నటీనటులు : విజయ్, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్ త్యాగరాజన్, కొకిలా మోహన్, జయరాం, స్నేహా, వీటీవీ గణేష్, అరవింద్ ఆకాష్, వైభవ్ రెడ్డి తదితరులు
కథ, దర్శకత్వం : వెంకట్ ప్రభు
సంగీతం : యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ నూని
ఎడిటింగ్ : వెంకట్ రాజన్
నిర్మాతలు : కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేశ్, కల్పతి ఎస్. సురేష్
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? విజయ్‌కు మరో మరుపురాని విజయాన్ని అందించిందా? లేదా? ఈ రివ్యూ (The Greatest of All Time Telugu Review)లో తెలుసుకుందాం.
కథేంటి
గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్ (విజయ్)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
దళపతి విజయ్ ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. గాంధీ పాత్రలో ఎప్పటిలాగే అదరగొట్టాడు. అయితే జీవన్ పాత్రలో యంగ్ విజయ్ డిజిటలైజ్డ్ లుక్ కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంత కన్విన్సింగ్‌గా ఉండదు. ఇక యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో విజయ్ మరోమారు తన మార్క్ చూపించాడు. హీరోయిన్గా మీనాక్షి చౌదరికి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆమెది గెస్ట్ రోల్‌లాగా అనిపిస్తుంది. స్పెషల్ స్క్వాడ్ సభ్యులుగా ప్రశాంత్, అజ్మల్, ప్రభుదేవా పర్వాలేదనిపించారు. వారికి హెడ్‌గా జయరాం తన నటనతో ఆకట్టుకున్నారు. సీనియర్ విజయ్‌కు జోడీగా చేసిన స్నేహా తన నటనతో మెప్పించింది. తమిళ యువ హీరో శివ కార్తికేయన్ చిన్న పాత్రలో సందడి చేశారు. త్రిష ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వెంకట్ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్లో అలరిస్తుందని చెప్పవచ్చు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే యువన్ శంకర్ రాజా అందించిన పాటలు పూర్తిగా తేలిపోయాయి. ఏది మైండ్‌లో గుర్తుంచుకునేలా లేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. యాక్షన్ సీక్వెన్స్‌లను బీజీఎం మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. గ్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇంకాస్త బెటర్‌గా పనిచేయాల్సింది. ముఖ్యంగా విజయ్ డీఏజింగ్ లుక్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడినట్లు అనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
- విజయ్ నటన
- యాక్షన్ సీక్వెన్స్
- క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
- ఊహకందే కథనం
- ప్రథమార్ధం
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!