ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కిందటిసారితో పోలిస్తే ఈ సారి ఎలక్షన్లు మరింత రసవత్తరంగా మారనున్నాయి. టీడీపీ, వైసీపీలే కాకుండా జనసేన పార్టీ కూడా ఎన్నికల కురుక్షేత్రంలోకి దూసుకొస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగుతున్నారు. వారాహి యాత్రతో అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేసేందుకు పవన్ ట్రై చేస్తున్నారు. దీంతో ఏపీలో హంగ్ తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి, పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? జనసేనాని ప్లాన్‌తో టీడీపీ దారిలోకి వస్తుందా? అనే విషయాలను తెలుసుకుందాం.
వైసీపీకి ధీటుగా..
గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 స్థానాలు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో జగన్ పార్టీకి వచ్చిన ఓట్ షేర్ సుమారు 50 శాతం(49.95శాతం). అంటే, పోలైన ఓట్లలో సగం ఓట్లు వైసీపీకే పడ్డాయి. మరోవైపు, టీడీపీ ప్రతిపక్ష స్థానానికి పడిపోయినప్పటికీ 39.26 శాతం ఓట్లను దక్కించుకోగలిగింది. దీంతో వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే టీడీపీ, జనసేన మైత్రి బలపడాల్సిందేనని బోధపడినట్లుంది. అందుకే టీడీపీ, జనసేన కలిశాయి. రెండు గొంతులు ఏకమై వైసీసీ వ్యతిరేక నినాదాన్ని మరింత బలోపేతం చేశాయి. టీడీపీతో మైత్రితో సక్సెస్ రేటుని మెరుగు పడేలా చేసుకోవడంలో జనసేన సఫలం అయింది.
పక్కా వ్యూహం..
పైకి కనిపించకపోవచ్చు గానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. టీడీపీ అనుకూల ఓట్లను తనవైపు తిప్పుకుంటూనే, తనకంటూ ప్రత్యేక ఓటర్లను సృష్టించుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా, సీట్ల పంపకంలో రాజీ పడకూడదని డిసైడ్ అయ్యారు పవన్. ఇలా చేయాలంటే పార్టీ బలమేంటో చూపించుకోవాలి. అందుకే, వారాహి యాత్రను దూకుడుగా చేపడుతున్నారు. యాత్రలు చేపట్టి, సభలకు భారీగా జనాన్ని సమీకరించి మిత్రపక్షానికి పరోక్షంగా సిగ్నల్ ఇస్తున్నారు. దీంతో ఎక్కువ సీట్లను పొందే అవకాశాన్ని పవన్ క్రియేట్ చేస్తున్నారు.
సినీ స్టార్స్ ప్రస్తావన..
వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాన్ తరచూ సినీ స్టార్ల ప్రస్తావన తీసుకొస్తున్నారు. 2019 ఎన్నికల్లో సొంత బలగంపై ముందుకెళ్లారు పవన్. అది వర్కౌట్ కాలేదు. దీంతో, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని ప్రచార శైలిని మార్చారు. రాష్ట్రంలో మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉన్నారు. తామంతా ఒక్కటేనని రాజకీయాల్లో ఫ్యాన్ వార్ ఉండకూడదని ప్రజలను పవన్ అభ్యర్థిస్తున్నారు. సినిమాను వినోదం వరకే పరిమితం చేయాలని, రాష్ట్రాభివృద్ధికి కలిసి కట్టుగా రావాలని పిలుపునిస్తున్నారు. కమ్యూనిటీ పరంగానూ ప్రభాస్‌కు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఫాలోయింగ్ ఎక్కువ. దీంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఈ రెండు జిల్లాల్లో బలోపేతం కావాలని పవన్ ఆశిస్తున్నారు.
జూ. ఎన్టీఆర్‌పై ఫోకస్..
జూనియర్ ఎన్టీఆర్‌కి అటు పార్టీ పరంగా, ఇటు స్టార్డమ్ పరంగా పెద్ద ఎత్తున అభిమానులున్నారు. గత కొద్ది కాలంగా టీడీపీ అధిష్ఠానం ఎన్టీఆర్‌ని దూరం పెడుతూ వస్తోంది. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లోనూ ఎన్టీఆర్ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడింది. లోకేశ్‌ని తర్వాతి తరం నేతగా ఆవిష్కరించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. కానీ, సంప్రదాయ టీడీపీ ఓటర్లు ఎన్టీఆర్కే మొగ్గు చూపుతున్నారు. లోకేశ్ పాదయాత్రలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అటు వైసీపీలోనూ ఎన్టీఆర్ మద్దతు దారులు ఉన్నారు. దీంతో ఈ అవకాశాన్ని అడ్వాంటేజీగా తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు. ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించడం, మెచ్చుకోవడం వంటివి చూస్తుంటే యాంటీ టీడీపీ, ప్రో ఎన్టీఆర్ వర్గాన్ని తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నట్లు తెలిసిపోతోంది.
కింగ్ మేకర్‌గా జనసేన?
పొత్తుల్లో భాగంగా జనసేనకు60-70 సీట్లను అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా, జనసేన బలోపేతంగా ఉన్న గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లను పొందాలని చూస్తోంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జనసేన 30కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తే హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే 88 స్థానాలు కావాలి. వైసీపీ, టీడీపీ మ్యాజిక్ ఫిగర్‌కి సమీపంలో ఆగిపోతే జనసేన సీట్లు కీలకం కానున్నాయి. టీడీపీతో ప్రభుత్వం ఏర్పాటుకు జనసేన సిద్ధమే. కానీ, ప్రభుత్వ ఏర్పాటులో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తికరం. పరిస్థితులు డిమాండ్ చేస్తే సీఎం సీటును ఆశించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, ఎన్నికల ఫలితాల్లో 10 సీట్లకు జనసేన పరిమితమైతే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. అప్పుడు జనసేన కాస్త తగ్గాల్సి ఉంటుంది.
క్లారిటీతో పవన్
ఆశించిన సీట్లు గెలవకపోతే.. సీఎం పదవిపై పవన్ వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సీఎం రేసులో ఉన్నానని చెబుతున్నప్పటికీ… ఫలితాలను బట్టే మెలగాలని పవన్ యోచిస్తున్నారు. తక్కువ సీట్లు వస్తే ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికే జనసేనాని మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. చంద్రబాబు విజనరీ రాజకీయంలో పాలు పంచుకుని పాలనలో మెలుకువలు నేర్చుకోవాలని పవన్ భావిస్తుండొచ్చు. అలా నెమ్మదిగా పట్టు సాధిస్తూ పార్టీని బలోపేతం చేసుకోవాలనేది జనసేనాని ప్లాన్ బీ అయ్యుండొచ్చు.
టార్గెట్ 2034?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు అంటూ ఉండరు. అందుకే, 2029 నాటికి సీఎం అభ్యర్థిగా పోటీ ఇవ్వాలని పవన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆలోగా చంద్రబాబుకు కూడా వయసు మీద పడుతుంది. 2029 నాటికి క్యాడర్ని మెరుగు పరుచుకుని పవన్ ఒంటరిగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. టీడీపీలో సమర్థవంతమైన భవిష్యత్తు నాయకుడిపై సందిగ్ధత నెలకొన్న దృష్ట్యా రాష్ట్ర ప్రజలు పవన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఓపిక ఉండాలని పవన్ పదే పదే చెప్పడంలో ఆంతర్యమిదే.
దారిలోకి టీడీపీ
పవన్ మేనియాను గమనించిన టీడీపీ దారిలోకి వచ్చింది. బీజేపీతో పొత్తులు నెరపడంలో జనసేనను మధ్యవర్తిత్వానికి ఉపయోగిస్తోంది. మరోవైపు, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలతోనూ టచ్‌లో ఉంటోంది. 2019లో బీజేపీని తీవ్రంగా విమర్శించి అభాసుపాలు కావడంతో టీడీపీ కూడా పంథాను మార్చుకోవాల్సి వచ్చింది. స్పెషల్ స్టేటస్ ఇష్యూని పక్కనపెట్టి, బీజేపీతో సత్సంబంధాలు నెరిపేందుకు చంద్రబాబు పావులు కదుపుతుండటం గమనించాల్సిన విషయం.
జనసేన ప్రస్థానం..
2014లో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కానీ, పరోక్షంగా మద్దతు తెలిపారు. అనంతరం, 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బహుజన సమాజ్ పార్టీతో కలిసి బరిలోకి దిగారు. పొత్తుల్లో భాగంగా 175 స్థానాలకు గాను జనసేన 137 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒకే స్థానాన్ని కైవసం చేసుకుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ(గాజువాక, భీమవరం) ఓడిపోయారు. టీడీపీ, బీజేపీని కాదని ఒంటరిగా పోటీ చేయడంతో జనసేన ప్రభావం చూపించలేక పోయింది.
2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జనసేనకు దిమ్మతిరిగేలా చేశాయి. బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందలేక పోయారు. దీంతో జనసేన పునరాలోచనలో పడింది. ఒంటరిగా వెళ్తే లాభం లేదనుకుని పంథా మార్చింది. నెమ్మదిగా టీడీపీ, బీజేపీకి దగ్గరవడం ప్రారంభించింది. అలా ఒకొక్క మెట్టు ఎక్కుతూ జనసేన స్నేహ హస్తాన్ని చాచింది. వైసీపీని గద్దె దించాలంటే 2024లో కలిసి వెళ్తేనే సాధ్యమనే భావనకు టీడీపీని తీసుకు రాగలిగింది. ఏదేమైనా, క్రితంతో పోలిస్తే పవన్‌కి ఓటు బ్యాంకు మెరుగుపడటం ఖాయంగా కనిపిస్తోంది. మరి, ప్రజల మైండ్‌లో ఏముందో తెలుసుకోవాలంటే ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!