టాలీవుడ్ దిగ్గజ నటుల్లో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఒకరు. టాలీవుడ్ మన్మథుడిగా కూడా ఆయన్ను పిలుస్తుంటారు. అటువంటి కింగ్ నాగార్జునకు గత కొన్ని రోజులుగా అసలు కలిసి రావడం లేదు. ఏదోక రూపంలో అక్కినేని ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. నాగచైతన్య-శోభిత నిశ్చితార్థంపై విమర్శలు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, నాగార్జున కుటుంబంపై మంత్రి కొండ సురేఖ ఘాటు వ్యాఖ్యలు నాగార్జునను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నాగార్జునపై కేసు నమోదు
సినీ హీరో నాగార్జునపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భాస్కరరెడ్డి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి పోలీసులకు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్ ఒపీనియన్‌కు పంపారు. అనంతరం తాజాగా నాగార్జునపై కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే.
రూ.100 కోట్ల స్థలం కబ్జా!
నాగార్జునపై చేసిన ఫిర్యాదులో మరిన్ని అంశాలను కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి లేవనెత్తారు. శిల్పారామం ఎదురుగా గల అయ్యప్ప సొసైటీ ప్రాంతంలోని తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థలంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిబ్రవరి 17, 2021న నివేదిక ఇచ్చారని ఫిర్యాదు పేర్కొన్నారు. రూ.వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి చెరువును కబ్జా చేసి అక్రమంగా వ్యాపారం చేసి రూ.కోట్లు గడించిన అక్కినేని నాగార్జునపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు.
కక్ష్య సాధింపు చర్యలేనా!
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య – సమంత విడాకుల అంశాన్ని కేటీఆర్‌తో ముడిపెడుతూ దారుణంగా మాట్లాడారు. దీనిని అక్కినేని కుటుంబంతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. అటు నాగార్జున ఓ అడుగు ముందుకువేసి రూ.100 కోట్ల మేర పరువునష్టం దావా మంత్రిపై వేశారు. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగార్జునపై క్రిమినల్ కేసు పెట్టడం ద్వారా అతడ్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ కేసులో నాగార్జున ఎలా వ్యూహాత్మంగా ముందుకు వెళ్తారో చూడాలి.
తీవ్రంగా ఖండించిన టాలీవుడ్
అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్రంగా ఖండించింది. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గు చేటని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహేష్ బాబు ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. అటు తారక్ సైతం వ్యక్తిగత జీవితాలను ప్రస్తావించడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోందంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ స్పందిస్తూ మంత్రి ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సీనియర్ నటుడు వెంకటేష్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?