హైదరాబాద్‌లో మరో అద్భుతం కనివిందు చేయనుంది. నగరవాసులు వేసవిలో ఎంజాయ్ చేసేందుకు నీటి లోపల ఆక్వా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. జలాంతర్గామి మాదిరిగా ఉండే ఈ టన్నెల్ లోపల వేల రకాల చేపలను ఉంచారు. మహా నగరంలో ఇదెక్కడ ఉంది? దీన్ని సందర్శించాలంటే ఎంత చెల్లించాలి అనే విషయాలు తెలుసుకోండి.
ఆక్వా ఎగ్జిబిషన్
వివిధ దేశాల్లో నీటి లోపల టన్నెల్‌ను ఏర్పాటు చేసి అందులో వివిధ రకాల చేపలను దగ్గర్నుంచి చూసేలా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఇవి కొన్ని సినిమాల్లో చూసే ఉంటారు. ఇలాంటి అద్భుతం హైదరాబాద్ నడిబొడ్డున కనిపించబోతుంది. కూకట్‌పల్లిలో ఈ అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. శనివారం రోజున దీన్ని ప్రారంభించారు. రానున్న రెండు నెలలో ఇది అందుబాటులో ఉండనుంది. ఒక్కొక్కరికి రూ. 100 చొప్పున తీసుకొని దీన్ని చూసేందుకు అనుమతిస్తున్నారు.
వివిధ రకాల చేపలు
ఈ టన్నెల్ ఎక్వేరియమ్‌లో వివిధ రకాల చేపలను ఉంచారు. ఇందులో దాదాపు 3 వేల రకాల చేపలు ఉన్నాయి. స్టార్, ఎంజెల్, క్లోన్ ఫిష్ వంటి వాటితో పాటు ఈల్స్, బాక్స్ ఫిష్ లాంటి చేపల్ని ఉంచారు. మలేషియా, సింగపూర్, కేరళ వంటి ప్రాంతాల నుంచి వీటిని దిగుమతి చేసుకున్నారు. అక్కడ మాత్రమే లభించే ఈ రకం చేపల్ని చూసే అవకాశం కలగనుంది.
60 కిలోల చేప
ఈ ఎగ్జిబిషన్‌లో బాగా ప్రత్యేకమైనది ఆరపైమా చేప. ఇది సుమారు 60 కిలోలు ఉంటుంది. అంతేకాదు, రోజుకు అర కిలో చికెన్ తింటుందని నిర్వాహకులు తెలిపారు. దీని విలువ మార్కెట్‌లో సుమారు రూ. 6 లక్షలు ఉంటుంది. టన్నెల్ ఎక్వేరియమ్‌కు వెళ్లి ఈ అరుదైన చేపను చూడవచ్చు.
అందరికీ ఆసక్తి
దాదాపు టీవీల్లో కనిపించే ఇలాంటి అద్భుతమైన దృశ్యాలను చూసేందుకు పిల్లలతో పాటు పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ టన్నెల్‌ను ఏర్పాటు చేసేందుకు దాదాపు 6 నెలల సమయం పట్టిందని నిర్వాహకులు తెలిపారు. చేపలు బతికుండేలా వాటికి కావాల్సిన ఉష్ణోగ్రతల మధ్య ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
చేనేత ప్రదర్శన
ఈ ఎగ్బిబిషన్ వద్ద హ్యాండ్లూమ్ ఎక్స్‌పో కూడా ఏర్పాటు చేశారు. ఎక్కువమంది సందర్శించే అవకాశం ఉండటంతో చేనేతలకు ఆదరణ కల్పించాలని పెట్టారు. ఇందులో నేతన్నలు రూపొందించిన ఆకర్షణీయమైన దుస్తులు ఉన్నాయి. ఫలితంగా వచ్చిపోయే వాళ్లు వీటిపై కూడా ఓ లుక్కేస్తున్నారు.
మరిన్ని నగరాలకు
విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన ఇలాంటి టన్నెల్‌కు మంచి ఆదరణ రావటంతో వివిధ నగరాల్లో ఏర్పాటు చేయాలని భావించారు నిర్వాహకులు. అందుకే వివిధ చోట్ల ప్రజలు ఆస్వాదించేలా చర్యలు చేపడుతున్నారు. మరిన్ని నగరాలకు విస్తరించాలని యోచిస్తున్నారు.
మంత్రి కేటీఆర్ స్పందన
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నగరంలో ఇలాంటిది శాశ్వతంగా ఎందుకు ఏర్పాటు చేయకూడదని మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ అడిగాడు. నగరంలోని అందమైన చెరువుల్లో ఒకదానిపై ఇలాంటిది ఏర్పాటు చేసిన బహుమతిగా ఇవ్వాలని పేర్కొన్నాడు . దీనిపై స్పందించిన మంత్రి… దేశంలోనే అతిపెద్ద ఎక్వేరియమ్‌ను కోత్వాల్‌గూడ వద్ద నిర్మిస్తున్నామని బదులిచ్చారు. పనులు జరుగుతున్నాయని తెలిపారు కేటీఆర్.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!