దర్శకధీరుడి సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్, బాక్సాఫీస్ దగ్గర డీజే టిల్లు బ్లాక్ బస్టర్ బరాత్, అడివిశేష్ ‘మేజర్’ సూపర్ హిట్ ఆపరేషన్ ఒకవైపు.. ‘మెగా’ అంచనాలతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన ‘ఆచార్య’ లాంటి సినిమాలు మరోవైపు… 2022 తొలి అర్ధభాగంలో తెలుగు సినిమా ప్రయాణం అనూహ్యంగా సాగింది. అంచనాలే లేకుండా వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిస్తే…భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అలాగే ఆర్నెళ్లలో రెండే రెండు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లు వస్తే అందులో ఒకటి కన్నడ, ఒకటి తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. ఆర్నెళ్ల తెలుగు సినిమాపై ఒక్క మాటలో రివ్యూ చెప్పాలంటే… మూడు హిట్టు…మిగతావన్నీ ఫట్టు..!
బ్లాక్ బస్టర్ బొనాంజా!
ఆర్నెళ్లలో తెలుగు సినిమా ఈసారి రెండు బ్లాక్ బస్టర్లను ఇచ్చింది. ఒకటి అందరూ ఊహించిన రాజమౌళి కళాద్భుతం ‘ఆర్ఆర్ఆర్’ మరొకటి చిన్ని సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసిన ‘డీజే టిల్లు’. అయితే రూ.550కోట్లతో తెరకెక్కి ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనుకున్న ‘ఆర్ఆర్ఆర్’ రూ.1111.7కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ దగ్గరే ఆగిపోయింది. డీజే టిల్లు మాత్రం కేవలం కోటి రూపాయలతో తీస్తే రూ. 20 కోట్లు కొల్లగొట్టింది.
సూపర్ హిట్ ఆపరేషన్లో ‘మేజర్’
ఆర్నెళ్లలో టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో అడివిశేష్ ‘మేజర్’ సూపర్ హిట్ గా నిలిచింది. రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.58కోట్లకు పైగా రాబట్టింది. ఇదే వారంలో విడుదలైన ‘విక్రమ్’ నుంచి గట్టి పోటీ ఉన్నా బాక్సాఫీస్ పోటీలో నిలబడగలిగింది. అలాగే సంక్రాంతి సందడిలో వచ్చిన బంగార్రాజు హిట్ టాక్ తెచ్చుకుంది. కోటితో తెరకెక్కిన ఈ సినిమా రూ.60కోట్లు వసూలు చేసింది.
యావరేజ్ లైన్ దాటలేకపోయిన టాలీవుడ్ ‘స్టార్స్’
సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్..టాలీవుడ్ లో బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు. ఈ యేడాది వీరిద్దరి సినిమాలు అభిమానుల అంచనాలు అందుకోలేక పోయాయి. ‘సర్కారు వారి పాట’ యావరేజ్ పాటగానే మిగిలింది.మహేశ్ బాబును కొత్తగా చూపించినా కథ, కథనంలో పస లేకపోవడంతో రూ.100 కోట్లతో తీసిన సినిమా కేవలం రూ.187.4 కోట్లతో సరిపెట్టుకుంది. అలాగే మళయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’…తెలుగు కమర్షియల్ టచ్ తో యావరేజ్ కి పడిపోయింది. రూ.80కోట్లతో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ రూ.158.5 కోట్లు రాబట్టగలిగింది. అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్ లో వచ్చిన F3 కూడా రూ.70 కోట్లతో తెరకెక్కి 90 కోట్లు సాధించి యావరేజ్ గా నిలిచింది.
‘మెగా’ డిజాస్టర్స్
మెగాస్టార్ తండ్రీ, తనయులతో భారీ అంచనాలతో వచ్చిన ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడింది. రూ.140 కోట్లతో తీసిన సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. రూ. 73.5 కోట్లతో నష్టాలను మూటగట్టుకుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ ‘ రాధే శ్యామ్’ కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. రూ.350 కోట్లతో తెరకెక్కిస్తే..కేవలం రూ.144కోట్లు రాబట్టి నిర్మాతలను నష్టాల్లో ముంచింది.
టాక్ హిట్..కలెక్షన్లు ఫట్
తెలుగులో ఈసారి కొొన్ని సినిమాల పరిస్థితి ‘ఆపరేషన్ సక్సెస్ బట్ పేషంట్ డెడ్’ అన్న చందంగా మారింది. హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్ల పరంగా డిజాస్టర్లుగా మారాయి. ఈ మధ్య వచ్చిన నాని,నజ్రియా ‘అంటే సుందరానికి’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. ఈ సినిమా ఇప్పటివరకు కేవలం రూ.20కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదే బాటలో సాయి పల్లవి, రానా విరాటపర్వం కూడా నడుస్తోంది. ప్రేక్షకుల మూడ్ మారడం ఇందుకు కారణం కావొచ్చు. పెద్ద సినిమాలకు భారీగా డబ్బులు ఖర్చు చేయడంతో…నెలపోతే ఓటీటీలోకి వచ్చే సినిమాకు ఖర్చు చేయడమెందుకని భావిస్తున్నారు.
తెలుగోళ్లకు తెగనచ్చిన పరభాషా చిత్రాలు
బహుభాషల్లో తెరకెక్కిన పలు ఇతర ఇండస్ట్రీల చిత్రాలు తెలుగులోనూ అద్భుతంగా వసూళ్లను రాబట్టుకున్నాయి. అందులో మొదటి రెండు స్థానాల్లో నిలిచేవి ఈ ఏడాది వచ్చిన రెండు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్ విక్రమ్, కేజీఎఫ్2. లోకేశ్ కనగరాజ్ అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ‘విక్రమ్’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తే, మాస్ ఎలివేషన్స్ తో ప్రశాంత్ నీల్, యష్ దునియా మొత్తం దున్నేశారు. 100 కోట్లతో తెరకెక్కిన కేజీఎఫ్2 1207 కోట్లు రాబడితే.. ఇప్పటికే 365 కోట్లు దాటిన విక్రమ్ ఇంకా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. వీటితో పాటు విజయ్ సేతుపతి ‘కాతువకుల రెండు కాదల్’ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ‘జేమ్స్’, ఆలియా భట్ గంగూభాయ్ కథియావాడి చిత్రాలు ప్రేక్షకుల మదిని దోచుకున్నాయి.
గతేడాదితో పోలిస్తే ఈసారే బెటర్
ఇవేగాక ఇంకా చాలా సినిమాలు ఫ్లాపులుగా, డిజాస్టర్లుగా మిగిలాయి. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటిదాకా తెలుగులో 44 సినిమాలు విడుదలైతే అందులో 9 హిట్లుగా నిలిచాయి. గతేడాది ఇదే సమయానికి 88 సినిమాలు రిలీజై 9 హిట్లు నమోదయ్యాయి. అంటే ఈ సారి చాలా బెటర్ అని చెప్పొచ్చు. 2021లో హిట్లన్నీరెండో అర్ధభాగంలోనే విడుదలయ్యాయి. మరి ఈసారి సెకండాఫ్ హుషారు తెస్తుందో ఉసూరుమనిపిస్తుందో వేచిచూడాల్సిందే.
టాప్-10 టాలీవుడ్ మూవీస్-2022
సినిమా | బడ్జెట్ ( రూ.లలో) | మొత్తం కలెక్షన్ (రూ.లలో) | ఫలితం |
ఆర్.ఆర్.ఆర్. | 550 కోట్లు | 1111.7 కోట్లు | బ్లాక్ బస్టర్ |
సర్కారు వారి పాట | 100 కోట్లు | 187.4 కోట్లు | యావరేజ్ |
కేజీఎఫ్-2 | 100 కోట్లు | 1207 కోట్లు | ఆల్ టైం బ్లాక్ బస్టర్ |
భీమ్లానాయక్ | 80 కోట్లు | 158.5 కోట్లు | యావరేజ్ |
రాధేశ్యామ్ | 350 కోట్లు | 144 కోట్లు | డిజాస్టర్ |
ఎఫ్-3 | 70 కోట్లు | 90 కోట్లు | యావరేజ్ |
ఆచార్య | 140 కోట్లు | 73.5 కోట్లు | డిజాస్టర్ |
బంగార్రాజు | 25 కోట్లు | 60 కోట్లు | హిట్ |
మేజర్ | 30 కోట్లు | 58.2కోట్లు | సూపర్ హిట్ |
డీజే టిల్లు | 10 కోట్లు | 21 కోట్లు | బ్లాక్ బస్టర్ |
అంటే సుందరానికి* | 30 కోట్లు | 20.71 కోట్లు | – |
*(ఇంకా థియేటర్లలో నడుస్తోంది.)