నటీనటులు : సముద్రఖని, ధృవన్ వర్మ, మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ,ధన్ రాజ్ తదితరులు..
దర్శకత్వం: శివప్రసాద్ యానాల
సినిమాటోగ్రఫీ: వివేక్ కలేపు
సంగీతం: చరణ్ అర్జున్
నిర్మాత : జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి
నటుడిగా, దర్శకుడిగా చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సముద్రఖని. తెలుగు సినిమాల్లో విలన్‌గా మెప్పిస్తూనే మెగా ఫోన్ పట్టుకుని ఏకంగా పవన్ కళ్యాణ్‌తో సినిమా తీస్తున్నాడు. ఈ క్రమంలో పాజిటివ్ రోల్‌లో సముద్రఖని ప్రధానపాత్ర దారుగా వచ్చిన చిత్రం ‘విమానం’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి, ఈ ‘విమానం’ థియేటర్‌లో ప్రేక్షకుడిని ఆకాశానికి తీసుకెళ్లిందా? టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు సన్నివేశాలు మెప్పించాయా? అనే విషయాలను రివ్యూలో చూద్దాం.
కథేంటి?
ప్రచార చిత్రాలతోనే సినిమా కథేంటో తెలిసిపోయింది. ఓ పేదింటి కుర్రాడు రాజు(మాస్టర్ ధ్రువ్)కి విమానం అంటే ఎంతో ఇష్టం. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాలని ఆశపడుతుంటాడు. తండ్రి వీరయ్య(సముద్రఖని) వికలాంగుడు. తల్లి లేకున్నా రాజుకి ఏ లోటు రాకుండా పెంచాలని పరితపిస్తుంటాడు. వంశ పారం పర్యంగా వచ్చిన సులభ్ కాంప్లెన్స్‌ని నడుపుకొంటూ జీవనాన్ని సాగిస్తాడు వీరయ్య. ఎప్పుడు విమానం గురించి అడిగినా చదువుకుంటే విమానం ఎక్కొచ్చని చెబుతూ కొడుకుని వీరయ్య ఎంకరేజ్ చేస్తాడు. ఈ క్రమంలో కొడుక్కి ఓ ప్రాణాంతక వ్యాధి ఉందనే చేదు నిజాన్ని వీరయ్య తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే పుత్రుడి కోరిక తీర్చాలని వీరయ్య ఒక్కో పైసా పోగు చేస్తాడు. కానీ, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక్కో ఘటనతో తన ప్రయత్నానికి వీరయ్య మరింత దూరం అవుతుంటాడు. మరి చివరికి ఎలా విమానం ఎక్కించాడని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
ఇలాంటి సినిమాలకు కథనం, సంభాషణలు, నటీనటుల ప్రదర్శన చాలా ముఖ్యం. ఈ సినిమా వీటిని భర్తీ చేస్తుంది. బస్తీలో ఉండే వాతావరణం, నిరుపేద కుటుంబ పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపించారు. చూసేటప్పుడు ఇది మన కథే, పక్కింటి వారి కథే అన్న భావన కలుగుతుంది. మొత్తానికి తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని తెరపై చూపిస్తుంది. ఇంటర్వెల్, సెకండాఫ్, క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి.
ఎవరెలా చేశారు?
వికలాంగ తండ్రిగా సముద్రఖని జీవించేశాడు. కొడుకు కలను నెరవేర్చాలన్న తపన ఓ వైపు, కలకాలం తనతో ఉండబోడన్న వేదన మరోవైపు.. ఇలా గుండెను భారంగా చేసుకుని బతుకీడుస్తున్న వ్యక్తిగా సముద్రఖని ప్రేక్షకులను మెప్పించాడు. తనలోని నటుడిని వెలికి తీశాడు. ఇక రాజు పాత్రలో మాస్టర్ ధ్రువన్ ఆకట్టుకున్నాడు. చిన్న పిల్లలకు ఉండే అమాయకత్వం, నిజాయితీ, ఆశలు, కోరికలను చక్కగా చూపించగలిగాడు. వేశ్య అయిన సుమతి పాత్రలో అనసూయ ఫర్వాలేదనిపించింది. తన ప్రేమ కోసం పరితపించే కోటిగా రాహుల్ రామకృష్ణ మెప్పించాడు. వీరిద్దరి ప్రేమాయణం చివరికి కంటతడి పెట్టిస్తుంది. ఎయిర్ హోస్టెస్ పాత్రలో అలనాటి హీరోయిన్ మీరా జాస్మిన్ తళుక్కుమంది. ఆటో డ్రైవర్‌గా ధన్‌రాజ్ పరిధి మేరకు నటించాడు.
టెక్నికల్‌గా
తెలిసిన కథను హృదయాలకు హత్తుకునేలా తీయడంలో డైరెక్టర్ శివప్రసాద్ యానాల సక్సెస్ అయ్యాడు. నిరుపేద కుటుంబంలో ఉండే పరిస్థితులను చక్కగా చూపించాడు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని భావోద్వేగంగా చిత్రీకరించి ప్రేక్షకులను మెప్పించాడు. కోటీ, సుమతి మధ్య సన్నివేశాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. అయితే, కథలో పాత్రలను పరిచయం చేయడానికి కాస్త సమయం తీసుకున్నాడు. సెకండాఫ్‌లో హీరోకి ఎదురయ్యే కష్టాలను కాస్త సినిమాటిక్‌గా చూపించాడు. ముఖ్యంగా, తెలుగులో డైలాగ్స్ అందించిన హను రావూరి తన కలానికి పనిచెప్పాడు. సందర్భానుసారంగా వచ్చే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇక, చరణ్ అర్జున్ సంగీతం ఆకట్టుకుంటుంది. వివేక్ కెమెరా పనితనం మెప్పిస్తుంది.
ప్లస్ పాయింట్స్
నటీనటులు
భావోద్వేగ సన్నివేశాలు
క్లైమాక్స్ సీన్స్
మైనస్ పాయింట్స్
ఊహకు అందే కథ, కథనం
చివరగా.. ప్రేక్షకుడిని భావోద్వేగాలనే ఎయిర్‌పోర్టుకి తీసుకెళ్లేదే ‘విమానం’.