవి ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ రోల్లో పోషించింది. తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. పూర్తిగా భావోద్వేగాలతో నిండిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
సాయిపల్లవి వీడియో వైరల్
అమరన్ చిత్రం ఆర్మీ నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో భారత ఆర్మీపై సాయిపల్లవి చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. విరాటపర్వం మూవీ ప్రమోషన్ సమయంలో సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఉగ్రవాదం, హింస అంశాల గురించి ప్రస్తావిస్తూ ‘పాకిస్థాన్ సైనికులను మన భారతీయులం ఉగ్రవాదుల్లా చూస్తాం. అలాగే పాకిస్థాన్‌లో ఉంటున్న వారు మన భారత సైనికులను ఉగ్రవాదుల్లా చూస్తారు. వాళ్లకు మనం చేటు చేస్తామని అనుకుంటుంటారు. సమస్యల పరిష్కారానికి హింస ఏ మాత్రం పరిష్కారం కాదు కదా. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్దాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు’ అని ఆమె అన్నారు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
కశ్మీర్ హింసాకాండ పైనా..
ఇదే ఇంటర్వ్యూలో కశ్మీరి పండిట్ల హత్యాకాండపైనా సాయి పల్లవి మాట్లాడారు. ‘కొన్ని రోజుల క్రితం ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది. ఆ టైమ్‌లో ఉన్న కశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు. మనం మత ఘర్షణలా వాటిని చూస్తే రీసెంట్గా ఓ బండిలో ఆవులని తీసుకెళ్లున్నారని ఆ వెహికిల్‌ని నడుపుతున్న వ్యక్తి ముస్లీం అని కొంత మంది కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడుంది’ అంటూ సాయిపల్లవి ప్రశ్నించారు. అప్పట్లో ఈ వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. సాయిపల్లవిపై హిందు సంఘాలు పెద్ద ఎత్తున మండిపడ్డాయి. అయితే అమరన్ రిలీజ్ సందర్భంలో ఈ వీడియోలు మళ్లీ ట్రెండింగ్‌లోకి రావడం అనుమానాలకు తావిస్తోంది. కావాలనే సాయిపల్లవిని టార్గెట్ చేస్తూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారని ఆమె ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
వాళ్లే టార్గెట్ చేస్తున్నారా?
‘అమరన్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్గా సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ నుంచి ఓ వ్యక్తి వచ్చి పీఆర్ ఏజెన్సీ తరపున తన ఇమేజ్ను మరింత పెంచుతానని అన్నారని తెలిపింది. అయితే దానిని తాను రిజక్ట్ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ‘రామాయణం’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సాయిపల్లవి పేరును డ్యామేజ్ చేసేందుకు వారు యత్నిస్తున్నట్లు టాక్. సీత పాత్ర నుంచి సాయి పల్లవిని తొలగించాలని కూడా వారు పెద్ద ఎత్తున కామెంట్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కావాలనే బాలీవుడ్ పీఆర్ టీమ్ సాయి పల్లవిని టార్గెట్ చేశారని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి