విజయేంద్ర ప్రసాద్. పేరుకు తగ్గట్టే ఆయన కథలు విజయానికి చిరునామా. దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో ‘ఈగ’ మినహా కథలన్నీ విజయేంద్రప్రసాద్ కలం నుంచి జాలువారినవే. ఆయన కథలు తెరపై చూస్తుంటే నరాలు ఉప్పొంగుతాయి, గుండెలు పిండేసినట్టుంటుంది, మనమే తెరలోకి వెళ్లి ఏదోటి చేసేయాలన్నంత భావోద్వేగం రగులుతుంది. అదే విజయేంద్ర ప్రసాద్ కథా రహస్యం. తాజాగా ఆయన సేవలను గుర్తించి రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. అయితే ఆయన సాహిత్య సారథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో అద్భుతమైన కొన్ని సీన్లు ఓసారి నెమరేసుకుందాం.
భజరంగీ భాయిజాన్
విజయేంద్ర ప్రసాద్ 25 సినిమాలకు పైగా కథలు అందించారు. అవన్నీ వజ్రాలైతే ’భజరంగీ భాయీజాన్’ అందులో కోహినూర్. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాలో కొన్ని సీన్లు చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టించింది. పాకిస్థాన్ నుంచి దారి తప్పి వచ్చిన చిన్నారిని తిరిగి హీరో ఇంటికి ఎలా చేర్చాడనేదే ఈ సినిమా కథ.
పాపను వేశ్యాగృహంలో అమ్మేసే సన్నివేశం
ఎంత కఠువైన గుండెనైనా కరిగించే సీన్ ఇది. ఓ ఏజెంట్ పాపను పాకిస్థాన్ పంపిస్తానంటే నమ్మి హీరో చిన్నారిని అతడికి అప్పగిస్తాడు. కానీ అతను పాపను తీసుకెళ్లి ఓ వేశ్యాగృహంలో అమ్మేస్తాడు. ఇదే సమయంలో పాపకు గాజులు ఇద్దామని తిరిగొచ్చిన హీరో… ఆ స్థితిలో పాపను చూసి కన్నీటి పర్యంతమవుతాడు. పాప ఒక్కసారిగా వచ్చి హత్తుకుంటుంది. ఒక్కసారి ఈ సినిమా చూసినవాళ్లకు ఈ సీన్ తలచుకున్నా గుండె బరువెక్కుతుంది.
క్లైమాక్స్
ఇక భజరంగీ భాయీజాన్ క్లైమాక్స్ అయితే మాటల్లో వర్ణించలేం. ఎలాగోలా పాకిస్థాన్ చేర్చిన హీరోను పాక్ సైన్యం ఇష్టారీతిన కొడుతుంది. చివరగా ఇండియాకు అప్పగించే సమయంలో… అప్పటిదాకా మూగదానిలా ఉన్న చిన్నారి ‘మామా’ అంటూ పరుగెత్తుకొస్తుంది. హృదయం ఉప్పొంగే ఈ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలిచింది.
ఆర్ఆర్ఆర్
ఇటీవల ఆర్ఆర్ఆర్ థియేటర్లలో ఎంతటి బీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇందులో బాగా పండిన విజయేంద్ర ప్రసాద్ మ్యాజిక్ ఓ సారి చూద్దాం.
మల్లిని ఎత్తుకెళ్లే సీన్
అప్పటిదాకా కళ్లముందే ఆడుకుంటున్న కన్నబిడ్డను గద్దలా ఒకరొచ్చి తన్నుకుపోతే ఎలా ఉంటుంది. అదే కథలో రాశరు విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి తన మార్క్ తో దీనిని తెరపై ప్రదర్శించారు. ప్రతి తల్లీ గుండె తల్లడిల్లే సీన్ ఇది.
మల్లిని ఎన్టీఆర్ కలిసే సీన్
అదే కోడిపిల్ల గద్ద కాళ్లలో ఉన్నపుడు తనను కాపాడేందుకు తన వారొచ్చారని తెలిస్తే కలిగే ఆనందం ఎలా ఉంటుంది? ఆ వెంటనే వచ్చినవాడు తనను తీసుకెళ్లడని తెలిస్తే కలిగే బాధ ఎలా ఉంటుంది? దీనినే కలంతో కళ్లకు కట్టేలా రాశారు విజయేంద్ర ప్రసాద్. అద్భుతమైన డైలాగ్స్ తో రాజమౌళి దీనిని తెరపై పండించగలిగారు.
సింహాద్రి
ఈ సినిమాలో గతం మరిచిన భూమికను హీరో కంటికి రెప్పలా కాపాడుతాడు. కానీ గతం ఓ పైట్ సీన్ మధ్యలో గతం గుర్తొచ్చిన హీరోయిన్ అపార్థం చేసుకుని హీరోను గడ్డపారతో పొడుస్తుంది. ఆ తర్వాత జరిగే సీన్లు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి.
సై
1988నుంచే కథలు రాస్తున్న విజయేంద్రప్రసాద్. రాజమౌళి కోరిక మేరకు రాసిన స్పోర్ట్స్ డ్రామా ‘సై’. ఇందులో కళాశాల స్థలం కోసం విలన్ భిక్షూ యాదవ్… రాజీవ్ కనకాల తండ్రిని చంపుతాడు. ప్రేక్షకుడిని సైతం కుప్పకూలేలా చేసే సీన్ అది.
ఛత్రపతి
ఛత్రపతిలోనూ అమ్మ సెంటిమెంట్ తో కన్నీళ్లు పెట్టించారు.కానీ అది మాత్రమే కాదు అడ్రినలిన్ ఉప్పొంగేలా చేసి ప్రేక్షకుడిని కుర్చోలోంచి లేపి గంతులేయించగలిగేలా ఆయన రాసిన ఈ కథలో హీరో ఉంటాడు.
గీత దాటే సీన్
‘ఇక చాలు’ ఛత్రపతి చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సీన్ గుర్తుంటుంది. ఏళ్లపాటు బానిసత్వంలో బతికిన హీరో ఒక్కసారిగా బానిస సంకెళ్లు తెంచుకుని తిరగబడే ఈ సీన్ కి థియేటర్లు బద్దలయ్యాయంటే అతిశయోక్తి కాదు.
ఒక్క అడుగు
ఇక ఆ తర్వాత వచ్చే ఒక్క అడుగు డైలాగ్ సన్నివేశం ఇంకో ఎత్తు. అప్పట్లో ప్రేక్షకులను కుర్చీల్లో కూర్చొనివ్వలేదు ఈ సీన్.
విక్రమార్కుడు
విజయేంద్రప్రసాద్ రచనా సామర్థ్యానికి మరో నిదర్శనం విక్రమార్కుడు. ఇందులో తండ్రిని పోలిన వ్యక్తినే తండ్రిగా భావించే ఓ పాపను చూసి ప్రతి ఒక్కరి మనసూ కరుగుతుంది. అలాగే ఇందులో హీరో పరిచయ సన్నివేశం గానీ, హీరో క్యారెక్టర్ చనిపోయే సీన్ గానీ తెరపై అద్భుతంగా పండాయి.
Celebrities Featured Articles Telugu Movies
Fahadh Faasil: ‘పుష్ప 2’ ఈవెంట్స్ను ఫహాద్ ఫాజిల్ అందుకే పక్కకు పెట్టాడా?