తెలుగులో మోస్ట్ అవేటెడ్ సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్, ఆచార్య రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలన్నీ ఈ ఏడాది సంక్రాంతి సమయంలో రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఏది ఏమైనప్పటికీ అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తామని ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ నిర్మాతలు పట్టుదలతో ఉన్నప్పటికీ పరిస్థితులు సహకరించని కారణంగా విడుదల కాలేదు. అయితే ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
రాధేశ్యామ్(Radhe Shyam)
ప్రభాస్‌ను రొమాంటిక్ పాత్రలో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘రాధేశ్యామ్’ జనవరి 14న రిలీజ్ కావాల్సి ఉండగా ఇది వాయిదాపడింది. ప్రస్తుతం మార్చి 4 లేదా మార్చి 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
భీమ్లానాయక్(Bheemla Nayak)
ఇక భీమ్లానాయక్ విషయానికొస్తే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ అన్ని సినిమాలు ఒకేసారి వస్తే నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందనే కారణంతో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ నిర్మాతలు భీమ్లానాయక్ మేకర్స్‌ను సినిమా వాయిదా వేసుకోవాల్సిందిగా కోరగా దానికి ఓకే చెప్పారు. కానీ ఆ సమయానికి ఆ రెండు సినిమాలు కూడా రిలీజ్ కాలేదు. దీంతో ప్రస్తుతం మళ్లీ భీమ్లానాయక్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్, రాణా నటించిన భీమ్లానాయక్ ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
ఆర్ఆర్ఆర్ (RRR)
ఇక తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ . బాహుబలి2 తర్వాత ఆ రేంజ్‌లో క్రేజ్ ఉన్న సినిమా ఇది. ప్రమోషన్స్‌తో దీనిపై మరిన్ని అంచనాలను పెంచారు మేకర్స్. రిలీజ్‌కు వారం రోజులు ఉందనగా వాయిదా పడి ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది. అయితే ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఆచార్య(Aacharya)
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో దీనిపై అంచనాలు పెరిగాయి. మొదట ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్‌కు వాయిదా వేశారు. తాజాగా ఏప్రిల్ 29న సినిమా ప్రేక్షకుల మందుకు రానున్నట్లు వెల్లడించారు. కాజల్ హీరోయిన్‌గా నటించింది. రామ్ చరణ్ సిద్ధ పాత్రలో..ఆయనకు జంటగా పూజా హెగ్డే నీలాంబరిగా కనిపించనుంది.
సర్కారు వారి పాట
పెద్ద సినిమాల తేదీలన్నీ ఖరారు కావడంతో మహేశ్‌బాబు సర్కారువారి పాటకు లైన్ క్లియర్ అయింది. షూటింగ్ పూర్తిగా ముగించుకొని మే 12న సమ్మర్‌లో కూల్‌గా సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది.
నవ్వుల పండగ మీ ముందుకు రాబోతుంది అంటూ తేదీని ప్రకటించారు F3 టీమ్. ఏప్రిల్ 28న సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహ్రిన్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైన్ F2 సీక్వెల్‌గా F3 రాబోతుంది.
పైన పేర్కొన్న విడుదల తేదీలు ప్రస్తుతానికి నిర్ణయించినవి. అన్ని సహకరిస్తే ఇవే తేదీల్లో కచ్చితంగా వస్తాయి. అయితే అనుకోని పరిస్థితులు ఏమైనా ఎదురైతే మళ్లీ వాయిదా పడే అవకాశం కూడా లేకపోలేదు.