• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL Failure Stars: IPLలో విఫలమవుతున్న మ్యాచ్‌ విన్నింగ్‌ స్టార్స్.. మరీ ఇంత దారుణమా?

    అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన ప్రపంచ క్రికెట్‌ లీగుల్లో ఐపీఎల్‌ తొలి స్థానంలో ఉంటుంది. ఈ టోర్నీలో రాణిస్తే తమకు కెరీర్‌కు తిరుగుండదని క్రికెటర్లు భావిస్తారు. అందుకు అనుగుణంగానే అనేక మంది బ్యాటర్లు, బౌలర్లు ఐపీఎల్‌లో రాణించి.. స్టార్లుగా మారారు. తమ జట్టుకు చిరస్మరణీయ విజయాలను అందించి కీలక ఆటగాళ్లుగా ఎదిగారు. తద్వారా జాతీయ జట్లలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అయితే గత IPL సీజన్లలో ఎంతో నిలకడ రాణించిన కొందరు ప్లేయర్లు ఈసారి మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ఫ్రాంచైజీలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ జట్టుకు భారంగా మారుతున్నారు. ఈ సీజన్‌లో ‌అలాంటి ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

    1. పృథ్వీ షా (ఢిల్లీ క్యాపిటల్స్‌)

    టీమ్‌ఇండియా యంగ్‌ క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ షా (Prithvi Shaw) ఈ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. DC తరపున ఓపెనింగ్‌ బ్యాటర్‌గా వచ్చి పరుగులు రాబట్టలేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడిన పృథ్వీ 117.50 స్ట్రైక్‌రేట్‌తో కేవలం 47 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ సీజన్లో పృథ్వీ బ్యాటు నుంచి 8 ఫోర్లు రాగా.. ఒక్క సిక్స్‌ కూడా కొట్టకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే DC యాజమాన్యం అతడ్ని బెంచ్‌కే పరిమితం చేసింది. 

    2. ఆండ్రూ రస్సెల్‌ (కోల్‌కత్తా నైట్‌ రైడర్స్)

    ఐపీఎల్‌లో ‌అత్యంత దారుణంగా ఆడుతున్న ఆటగాళ్లలో KKR ఆటగాడు ఆండ్రూ రస్సెల్‌ (Andrew Russell) ఒకడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో రస్సెల్‌ 142 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కోల్‌కతాను విజేతగా నిలిపే ఇన్నింగ్స్‌ ఒక్కటీ లేదు. ఇక బౌలింగ్‌లోనూ గొప్పగా రాణించలేదు. 12 ఓవర్లు వేసి 73 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు.  అయితే తనదైన రోజున మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా రస్సెల్‌కు ఉంది. అందుకే KKR ఫ్రాంజైజీ అతడిపై నమ్మకముంచి ప్రతీ మ్యాచ్‌లోనూ కీలక ఆటగాడిగా బరిలోకి దింపుతోంది. 

    3. మెుయిన్‌ అలీ (చెన్నై సూపర్‌ కింగ్స్‌)

    CSK జట్టులో కీలక ఆల్‌ రౌండర్‌గా మెుయిన్‌ అలీ (Moeen Ali) ఎదిగాడు. గత సీజన్‌లో మెుయిన్‌ విశేషంగా రాణించడంతో అతడ్ని CSK రీటైన్ చేసుకుంది. కానీ, ఈ సీజన్‌లో చెప్పుకోతగ్గ ఒక్క ఇన్నింగ్స్‌ మెుయిన్‌ అలీ నుంచి రాలేదు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఈ ఇంగ్లాండ్ ప్లేయర్‌ కేవలం 102 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఓపెనర్లు డేవాన్‌ కాన్వే (Devon Conway), రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad), మిడిలార్డర్‌ బ్యాటర్లు రహానే (Ajinkya Rahane), శివం దూబే (Shivam Dube)రాణిస్తుండటంతో మెుయిన్‌పై CSK పెద్దగా ఒత్తిడి పెట్టడం లేదు. 

    4. అంబటి రాయుడు ( చెన్నై సూపర్‌ కింగ్స్)

    ప్రతీ సీజన్‌లో తనదైన బ్యాటింగ్‌తో అదరగొట్టే అంబటి రాయుడు (Ambati Rayudu) ఈ ఏడాది తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన రాయుడు కేవలం 83 పరుగులు మాత్రమే చేశాడు. ఈ గణాంకాలు చూస్తే రాయుడు ఎంత పేలవంగా ఆడుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. అయితే రాయుడిపై నమ్మకం ఉంచిన CSK ప్రతీ మ్యాచ్‌లోనూ అతడ్ని బరిలోకి దింపుతూ అవకాశాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో మిగతా మ్యాచుల్లో అయిన రాణించి రాయుడు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరముంది. 

    5. దినేష్‌ కార్తిక్‌ (రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు)

    గత ఐపీఎల్‌ సీజన్‌లో విశేషంగా రాణించిన దినేష్‌ కార్తిక్‌ (Dinesh Karthik) మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన అద్భుతమైన ఫామ్‌తో టీమ్‌ఇండియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అటువంటి డీకే ఈ సీజన్‌లో దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. మ్యాచ్‌లు ముగించాల్సిన సమయంలో ఔటై ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన డీకే.. 99 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్‌లో 200లకు పైగా స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేసిన దినేష్‌.. ఈ ఏడాది 133.78 స్టైక్‌రేట్‌తో ఆడుతున్నాడు. 

    6. సునీల్‌ నరైన్‌ (కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌)

    ఐపీఎల్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఎదిగిన వెస్టిండీస్‌ ప్లేయర్‌ సునీల్‌ నరైన్‌ (Sunil Narine) ఈ సీజన్‌లో ఆశించినమేర రాణించలేకపోతున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు రాబట్టలేక మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన నరైన్‌ 7 వికెట్లు మాత్రమే తీశాడు. అటు బ్యాటింగ్‌లోనూ 13 రన్స్‌ మాత్రమే చేశాడు. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా రాణించి నరైన్‌ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. 

    7. రియాగ్‌ పరాగ్‌ (రాజస్థాన్ రాయల్స్)

    ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమవుతున్న యువ క్రికెటర్లలో రియాగ్‌ పరాగ్‌ (Riyan Parag) ఒకడు. కీలక సమయాల్లో ఔట్‌ అవుతూ నెటిజన్ల ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొన్నాడు. RR తరపున ఐదు మ్యాచుల్లో ఆడిన పరాగ్‌  112.50 స్ట్రైక్‌రేట్‌తో 54 పరుగులను మాత్రమే చేశాడు. గత సీజన్‌లో చూపించినంత దూకుడుగా  పరాగ్‌ ఈసారి ఆడలేకపోయాడు. దీంతో ఆర్‌ఆర్‌ మేనేజ్‌మెంట్ గత నాలుగు మ్యాచుల్లో అతడ్ని పక్కన పెట్టేసింది. 

    8. హ్యారీ బ్రూక్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)

    హ్యారీ బ్రూక్‌ (Harry Brook)ను SRH మేనేజ్‌మెంట్‌ రూ. 13.25 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. అయితే ఒక మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన బ్రూక్‌ మిగిలిన అన్ని మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. 8 మ్యాచుల్లో కేవలం 163 రన్స్‌ మాత్రమే చేశాడు.  మిడిలార్డర్‌లో పంపించినా తన ప్రదర్శనలో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో అతడికి చెల్లించిన సొమ్ము మెుత్తం వృథా అనే  కామెంట్లు వచ్చాయి. సోషల్‌ మీడియాలోనూ అతడిపై ఎన్నో మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. 

    9. వృద్ధిమాన్‌ సాహా (గుజరాత్‌ టైటాన్స్‌)

    గత సీజన్‌లో గుజరాత్‌ ఓపెనర్‌గా ఆడిన సాహా (Wriddhiman Saha) విధ్వంసం సృష్టించాడు. తన శైలికి భిన్నంగా దూకుడుగా ఆడి టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి సాహా ఈసారి పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇప్పటివరకూ 9 మ్యాచ్‌లు ఆడిన సాహా 123.77 స్ట్రైక్‌రేట్‌తో 151 పరుగులు మాత్రమే చేశాడు. 

    10. SRH ఫెయిల్యూర్‌ బ్యాటర్స్‌

    ఈ ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. గతేడాది సూపర్‌ ఫామ్‌తో టీమ్‌ఇండియాలో చోటు సంపాదించిన రాహుల్‌ త్రిపాఠి (Rahul Tripathi) 8 మ్యాచుల్లో 170 రన్స్‌ మాత్రమే చేశాడు. ఆ జట్టులో త్రిపాఠిదే హై స్కోర్‌ అంటే మిగిలిన బ్యాటర్ల ఫామ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. కెప్టెన్ మార్‌క్రమ్‌ (Aiden Markram) కూడా పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేక ఇబ్బంది పడుతున్నాడు. ఏడు మ్యాచుల్లో 132 పరుగులను మాత్రమే చేశాడు. మయాంక్‌ అగర్వాల్ (Mayank Agarwal) (169 పరుగులు) తన సీనియరిటీకి తగ్గ బ్యాటింగ్‌ చేయడం లేదు. పవర్‌ప్లేలోనూ మరీ నెమ్మదిగా ఆడేస్తూ విమర్శలపాలవుతున్నాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv