• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భారత సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌ సినిమా తీయబోతున్న బ్లాక్‌బస్టర్‌ బ్యానర్‌ ‘ మైత్రి మూవీ మేకర్స్‌’ ప్రస్థానం

  చిన్నప్పటి నుంచే సినిమాలంటే ప్రేమ, ఇష్టం. స్కూల్‌ రోజుల నుంచే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూసే అలవాటు. అమెరికా వెళ్లినా అక్కడా సినిమానే. ఎన్నటికైనా సినిమాల్లోకి అడుగుపెట్టాలి. కానీ కెమెరా ముందుకు రావడం ఇష్టం లేదు. అలాగని సినిమా నుంచి దూరంగా ఉండలేరు. అందుకే సినీ నిర్మాణ రంగాన్ని ఎంచుకున్నారు. దిల్‌ రాజు, అరవింద్‌, దానయ్య ఇలా పెద్ద పెద్ద బ్యానర్లు ఇండస్ట్రీని ఏలుతున్న వేళ… తుపానుకు ముందు వచ్చే నిశ్శబ్దంలా అడుగుపెట్టారు “మైత్రి మూవీ మేకర్స్” . నిశ్శబ్దంగా ఇండస్ట్రీలోకి వచ్చినా తొలి సినిమాతోనే ఇండస్ట్రీలోనే రీసౌండ్‌ వచ్చేలా టాలివుడ్‌లోనే బిగ్గెస్ట్‌ స్టార్‌తో బ్లాక్‌బస్టర్‌ కొట్టారు. ప్రస్తుతం దేశ చలనచిత్ర రంగమే తమవైపు చూసేలా సినిమాలు ప్లాన్‌ చేస్తున్నారు. ఇంతకీ ఎవరు వీరు? ఎక్కడి నుంచి వచ్చారు తెలుసుకుందాం.

  ఎలా పుట్టింది?

  మైత్రి మూవీ మేకర్స్‌ ఆలోచన పుట్టింది నవీన్‌ యేర్నేని మదిలో. విజయవాడకు చెందిన ఈయన అమెరికాలో సెటిలయ్యి అక్కడ మూవీ డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. తన స్నేహితులైన రవిశంకర్‌, మోహన్ చెరుకూరికి తన ఆలోచన పంచుకుని 2012 నుంచే తమ ప్రొడక్షన్ బ్యానర్‌ పనులు ప్రారంభించారు. అప్పటి నుంచే ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకుంటూ పోయారు. దర్శకులతో మాట్లాడటం, కథలు వినడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడే రచయిత నుంచి దర్శకుడిగా మారిన కొరటాలతో పరిచయం ఏర్పడింది. అతడితో సినిమా చేయాలని అప్పుడే ఫిక్స్‌ అయ్యారు. అప్పటి నుంచి కథలు వింటూనే ఉన్నారు. అలా 2015లో మైత్రి మూవీ మేకర్స్‌ పేరిట బ్యానర్‌ ఏర్పాటు చేసి  ఓ సినిమా ప్రకటించారు.

  తొలి అడుగే భారీగా

  ఇండస్ట్రీలో ఎవరైనా తొలుత అడుగుపెట్టినపుడు  చిన్న హీరోలతో చిన్న సినిమాలు చేస్తారు. కానీ ‘మైత్రి మూవీ మేకర్స్‌’ అడుగు పెట్టడమే టాలివుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో సినిమా ప్రకటించారు. తమకు అప్పటికే పరిచయమున్న కొరటాల శివతో 2015లో ‘శ్రీమంతుడు’ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా సుమారు రూ.70 కోట్ల బడ్జెట్‌తో నటీనటుల విషయంలోనే కాదు, టెక్నీషియన్ల విషయంలోనూ రాజీ పడకుండా తెరకెక్కించారు. మహేశ్‌, శృతి హాసన్‌, రాజేంద్ర ప్రసాద్‌, జగపతి బాబు,సంపత్‌ రాజ్ ముఖేశ్‌ రిషి వంటి స్టార్‌ క్యాస్ట్‌ను తమ సినిమాలో తీసుకున్నారు. అలాగే మ్యూజిక్‌కు దేవీ శ్రీ ప్రసాద్‌, సినిమాటోగ్రఫీకి R మధీ వంటి వారితో సినిమాను ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా రూ.140 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

  భారీగా ఎందుకంటే

  అంత భారీ సినిమాతో ప్రొడక్షన్‌ రంగంలో దిగడానికి భయమేయలేదా అంటే.. భయం ఉండకూడదనే భారీ సినిమా చేశామంటారు నవీన్‌ యేర్నేని. చిన్న సినిమాలు అయితే జనాన్ని థియేటర్లకు లాగడం కష్టం. మహేశ్‌ బాబు సినిమా అయితే జనం సులభంగా థియేటర్లకు వస్తారు. రిస్క్‌ తక్కువ, అందుకే పెద్ద సినిమాతో ప్రయాణం మొదలుపెట్టామని ఆయన చెబుతారు. 

  మహేశ్‌తో బంధమెలా? 

  నవీన్ యేర్నేని స్వయంగా సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యాన్‌. కానీ ఆ కారణంతో అయితే తాము కలవలేదని చెబుతారు. ‘కొరటాలతో ఉన్న పరిచయంతో మహేశ్‌ను కలిశాం. ఎందుకో తెలియదు ఆయనకు మేం నచ్చాం. ఇదంతా మా లక్‌ అంతే” అంటారు నవీన్‌.

  రెండోదీ బ్లాక్‌బస్టరే

  అచ్చొచ్చిన దర్శకుడు కొరటాలతోనే ఆ మరు సంవత్సరమే  రెండో సినిమా చేేశారు. ఇందులోనూ అదే పంథా. భారీ తారాగణం. మంచి టెక్నీషియన్లు. ఎక్కడా రాజీలేని నిర్మాణ విలువలు. జూ. ఎన్టీఆర్‌, మోహన్‌ లాల్‌ వంటి అద్భుత నటులతో తెరకెక్కించిన ‘జనతా గ్యారేజ్‌’ కూడా బ్లాక్‌ బస్టర్‌గానే నిలిచింది. ఈ సినిమా కూడా సుమారు రూ.40-50 కోట్లతో తెరకెక్కిస్తే.. దాదాపుగా రూ.140 కోట్లు వసూలు చేసి వారి ఖాతాలో రెండో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

  బ్లాక్‌బస్టర్‌ హ్యాట్రిక్‌

  రెండు భారీ సినిమాల తర్వాత తమ పేరు మార్మోగిపోయింది. ఈసారి మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో వచ్చారు. 2018లో ఇంటలిజెంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ‘ రంగస్థలం’ తెరకెక్కించారు. ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డారు. జూబ్లీహిల్స్‌లో విలేజ్‌ సెట్ వేసి సినిమా చాలా భాగం షూటింగ్‌ చేశారు. రామ్‌ చరణ్, సమంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు వంటి స్టార్‌ క్యాస్ట్‌కు తోడు రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీ శ్రీ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. రామ్‌ చరణ్‌కు అప్పటికి అదే కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌. రూ.60 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 216 కోట్లతో వసూళ్ల సునామీ సృష్టించింది. 

  హ్యాట్రిక్‌ కొట్టిన ఈ త్రయంలో ఎవరేం చేస్తారు?

  సినిమాల్లో వరుసగా మూడు బ్లాక్‌బస్టర్లు కొట్టారంటే ఇక వారి పేరు మార్మోగిపోకుండా ఎలా ఉంటుంది. మైత్రి మూవీ మేకర్స్ అంటే తెలియని వారు లేని స్థాయికి వెళ్లిపోయారు. కానీ వీరంత మితభాషులే. మీడియా ముందుకు ఎక్కువగా రారు. నవీన్ యేర్నేని ఆర్నెళ్లు ఇండియాలో ఉంటే ఆర్నెళ్లు అమెరికాలో ఉంటారు. రవిశంకర్‌, మోహన్ చెరుకూరి ఇక్కడ యాక్టివ్‌గా పనులు చూసుకుంటారు. తమకు మంచి వర్కింగ్‌ టీం ఉండటంతో తాను ఆర్నెళ్లు అమెరికాలో ఉన్నా ఇబ్బంది రావడం లేదని నవీన్‌ చెబుతారు. ప్రాజెక్ట్‌ ఓకే చేయడం, ఫైనాన్షియల్‌ పనులు, పోస్ట్‌ ప్రొడక్షన్‌, ఆ తర్వాత సినిమా ప్రమోషన్‌ నవీన్‌ చూసుకుంటారు. ఆయనకు మోహన్‌ సాయపడతాడు. రవిశంకర్ సెట్‌లో పనులు చూసుకుంటారు. 

  ఓటమి రుచి

  రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్‌ కొట్టిన 2018లోనే ‘మైత్రి’ ఓటమి రుచేంటో కూడా తెలిసింది. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్యతో తెరకెక్కించిన సవ్యసాచి, శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజా హీరోగా వచ్చిన అమర్‌ అక్బర్‌ ఆంటోనీ బాక్సాఫీస్‌ వద్ బొక్కబోర్లా పడ్డాయి. ఆ తర్వాత 2019లో చిత్రలహరి, డియర్‌ కామ్రేడ్, గ్యాంగ్‌ లీడర్‌, మత్తు వదలరా సినిమాలు చేశారు. ఇందులో మత్తు వదలరా కేవలం రూ.2.1 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించి విజయం సాధించారు. 

  పాన్ ఇండియా లెవెల్‌

  2020 పూర్తిగా కరోనామయం కాగా.. 2021లో ‘మైత్రి మేకర్స్‌’ గట్టి కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. ‘ఉప్పెన’ వంటి చిన్న సినిమాతో టాలివుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే గాక, ‘పుష్ప’ఇండియన్ బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టారు. అల్లు అర్జున్ కెరీర్‌ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడమే గాక, ఒక్కసారిగా ఆయన్ను పాన్ ఇండియా స్టార్‌ను చేసిన సినిమా అది. ఈ సినిమాతో ‘మైత్రి’ పేరు దేశంలోనే కాదు ప్రపంచమంతా మార్మోగింది. సుకుమార్‌ డైరెక్షన్‌, అల్లు అర్జున్ నటనకు తోడు ప్రపంచమంతా పాపులర్‌ అయిన దేవీ శ్రీ ప్రసాద్ పాటలు మైత్రికి ఘన విజయాన్ని అందించాయి.

  2022 సినిమాలు

  2022లో మహేశ్‌ బాబుతో మరోసారి జతకట్టి సర్కారు వారి పాట తీశారు. ఇది బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఆ ఏడాది వచ్చిన మిగతా మూడు సినిమాలు అంటే సుందరానికి, హ్యాపీ బర్త్‌డే, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి.

  2023 మైత్రిదే

  ఈ యేడాది కూడా బాక్సాఫీస్‌ బాస్‌ మేమే అన్నట్టుగా మైత్రి మూవీ మేకర్స్ ఆరంభించారు. సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘ వీర సింహారెడ్డి’ రెండూ బాగా ఆడాయి. అల్లు అరవింద్‌, దిల్‌ రాజు తమిళ హీరోలతో సంక్రాంతికి వచ్చినా… థియేటర్లు కూడా గట్టిగానే పట్టుకున్నా….మెగాస్టార్‌ చిరంజీవి, నటసింహం బాలయ్య క్రేజ్‌ను తట్టుకోలేకపోయారు. ‘రంగస్థలం’ టైంలోనే చిరంజీవితో సినిమా చేయాలని ఫిక్స్‌ అయిన ‘మైత్రి’, వాల్తేరు వీరయ్యతో ఆ పని పూర్తిచేసింది. మరికొద్ది రోజుల్లో కల్యాణ్‌ రామ్ ‘అమిగోస్‌’ రిలీజ్‌కు సిద్ధం కానుండగా… విజయ్‌ దేవరకొండ, సమంత నటిస్తున్న ‘ఖుషీ’ త్వరలో మరో షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకోబోతోంది.

  అల్లు అరవింద్‌, దిల్‌ రాజుతో ఎలా?

  మైత్రికి దిల్‌రాజుతో గొడవలు అయ్యాయని వీరికి చెడిందని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే దిల్‌రాజు మాట్లాడుతూ వ్యాపారంలో చిన్న చిన్న మనస్పర్దలు సహజమేనని తాము బాగానే ఉన్నామని చెప్పారు. నవీన్‌ యేర్నేని కూడా ఎదిగినా ఒదిగిఉండే రకం. “గీతా ఆర్ట్స్‌, SVCC వంటివి పెద్ద బ్యానర్లు. మేం వారిని కలుస్తూనే ఉంటాం. నేర్చుకుంటూనే ఉంటాం” అని చెబుతుంటారు. 

  ఇండస్ట్రీని షేక్‌ చేయబోయే సినిమాలు

  మైత్రి మూవీ మేకర్స్‌ నుంచి త్వరలో బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టే సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.

  పుష్ప-2

  ‘పుష్ప-2’…! సుకుమార్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్‌ అవెయిటెడ్‌ సినిమాల్లో ఒకటి. సుకుమార్‌ అత్యంత పక్కాగా ఈ సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు. మొదటి పార్ట్‌కు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా కథలో మార్పులు కూడా చేస్తున్నాడు. త్వరలో వైజాగ్‌లో ఈ సినిమా మరో షెడ్యూల్‌ ప్రారంభం కాబోతోంది. 

  ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌

  హరీశ్ శంకర్‌, పవన్ కల్యాణ్ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా ‘గబ్బర్‌ సింగ్‌’ 100 రెట్లు ఉంటుందని నవీన్‌ యేర్నేని నమ్ముతున్నాడు. పక్కా కమర్షియల్‌ మూవీగా ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాస్తుందని ధీమాగా ఉన్నారు.

  NTR31

  KGF సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎదిగిన ప్రశాంత్‌ నీల్‌, RRRతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న NTR కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికైతే ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక ఈ సినిమాకు వస్తారు. అలాగే NTR కూడా కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది.

  RC16

  చిన్న బడ్జెట్‌తో అవకాశమిస్తే బ్లాక్‌ బస్టర్‌ విజయమిచ్చి నిరూపించుకున్న బుచ్చిబాబు సానతో మైత్రి ఈ సారి భారీ సినిమా చేయబోతోంది. RRRతో ఎన్టీఆర్‌తో పాటు పేరుతెచ్చుకున్న మరో హీరో రామ్‌చరణ్ ఇందులో హీరోగా నటించబోతున్నారు.

  భారత సినీ చరిత్రలోనే అతిపెద్ద సినిమా

  ప్రభాస్‌, హృతిక్‌ రోషన్‌, దర్శకుడు సిద్దార్థ్‌ ఆనంద్‌…ఈ కాంబో ఊహించుకుంటేనే స్క్రీన్లు తగలబడిపోయే విజువల్స్ కనిపిస్తాయి. అలాంటిది నిజంగా ఈ కాంబోతో నిర్మాణంలో ఏమాత్రం రాజీపడని ‘మైత్రి మూవీ మేకర్స్‌’ సినిమా తెరకెక్కిస్తే! అదీ ఇప్పటిదాకా ఇండియాలో ఎవరూ సాహసం చేయనంత భారీ బడ్జెట్‌ సినిమా అయితే!! మీ ఊహకే వదిలేస్తున్నాం. ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు గానీ దాదాపుగా ఫిక్స్‌ అయినట్లే తెలుస్తోంది. ప్రభాస్‌కు కథలు వినిపిస్తున్నామని మైత్రి ఏనాటి నుంచో చెబుతోంది. అయితే ఫిక్స్ అయినట్లే కనబడుతోంది. ఈ సినిమా పట్టాలెక్కితే…. భారత సినీ చరిత్రలోని రికార్డులన్నీ బద్దలవడం ఖాయం.

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తోనూ తాము కచ్చితంగా సినిమా చేస్తామని నవీన్‌ యేర్నేని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అది ఎప్పుడు వస్తుందో… ‘మైత్రి మూవీ మేకర్స్‌’  బాక్సాఫీస్‌ను ఎలా శాసించబోతున్నారో వేచి చూడాలి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv