నటీనటులు : గోపిచంద్, ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ, వెన్నెకల కిషోర్, రఘుబాబు, నాజర్, నరేష్, ముఖేష్ తివారి, పూర్మ, రోహిణి, సరయూ, చమ్మక్ చంద్ర తదితరులు
దర్శకుడు : ఎ. హర్ష
సంగీతం : రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ : స్వామి జె. గౌడ
నిర్మాణ సంస్థ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నిర్మాత : కె. కె. రాధామోహన్
మాచో హీరో గోపీచంద్ (Gopichand) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ (Bhimaa). కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. యువ హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ప్రమోషన్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. కాగా, మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న గోపిచంద్‌కు ‘భీమా’ ఊరట కలిగించిందా? పోలీసు పాత్రలో గోపిచంద్ మెప్పించాడా? లేదా?
కథ
భీమా కథ పరుశురామ క్షేత్రం చుట్టూ తిరుగుతుంది. బెంగళూరు, బాదామి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ దేవాలయంలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. వాటిని పోలీసు అధికారి భీమా (గోపిచంద్) ఎలా ఛేదించాడు? అతడికి పరుశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి? హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ ఇద్దరి రోల్స్ ఎలా ఉన్నాయి? ప్రియా భవానీతో గోపిచంద్ లవ్ ట్రాక్ ఎలా మెుదలైంది? అన్నది కథ.
ఎవరేలా చేశారంటే
ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన భీమా సినిమాలో.. హీరో గోపిచంద్ అదరగొట్టాడు. పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ డైలాగ్స్, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. చాలా రోజుల తర్వాత గోపీచంద్ కటౌట్‌కు తగ్గ పాత్ర దొరికిందని చెప్పవచ్చు. ఇందులో డ్యూయల్ రోల్స్‌లో గోపిచంద్ కనిపిస్తాడు. పాత్రకు తగ్గ వేరియేషన్స్‌తో మిస్మరైజ్ చేశాడు. ఇక హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ ఇద్దరి రోల్స్‌కు ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా ప్రియా భవాని, గోపిచంద్ మధ్య కెమెస్ట్రీ తెరపై ఆకట్టుకుంటుంది. నరేష్, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర పాత్రలు నవ్వులు పూయిస్తాయి. నాజర్, ముఖేష్ తివారి, రోహిణి తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
భీమా చిత్రానికి దర్శకత్వం వహించిన ఏ. హర్ష.. డైరక్టరే కాకుండా కొరియోగ్రాఫర్ కూడా. ‘భీమా’ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు.. రెండు సాంగ్స్‌కి కొరియోగ్రఫీ కూడా అందించారు. కన్నడ అనేక హిట్ చిత్రాలను అందించిన హర్ష.. గోపీచంద్‌ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయడంలో సెక్సెస్ అయ్యారు. పరశురామ క్షేత్రం చుట్టూ అల్లుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్‌తో పాటు మరో సర్‌ప్రైజింగ్ రోల్‌తో గోపీచంద్‌లోని నట విశ్వరూపాన్ని డైరెక్టర్ బయటపెట్టారు. ప్రతీ యాక్షన్ ఎపిసోడ్‌ను గూస్‌బంప్స్ వచ్చేలా తెరకెక్కించారు. అటు ఎఫ్ఎక్స్ విభాగం నుంచి కూడా మంచి ఔట్‌పుట్‌ను రాబట్టడంలో డైరెక్టర్ హర్ష విజయం సాధించారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే సెకండాఫ్ కాస్త రొటీన్‌గా సాగినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్లు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. రవి బస్రూర్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్ చేసింది. స్వామి జె. గౌడ కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
- గోపిచంద్ నటన
- యాక్షన్ సీక్వెన్స్
- నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్
- సాగదీత సీన్లు
- ఎడిటింగ్