టాలీవుడ్ దిగ్గజ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఐదు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 60 ఏళ్లు పైబడినా కూడా ఒళ్లు హూనమయ్యేలా కష్టపడుతూ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే ఇటీవల బాలయ్య 50 సంవత్సరాల సినీ ఇండస్ట్రీ ఫంక్షన్లో పాల్గొన్న చిరంజీవి తమ మల్టీస్టారర్ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కథ సిద్ధం చేయాలంటూ దర్శకుడు బోయపాటి శ్రీనుకు సవాలు సైతం విసిరారు. అయితే తాజాగా చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
‘కథ రాయకపోతే వేస్ట్’
చిరంజీవి – బాలయ్య మల్టీసారర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కథ రెడీ చేస్తే తాము చేయడానికి సిద్ధమంటూ ఇరువురు హీరోలు ఓపెన్ ఛాలెంచ్ చేసిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే డైరెక్టర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి బోయపాటి పేరు ప్రస్తావించడంతో ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఆయనే చేస్తారన్న అంచనాలు అందరిలోనూ ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా చిరు – బాలయ్య మల్టీస్టారర్‌పై దర్శకుడు బోయపాటి మాడ్లాడారు. ఓ ఛానెల్‌కు సంబంధించిన అవార్డ్ ఫంక్షన్లో పాల్గొన్న ఆయనకు ఈ మల్టీస్టారర్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి బోయపాటి బదులిస్తూ ‘చిరు, బాలయ్యను పెట్టుకొని వారికి కథ రాయకపోతే వేస్ట్. వారిద్దరే తన సినిమాకి టైటిల్’ అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
బోయపాటే ఎందుకు?
బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ఇండస్ట్రీ నుంచి చాలామంది డైరెక్టర్లు హాజరయ్యారు. అయితే వారిని కాదని బోయపాటి శ్రీను పేరునే చిరు ప్రస్తావించడానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రస్తుత డైరెక్టర్లలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా బోయపాటి ఉన్నారు. పైగా బాలకృష్ణ లాంటి సీనియర్ నటుడితో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తీశారు. దీంతో బోయపాటి అయితేనే ఈ భారీ మల్టీస్టారర్‌కు న్యాయం చేయగలరని చిరు భావించి ఉండవచ్చు. అందుకే ‘ఓయ్ బోయపాటి.. ఛాలెంజ్’ అంటూ ముందుగా ఆయన పేరునే ప్రస్తావించినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సీనియర్ డైరెక్టర్ వై.వీ.యస్. చౌదరి, ఇతర కథా రచయితలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పరోక్షంగా చిరు సూచించారు.
ఊరమాస్ స్టోరీ పక్కానా?
మాస్ ఆడియన్స్ పల్స్ ఏంటో బోయపాటి శ్రీనుకు బాగా తెలుసు. చిరు, బాలయ్యలకు సైతం మాస్ ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. చిరు హీరోగా చేసిన గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రీ, ఇంద్ర వంటి చిత్రాలు మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాయి. అటు బాలయ్య చేసిన ఫ్యాక్షనిస్ట్ చిత్రాలు సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు కూడా C సెంటర్లలో అద్భుత విజయాన్ని అందుకున్నాయి. అటువంటి హీరోలు ఒకే సినిమాలో నటిస్తే ఇక కథ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో చిరు, బాలయ్య యాక్షన్‌కు సరిపోయే దీటైనా ఊరమాస్ కథను బోయపాటి సిద్ధం చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్ చూపించని విధంగా వీరిద్దరిని బోయపాటి చూపిస్తారని అంటున్నారు.
బోయపాటికి పోటీగా వై.వి.ఎస్ చౌదరి!
‘ఇంద్ర’, ‘సమరసింహారెడ్డి’ సినిమాలను ఆధారంగా చేసుకొని చిరంజీవి, బాలయ్య పాత్రలను రాయడానికి తాను సిద్దమే అంటూ దర్శకుడు వైవీఎస్ చౌదరీ ముందుకు వచ్చినట్టు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ఆయన మెుదలుపెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. వైవీఎస్ చౌదరీ విషయానికి వస్తే ఆయన నందమూరి కుటుంబానికి వీరాభిమాని. అంతేగాదు ఆ ఫ్యామిలీతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. బాలయ్య, హరికృష్ణతో ఆయన గతంలో సినిమాలు కూడా తీశారు. అయితే కొద్దికాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఆయన తాజాగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన కథతో చిరు. బాలయ్యను ఒప్పించి మరోమారు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని వైవీఎస్ చౌదరి భావిస్తున్నారట. మరి వీరిద్దరిలో చిరు-బాలయ్య ఎవరి కథను ఫైనల్ చేస్తారో చూడాలి.
‘అఖండ 2’ తర్వాతే..
టాలీవుడ్లో బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన ‘సింహా’ (Simha), ‘లెజెండ్’ (Lezend), ‘అఖండ’ (Akhanda) చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. తాజాగా వీరి కాంబోలో నాలుగో ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్దమైంది. ‘అఖండ 2’ అనే టైటిల్‌తో ఇటీవలై కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ కూడా చేశారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. చిత్రబృందంతోపాటు బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి (Nara Brahmani), తేజస్విని (Tejaswini), ఇతర కుటుంబసభ్యులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. అయితే చిరు బాలయ్య మల్టీస్టారర్‌కు బోయపాటిని ఫైనల్ చేసినా ‘అఖండ 2’ పూర్తయిన తర్వాతే ఆ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుంది.