‘నా ప్రేమను చాపకింద పరిస్తే భూమి సరిపోదు. గాల్లో నింపితే ఈ విశ్వం బద్ధలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి.’ అంటాడు ఓ హీరో తన హీరోయిన్ తో. నిజంగా అంత ప్రేమ ఉంటుందా? హద్దులూ, అవధులూ లేని అనంతమైన భావననే ప్రేమా? మీలో చాలామంది అవుననే అంటారు. కానీ నిజానికి అంత ప్రేమ అసాధ్యమే కాదు అసహజం, అనర్థం కూడా. మోతాదుకు మించిన ప్రేమ…ప్రేమించే వ్యక్తితో పాటు ప్రేమను పొందేవారికీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. దీనినే సైన్స్ పరిభాషలో ‘లవ్ అడిక్షన్’ లేదా పాథోలాజికల్ లవ్ అంటారు.
ఏంటీ లవ్ అడిక్షన్?
ఒకరిపై ప్రేమ హద్దులు దాటి, వారు లేకుంటే బతకలేం అనే స్థితికి చేరి, అదొక వ్యసనంలా మారిపోయి, తమపై తామే అధీనం కోల్పోయి, ప్రేమ పరాకాష్ఠకు చేరి ప్రియురాలు/ప్రియుడి నుంచి అంతే స్థాయిలో ప్రేమను ఆశిస్తూ అవతలివారికి ప్రేమను ఒక శాపంగా మార్చే ప్రవర్తనే ‘లవ్ అడిక్షన్’.
‘లవ్ అడిక్షన్’ లక్షణాలు:
లవ్ అడిక్షన్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో, ఒక్కో రకంగా ఉంటాయి. భార్యను అతిగా ప్రేమించే భర్త..ఆమెపై నిత్యం నిఘా పెట్టడం కూడా దీని లక్షణాల్లో ఒకటి. అలాంటివి కొన్ని..
- లవ్ అడిక్షన్ లో ఉన్నవారిలో సహచరులపై ప్రేమ కన్నా ఆధిపత్యమే అధికమవుతుంది. అవతలి వారెప్పుడూ తమతోనే ఉండాలని, తమతో మాత్రమే ఉండాలని కోరుకుంటారు.
- వారి కోరికలు శారీరకమైనా, మానసికమైనా అన్ని నెరవేర్చాలనుకుంటారు. లేకుంటే వీరి ప్రవర్తన దారుణంగా మారుతుంది. ఒత్తిడికి లోనై నైరాశ్యంలో కూరుకుపోతారు.
- సహచరులు పక్కన లేకుంటే సర్వం కోల్పోయినట్లు, హృదయాన్ని పెకిలించనట్లు ఫీలవుతారు.
- ప్రతి విషయానికి సహచరులపై ఆధారపడతారు
- కుటుంబం, స్నేహితులు అసలు ఎవర్నీ పట్టించుకోకుండా అదేదో పాత సినిమాల్లో వశీకరణకు లోనైన వ్యక్తిలా మారిపోతారు.
- ఏకాగ్రత లోపిస్తుంది. కొన్నిసార్లు తమ రోజూవారీ పనులు కూడా చేయలేక ఉద్యోగాలు కోల్పోయేవారు కూడా ఉంటారు. పిచ్చోళ్లైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
- భార్యను ఎవరితోనూ మాట్లాడనివ్వకపోవడం, నిరంతరం నిఘా పెట్టడం వంటివీ లవ్ అడిక్షన్ లక్షణాల్లో ఉంటాయి.
ఇవేగాక ఇంకా చాలా రకాల లక్షణాలు ఉంటాయి. కొన్ని గుర్తించగలిగితే కొన్నింటిని మనం అసలు ఊహించలేం కూడా.
లవ్ అడిక్షన్ రోగమా? గుర్తించేదెట్లా?
లవ్ అడిక్షన్ ను గుర్తించడం అంత సులువు కాదు. ఎందుకంటే ఇప్పటికీ దీనిపై స్పష్టమైన అవగాహన లేదు. ‘లవ్ అడిక్షన్’ను నిజానికి ఓ మానసిక సమస్యగా గుర్తించడంపై భిన్న వాదనలు ఉన్నాయి. కొందరు దీనిని మానసిక రోగం అంటే కొందరేమో మందు, సిగరెట్ లాగే ఇది కూడా ఓ వ్యసనం అంటారు. ఈ మానసిక స్థితిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. జరగాల్సిన అవసరం కూడా ఉంది. అయితే కొంతమందిలో లవ్ అడిక్షన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారెవరంటే
- గతంలో తాము ప్రేమించిన వారి నుంచి నిరాకరణ ఎదుర్కొన్నవారు
- ప్రియురాలు లేదా ప్రియుడి మోసానికి బలైన వారు
- గతంలో లైంగిక వేధింపుల వంటివి ఎదుర్కున్నవారు
చికిత్స ఉందా?
లవ్ అడిక్షన్ పై సరైన స్పష్టత లేదు కాబట్టి సరైన చికిత్స కూడా అందుబాటులో లేదు. కానీ మీకు మీరుగా మీలో సమస్య ఉందని గుర్తించగలిగితే సగం పరిష్కారం దొరికినట్లే. ఎవరికివారే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం ఏకాంతంగా ఉండటం అలవర్చుకోవాలి. గతంలో ప్రేమలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా జాగ్రత్తపడాలి. స్నేహితులు, కుటుంబం నుంచి సాయం పొందాలి.
గుర్తుంచుకోండి. 900కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో మీరెప్పుడూ ఒంటరి కాదు. మీ జీవితం మీ చేజారినట్టు అనిపించినా.. ఏదో ఓ రోజు కచ్చితంగా అది మళ్లీ మీరు కోరుకున్నట్టు మారుతుంది. ప్రేమ ఓ మధురానుభూతి. అది ఎప్పటికీ అలాగే ఉండనిద్దాం.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!