కేరళ అంటే ముందుగా ప్రకృతి అందాలు, నదీ పాయలు, సుగంద ద్రవ్యాలు, పర్యాటక ప్రాంతాలే గుర్తుకు వస్తాయి. పర్యాటకానికి పెద్ద పీట వేసే రాష్ట్రాల జాబితాలో కేరళ (Kerala State) ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా స్కైవాక్ గాజు వంతెన (SkyWalk Glass bridge)ను ప్రారంభించింది.
విహారానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఇడుక్కి జిల్లాలోని వాగమన్ ప్రాంతంలో ఈ గాజు వంతెనను నిర్మించింది. గాజు వంతెనల్లో దేశంలోనే అతి పొడవైన వంతెన ఇదే కావడం విశేషం.
సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఈ స్కైవాక్ గాజు వంతెనను నిర్మించారు. ఈ వంతెనను కేరళ పర్యాటక మంత్రి పి.ఎ.మహమ్మద్ రియాస్ తాజాగా ప్రారంభించారు. 40 మీటర్లు పొడవున్న ఈ గాజు వంతెనపై ఏకకాలంలో 15 మంది ఎక్కి ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.
రూ. 3కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనకు ఎంట్రీ ఫీజును రూ.500లుగా నిర్ణయించినట్టు జిల్లా టూరిజం ప్రొమోషన్ కౌన్సిల్ (DTPC) అధికారులు వెల్లడించారు.
గాజు వంతెనతో పాటు అడ్వంచర్ టూరిజం పార్క్‌ను సైతం కేరళ ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా స్కై వింగ్ (Sky Wing), స్కై సైక్లింగ్ (Sky Cycling), స్కై రోలర్ (Sky Roller), రాకెట్ ఇంజెక్టర్ (Rocket Injector), జెయింట్ స్వింగ్ (Giant Swing) వంటి అనేక సాహసోపేతమైన అనుభూతులను పర్యాటకులకు పంచనుంది.
స్కైవాక్ గాజు వంతెన నిర్మాణం కోసం జర్మనీ (Germany) నుంచి దిగుమతి చేసుకున్న 35 టన్నుల స్టీలును వినియోగించినట్టు DTPC అధికారులు తెలిపారు. పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు ఈ గాజు వంతెన ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
పచ్చని ప్రకృతి, పొగమంచు అందాల మధ్య ఈ బాటపై అడుగులు వేస్తుంటే ఆకాశంలో నడుస్తున్నామన్న అనుభూతి కలుగుతుంది. ఈ వంతెనపైకి ఎక్కిన సందర్శకులు సమీపంలోని కుట్టిక్కల్, కొక్కయార్ వంటి ప్రదేశాలను వీక్షించవచ్చు.