• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • SSMB29: మహేశ్‌ బాబు సరసన ఇండోనేషియా హీరోయిన్!

  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) ఖ్యాతి గ్లోబల్ స్థాయికి చేరింది. ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరాన్ సైతం ప్రశంసించే స్థాయికి రాజమౌళి ఎదిగారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి తన తర్వాతి చిత్రాన్ని మహేశ్‌ బాబు (Mahesh babu)తో రూపొందించనున్న సంగతి తెలిసిందే. ‘SSMB29’ పేరుతో ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తవగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ నడుస్తోంది. ఈక్రమంలో సినిమాకు సంబంధించి రోజుకో వార్త సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. తాజాగా మరికొన్ని విషయాలు బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

  నటీనటుల ఎంపిక పూర్తి!

  యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్న ‘SSMB29’ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక పూర్తైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. 24 క్రాఫ్ట్స్‌కు చెందిన టీమ్‌ను దర్శకేందుకు ఫైనలైజ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన టెక్నికల్‌ సిబ్బంది, వీఎఫ్‌ఎక్స్ నిపుణులను రాజమౌళి తన సినిమాకు ఎంచుకున్నట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపుగా పూర్తికావడంతో.. షూటింగ్‌ను ఈ ఏడాది మిడిల్‌ నుంచి ప్రారంభించే అవకాశముందని సిని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

  కీలక పాత్రలో ఇండోనేషియా భామ!

  తాజాగా జరుగుతున్న సమాచారం ప్రకారం ‘SSMB29’లో ఓ హాలీవుడ్‌ భామ నటించబోతున్నట్లు సమాచారం. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ (Chelsea Elizabeth Islan) ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఎంపికైనట్టు తెలుస్తోంది. అమెరికన్ – ఇండోనేషియా నటిగా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు ఉంది. చిల్సీ ఇస్లాన్.. 18 ఏళ్లకే వెండితెరపై మెరిసింది. ‘ది బాలిక్ 98’, ‘రూడీ’, ‘హబిబీ’ వంటి చిత్రాలతో ఇండోనేషియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఉత్తమ నటిగా సెకండ్ ఇండోనేషియన్ చాయిస్ అవార్డ్‌ను సైతం ఈ అమ్మడు అందుకుంది. ఈ భామ ఎంట్రీపై రాజమౌళి టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

  విభిన్న తరహాలో ప్రమోషన్స్!

  ‘SSMB29’ చిత్రం.. యాక్షన్‌ అండ్‌ అడ్వెంచర్‌ మూవీ కావడంతో కథకు తగినవిధంగా పాత్రలు, వాటి స్కెచ్‌లను ప్రస్తుతం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సెట్స్‌ డిజైన్‌ పైనా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. తన గత చిత్రాల తరహాలోనే విభిన్నమైన ప్రమోషన్స్‌ కోసం డైరెక్టర్‌ రాజమౌళి సినిమాకు సంబంధించిన థీమ్స్‌, లోగోలను సిద్ధం చేస్తున్నాడట. ఈ పనులన్నీ కొలిక్కి రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. 

  మహేశ్‌కు జక్కన్న కీలక సూచన!

  రాజమౌళితో చేయబోయే సినిమా కోసం ప్రస్తుతం మహేశ్‌ బాబు సిద్దమవుతున్నారు. యాక్షన్‌ అడ్వెంచర్ మూవీ కావడంతో దృఢంగా కనిపించేందుకు శారీరక కసరత్తులు సైతం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో గడ్డం పెంచి, పొడవాటి జుట్టుతో మహేశ్ కనిపిస్తాడని టాక్‌. అయితే మహేశ్‌ లుక్‌ బయటకు రాకుండా రాజమౌళి ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. సినిమా మెుదలయ్యేలోపు ప్రకటనలకు సంబంధించిన షూట్స్‌ ఉంటే పూర్తి చేసుకోవాలని మహేశ్‌కు జక్కన్న సూచించారట. త్వరలోనే మహేశ్‌ లుక్‌కు సంబంధించి టెక్నికల్‌ టీమ్‌తో వర్క్‌షాప్‌ మెుదలు కానుందని అంటున్నారు. 

  షూట్‌ ప్రారంభం ఎప్పుడంటే?

  ‘SSMB29’ సినిమా షూట్‌ను తెలుగు సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్‌ 9న అధికారికంగా ప్రారంభించాలని రాజమౌళి తొలుత భావించారట. అయితే మిగిలిన ప్రీ ప్రొడక్షన్‌ పనులకు ఇంకాస్త సమయం కావాల్సి రావడంతో మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న స్టార్ట్‌ చేస్తారని సోషల్‌మీడియాలో టాక్‌ నడుస్తోంది. అయితే ఐదు నెలల సమయం అంటే ఎక్కువేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతకన్నా ముందే షూటింగ్‌ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

  జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్‌!

  ‘SSMB29’ సినిమాకు సంబంధించి దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకూ అధికారికంగా ఒక్క అప్‌డేట్‌ కూడా ఇవ్వలేదు. గత చిత్రాల మాదిరిగానే దీనికి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి వివరాలు ప్రకటిస్తారా? లేదా? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఈసారి జక్కన్న కాస్త భారీగానే ప్లాన్‌ చేస్తున్నారని ఫీల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ‘SSMB29’ సినిమాకు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్‌ ఉండబోతోందని సమాచారం. తెలుగుతో పాటు, జాతీయ మీడియాకు కూడా ఒకేసారి చెప్పేస్తే ఎలా ఉంటుందా? అని మూవీ టీమ్‌ ఆలోచిస్తోందట. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది త్వరలోనే తెలియనుంది. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv