• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tirumala Laddu : సినీ హీరోలకు పవన్‌ కల్యాణ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌.. సారీ చెప్పిన తమిళ్ హీరో కార్తి!

    తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయ్యిందన్న వార్తల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్ష మూడవ రోజులో భాగంగా ఆయన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో  శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను పవన్ తానే స్వయంగా శుద్ధి  చేసి మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టారు. ఆపై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్‌.. నటుడు ప్రకాష్‌ రాజ్‌తో పాటు ఇండస్ట్రీలోని నటులపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

    ప్రకాష్‌ రాజ్‌కు వార్నింగ్‌!

    తిరుమల లడ్డుపై ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) చేసిన వివాదస్పద ట్వీట్‌పై పవన్‌ స్పందించారు. అసలు ఈ వ్యవహారంలో ప్రకాష్‌ రాజ్‌కు సంబంధం ఏంటని నిలదీశారు. తిరుపతిలో మరోమారు అపవిత్రం జరగకూడదని చెబితే అది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాను ఇస్లాంని నిందించానా? లేక క్రిస్టియానిటీని తప్పుబట్టానా? అంటూ పవన్‌ అన్నారు. హిందువుల దేవతా విగ్రహాలను శిరచ్ఛేధనం చేస్తే మాట్లాడొద్దా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కరికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికోసం మాట్లాడుతున్నారు మీరు? అంటూ ప్రకాష్‌ రాజ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  ఏం జరిగింతో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని ఏ మతాన్ని విమర్శించనని చెప్పారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సెక్యులరిజం అంటే టూ వే అని వన్ వే కాదని స్పష్టం చేశారు. ప్రకాష్ రాజ్ అంటే తనకు గౌరవముందని కానీ లడ్డు విషయంలో అపహాస్యం చేసేలా మాట్లాడితే సహించేది లేదని పవన్‌ హెచ్చరించారు. 

    ‘అపహాస్యం చేస్తే ఊరుకోను’

    ప్రకాష్‌ రాజ్‌తో పాటు సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి కూడా పవన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలో వాళ్లు కూడా మాట్లాడితే పద్దతిగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చొండి అని పవన్ హెచ్చరించారు. మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మాత్రం ప్రజలు క్షమించరని వార్నింగ్ ఇచ్చారు. ‘లడ్డు చాలా సెన్సిటివ్’ అంటూ జోకులు వేస్తున్నారని నటుడు కార్తీ పేరు చెప్పకుండానే ఫైర్ అయ్యారు. మరోమారు అలా అనొద్దని పరోక్షంగా హెచ్చరించారు. అలా చెప్పే ధైర్యం కూడా చేయొద్దన్నారు. నటులుగా మిమ్మల్ని గౌరవిస్తాను కానీ సనాతన ధర్మం జోలికి వస్తే మాత్రం ఊరుకోను అని స్ట్రాంగ్‌గా చెప్పారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకోండని సూచించారు. 

    ‘నటుల కంటే సనాతన ధర్మమే గొప్పది’

    టికెట్ల కోసం ఎన్నో ప్రయాశలు పడి సినిమా చూసే అభిమానులకు సైతం పవన్‌ చురకలు అంటించారు. మతాలతో సంబంధం లేకుండా సినిమాలు చూసే ప్రేక్షకుల్లో కూడా హిందువులు ఉన్నారని గుర్తుచేశారు. వారు కూడా తిరుమల లడ్డు వివాదంపై మాట్లాడాలని సూచించారు. సినిమాల గురించి గంటలు గంటలు మాట్లాడతారని, సనాతన ధర్మం విషయానికి వచ్చినప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటివి వచ్చినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశారు. హీరోల కంటే పైస్థాయిలో హిందూ ధర్మాన్ని చూడాలని, ఒక హీరోగా తానే ఈ విషయాన్ని చెబుతున్నానని సినీ లవర్స్‌కు విజ్ఞప్తి చేశారు. హిందువులంటే మెత్తని మనుషులు ఏం చేయరన్న భావన సమాజంలో ఉందని పవన్‌ అన్నారు. సాటి హిందువులే తోటి హిందువుల గురించి తప్పుగా, తక్కువగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. మీకు నమ్మకాలు లేకుంటే ఇంట్లో కూర్చోవాలని అంతే కాని మమ్మల్ని ఏమి అనొద్దని, సెక్యులరిజం గురించి సూక్తులు చెప్పొద్దని పేర్కొన్నారు.

    పవన్‌కు సారి చెప్పిన కార్తీ

    సోమవారం జరిగిన ‘సత్యం సుందరం’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తిరుమల లడ్డు వ్యవహారంపై నటుడు కార్తీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసింది. తిరుమల వివాదం గురించి మాట్లాడమని కార్తీని కోరగా ‘ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్‌ టాపిక్‌.. మనకొద్దు అది’ అంటూ పరిహాసమాడారు. దీనిపై తాజాగా పవన్‌ ఫైర్ అయిన నేపథ్యంలో కార్తీ స్పందించారు. ‘ప్రియమైన పవన్ కళ్యాణ్ సర్, మీ పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను’ అని ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు. 

    వచ్చాక మీకు ఆన్సర్‌ ఇస్తా: ప్రకాష్‌ రాజ్‌

    పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ తాజా వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్‌ రాజ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ట్వీట్‌ చేశారు. ‘పవన్‌ కల్యాణ్‌ గారు ఇప్పుడే మీ ప్రెస్‌మీట్‌ చూశా. నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి’ అని పేర్కొన్నారు. 

    అంతకుముందు ఏం జరిగిందంటే?

    తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో నటుడు ప్రకాష్‌ ఇటీవల శుక్రవారం (సెప్టెంబర్ 20) సాయంత్రం ఎక్స్‌ వేదికగా స్పదించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కోట్‌ చేస్తూ ‘మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు) #జస్ట్‌ ఆస్కింగ్‌’ అని పోస్ట్‌ చేశారు. దీనిపై వెంటనే నటుడు మంచు విష్ణు స్పందించారు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదని నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక అంటూ వ్యాఖ్యానించారు. మీ పరిధుల్లో మీరు ఉండండి అంటూ హెచ్చరించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv