‘ది కేరళ స్టోరీ ‘ చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపుతోంది. మే 5న ఈ సినిమా విడుదల కానుండగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయోద్దంటూ కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్, సీపీఐ, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ విద్వేషపూరితంగా చిత్రీకరించారని, సినిమా విడుదల చేస్తే మత సామరస్యం దెబ్బతింటుందని పలువురు ఏకంగా సుప్రీకోర్టునే ఆశ్రయించారు. ఈ స్థాయిలో వివాదం రాజుకోడానికి కారణమేంటి? ఈ చిత్రంపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? కేరళ కంటే తమిళనాడు ఎందుకు ఎక్కువగా ఆందోళన చెందుతోంది? అసలు ఈ సినిమా సెన్సార్ క్లియర్ చేసుకుందా? వంటి ప్రశ్నలకు ఈ ప్రత్యేక కథనంలో సమాధానం చూద్దాం.
వివాదానికి బీజం:
సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరతారు. ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది.
కేరళ సీఎం ఆగ్రహం
‘ది కేరళ స్టోరీ’ ట్రైలర్.. కేరళ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం స్పందించారు. ‘రాష్ట్రంలో మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుంది. ‘లవ్ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినా.. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయని.. వారి రాజకీయాలు ఇక్కడ సాగవని పరోక్షంగా భాజపా, RSSలకు చురకలు అంటించారు.
సినిమాను బ్యాన్ చేయాలి
‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలను కేరళ అధికార పార్టీతోపాటు విపక్ష కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడింది. రాష్ట్రంలో చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్, డీవైఎఫ్‌ఐ, ఐయూఎంఎల్ వంటి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కేరళను అవమానించే రీతిలో ఈ చిత్రం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ పేర్కొన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఓ వర్గం యత్నిస్తోందని ఐయూఎంఎల్ జాతీయ కార్యదర్శి పీకే ఫిరోజ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్విట్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు.
తమిళనాడు అలెర్ట్
ది కేరళ స్టోరి రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ బృందాలు అలెర్ట్ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ‘కేరళ స్టోరీ’ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి నిఘా వర్గాలు సూచించాయి. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అన్ని థియేటర్లలో పొన్నియన్ సెల్వన్-2 నడుస్తున్నట్లు చెప్పాయి. ధియేటర్ యాజమానులు ‘ది కేరళ స్టోరీ’ని ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి.
సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు
‘ది కేరళ స్టోరీ’ ఇటీవలె సెన్సార్ పూర్తి చేసుకుంది. వివాదస్పదంగా మారిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A సర్టిఫికేట్’ ఇచ్చింది. అంతేగాక సినిమాలోని వివిధ సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దేవుళ్లకు సంబంధించిన డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది. మరికొన్ని పదాలను సవరించాలని కోరింది. మొత్తం 10 సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. వాటిని డిలీట్ చేయాలని చెప్పింది. పలు సవరణలతో మే 5న చిత్ర విజయానికి అనుమతించింది.
సుప్రీంకోర్టు స్పందన
‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన అభ్యర్థనను ధర్మాసనం నిరాకరించింది. ‘ది కేరళ స్టోరీ’లో విద్వేషపూరితమైన ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయని దాఖలైన పిటీషన్‌పై కోర్టు స్పందించింది. ‘ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పొందింది. మీరు దీని విడుదలను సవాల్ చేయాలనుకుంటే ఆ సర్టిఫికెట్‌తో తగిన ఫోరంను సంప్రదించండి’ అని సుప్రీంకోర్టు పిటిషనర్లకు సూచించింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!