బాలకృష్ణతో టాక్ షో అన్నప్పుడు అమ్మో బాలయ్య టాక్ షోనా అనుకున్నారు. ఎందుకుంటే ఆయన ఏం మాట్లాడినా అవి వైరల్ అయిపోతుంటాయి. దానిపై మీమ్స్ వస్తుంటాయి. అలాంటిది ఒక గంటపాటు ఎలా మేనేజ్ చేస్తాడు. సెలబ్రిటీలతో ఎలా బిహేవ్ చేస్తాడు ఆడియన్స్‌ను ఎలా మెప్పిస్తాడు అనుకున్నారు. కాని అన్‌స్టాపబుల్‌తో దెబ్బకు థింకింగ్ మారిపోయేలా చేశాడు బాలయ్య. అనుకున్నది అందాం.. అనిపించింది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. అంటూ మొదలుపెట్టాడు.
టైమింగ్
బాలయ్య ఏం మాట్లాడతాడులే అన్ని తడబడతాడు సినిమాలో డైలాగ్స్ తప్ప సొంతంగా మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికీ అర్థం కాదు అనుకున్నవారికి ఈ షోతో సమాధానం ఇచ్చాడు. షోలో ఆయన వేసిన పంచులు చూస్తే బాలయ్య బాబు కామెడీ టైమింగ్ ఏంటో అర్థమవుతుంది. రానా ఎపిసోడ్‌లో, రవితేజ ఎపిసోడ్‌లో కొన్ని అలాంటి పంచులు పేలాయి.
ట్రోల్స్ గురించి బాలయ్య
సోషల్ మీడియాలో మీపై ఎప్పుడూ ట్రోల్స్ వస్తుంటాయి మీరు పట్టించుకుంటారా లేదా అసలు చూస్తారా అని నాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా అర్జునుడి బాణం చెట్టు మీద ఉన్న పక్షి పైనే ఉంటుంది. నా చూపు నా పనిపైనే ఉంటుంది.. ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను అని చెప్పాడు. దీంతో ఆయన మీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా పట్టించుకోడు అని అర్థమవుతుంది.
మంచి మనసు
ఇక బాలకృష్ణ చేసే సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌తో ఎంతో మందికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. నాని ఎపిసోడ్‌లో అలా క్యాన్సర్ నుంచి బయటపడిన ఒక అమ్మాయి ప్రేమగా వచ్చి బాలయ్య బాబును హత్తుకొని తన కృతజ్షతను తెలిపింది. అంతేకాకుండా మొదటి ఎపిసోడ్‌లో కూడా ఒక అమ్మాయికి తన హాస్పిటల్‌లో ఉచిత ట్రీట్‌మెంట్ ఇప్పిస్తానని మాటిచ్చాడు. మోహనబాబును కూడా తన స్కూల్‌లో విద్య అందించాలని కోరగా దానికి ఆయన తప్పకుండా అని చెప్పాడు. ఇలా అన్ని ఎపిసోడ్స్‌లో అందరికీ ఏదో విధంగా సాయం చేస్తానని ప్రామిస్ చేశాడు.
పాపులారిటీ
బాలయ్య బాబు మీద ఇంతకు ముందు ఉన్న విమర్శలు, హేటర్స్ ఈ ఒక్క షోతో తగ్గిపోయాయట. ఇది చూసిన తర్వాత బాలయ్య అంటే ఏంటో అర్థం చేసుకుంటున్నారని టాక్. ఐఎండీబీ దేశవ్యాప్తంగా పాలపులారిటీ పరంగా ఇచ్చిన టీవీ షో రేటింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ షో అయిపోతుందంటే మళ్లీ ఎప్పుడు అని అడుగుతున్నారు నెటిజన్స్. అంతగా నచ్చేసింది. చివరి ఎపిసోడ్ మహేశ్‌బాబుతో ముగియనుంది. ఫిబ్రవరి 4న చివరి ఎపిసోడ్ స్ట్రీమ్ కాబోతుంది.
బోజన ప్రియుడు
ఇక బోజనం గురించి ఎంత శ్రద్ధ వహిస్తాడో ఆయన వంటవాడికి ఇచ్చిన మెనూ చూస్తే అర్థమవుతుంది. ఏ రోజు ఏం తినాలో ఆయనకు లెక్కలు ఉంటాయట. మంగళవారం ఏం తినాలో మొత్తం లిస్ట్ చెప్పాడు. ఏ కూర ఎలా వండాలో, రుచి రావాలంటే ఏం చేయాలో గబగబా లిస్ట్ చెప్పాడు బాలయ్య. దీంతో బాలయ్య ఎంత భోజన ప్రియుడో అర్థమవుతుంది.
యాటిట్యూడ్
పెద్ద టాప్ హీరో అయినప్పటికీ చిన్న హీరోలతో ఎంత సరదాగా ఉంటాడో అర్థమవుతుంది. నాని, విజయ్ దేవరకొండ, రానా ఇలాంటి కుర్ర హీరోలతో వాళ్లకు మించిన ఎనర్జీని కనబరిచాడు. వాళ్లు కూడా చూసి ఎంజాయ్ చేసేలా ఉంది బాలకృష్ణ యాటిట్యూడ్. అల్లు అర్జున్ వచ్చిన ఎపిసోడ్‌లో పుష్పను ఇమిటేట్ చేశాడు. విజయ్‌తో బాక్సింగ్ సరదాగా బాక్సింగ్ చేశాడు. నానితో క్రికెట్ ఆడాడు. రవితేజతో డ్యాన్స్ చేశాడు. రానా అడిగిన పర్సనల్ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాడు. ఇలా బాలయ్య బాబు కూల్ యాటిట్యూడ్ గురించి అందరికీ తెలిసింది.
ప్రాసలు.. పంచులు
బాలకృష్ణ బ్రహ్మానందం వచ్చిన ఎపిసోడ్‌లో ఏఎన్ఆర్‌ని ఇమిటేట్ చేసి చూపించాడు. అదేవిధంగా పూరి జగన్నాథ్ వచ్చిన ఎపిసోడ్‌లో సారా గురించి ఒక పద్యం చదివి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయన లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకోవడం అందులో నుంచి వచ్చిన పద్యాలను, ప్రాసలను చెప్తూ ఎంటర్‌టైన్ చేశాడు.
సరదా బుల్లోడు
హీరోయిన్లతో సరదాగా ఉండటం. రష్మిక వచ్చిన ఎపిసోడ్‌లో రష్మికను పొగడ్తలతో ముంచెత్తాడు. నింగి నుంచి జారిన చందమామలా ఉన్నావని చెప్పాడు. చార్మితో నీ ఫస్ట్ మూవీ చూసినప్పుడు ఎవరు ఈ అమ్మాయి ఇంత బాగుంది అనుకున్నా ఇప్పుడు కూడా అలాగే ఉన్నావని చెప్పాడు. ఇక అఖండ ఎపిసోడ్‌లో ప్రగ్యాతో కూడా పాట నీదైనా పాప నాది అంటూ ఆటపట్టించాడు. దీంతో బాలయ్య బాబు సెట్‌లో అందరితో ఎంత సరదాగా ఉంటాడో అర్థమవుతుంది.
డెడికేషన్
మొదట కొన్ని ఎపిసోడ్‌లలో గెస్ట్‌లు మాట్లాడనీయకుండా మొత్తం తానే మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత దాన్ని సరిదిద్దుకున్నాడు బాలయ్య. పూర్తిగా వాళ్లు మాట్లాడిన తర్వాతే మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒకవేళ మధ్యలో మాట్లాడినా.. మీరు ఏదో చెప్తున్నారు అంటూ వాళ్లను కంటిన్యూ చేయమన్నాడు. రాను రాను చూసేవాళ్లకు షోపై ఇంట్రెస్ట్ పెరిగేలా చేయడంలో విజయవంతమయ్యాడు.
లౌక్యం
గెస్ట్‌ల నుంచి వాళ్లెప్పుడూ బయటపెట్టని విషయాలను ఆయన స్టైల్‌లో అడిగి బయటకు చెప్పించాడు. రవితేజ్ డ్రగ్స్ కేసు వచ్చినప్పుడు ఏమనుకున్నాడని అడిగితే దానిపై రవితేజ మొదటిసారిగా స్పందించాడు. నాని అపజయాల గురించి ఎలా ఫీలవుతాడో చెప్పించాడు. రాజమౌళి అంటే దేశంలోనే టాప్ డైరెక్టర్ కానీ, ఆయన చిన్నతనంలో ఎలా ఉండేవాడో, కుటుంబ పరిస్థితులు ఏంటో ఎవరికి తెలియదు కానీ బాలయ్య అడిగి ప్రేక్షకులకు చెప్పించే ప్రయత్నం చేశాడు. అలాగే మహేశ్‌బాబు హార్ట్ ఆపరేషన్స్ చేయించడం వెనక అసలైన కారణం ఏంటో తెలిసింది.
అభిమానం
బాలయ్య బాబు అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జై బాలయ్య అనేది ఒక నినాదంలా మారింది. ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరదాగా జై బాలయ్య అనాల్సిందే. అయితే అన్‌స్టాపబుల్‌కు వచ్చిన ఆడియన్స్‌లో అభిమానులు ఆయన గెటప్స్‌లో రావడం, బాలయ్య బాబును చూసి ఎలా స్పూర్తి పొందారో చెప్పడం జరిగాయి. టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అందరి హీరోలకంటే నాకు బాలయ్య అంటే ఇష్టమని చెప్పడం, కీరవాణి థియేటర్‌లో హాలీవుడ్ మూవీ చూస్తుంటే ఎవరో జై బాలయ్య అన్నారని చెప్పడం, మొదటి ఎపిసోడ్‌లో లక్ష్మీ మంచు ఏదైనా ప్రారంభించే ముందు జై బాలయ్య అనడం అలవాటుగా మారిందని చెప్పడం ఇలా ఆయన క్రేజ్ గురించి మరింత తెలిసేలా చేసింది అన్‌స్టాపబుల్. నేను మీకు తెలుసు నా స్థానం మీ మనసు అన్న మాటను నిజం చేశాడు.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!