టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్‌లో అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఒకరు. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్ని చిత్రాల్లో మెయిన్ హీరోయిన్‌గా, మరికొన్నింటిలో క్యారెక్టర్ అర్టిస్టుగా చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల లీడ్ యాక్ట్రెస్‌గా ఆమె చేసిన ‘పొట్టేల్’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనన్య నటనకు నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి. అయితే ఎన్ని మంచి పాత్రలు చేసినా అనన్యకు సరైన అవకాశాలు రావడం లేదన్న అభిప్రాయం చాన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు బంపరాఫర్ కొట్టేసింది. దీంతో అనన్య ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
మెగా హీరో సరసన..!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తున్న తాజా చిత్రం ‘SDT 18’. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్ కేపీ (Rohit KP) దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తెలుగు నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. ‘విభిన్న పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుతోన్న ప్రతిభావంతురాలు అనన్య నాగళ్లను వెల్కమ్’’ అంటూ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌లో రాసుకొచ్చింది. ఇక ఈ పోస్టర్‌లో అనన్య అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించింది. చీరకట్టు, బొట్టుతో ముఖంగా చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటోది.
మెగా హీరోతో రొమాన్స్!
‘SDT 18’ ప్రాజెక్టులో ఇప్పటికే హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lakshmi) నటిస్తోంది. ఇటీవల రిలీజైన గ్లింప్స్‌లో ఈ అమ్మడు లుక్ ఆకట్టుకుంది. లేటెస్ట్‌గా అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రాజెక్టులో జాయిన్ కావడంతో ఆమె రోల్ ఏంటన్న ప్రశ్న అందరిలోనూ మెుదలైంది. అయితే ఇందులో అనన్య సెకండ్ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాయిధరమ్ తేజ్, అనన్యకు మధ్య కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉండే ఛాన్స్ లేకపోలేదని నెటిజన్లు ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు. అనన్య పాత్రకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే చిత్ర బృందం వెల్లడించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
కొత్తవారికి ప్రేరణగా అనన్య!
ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే స్టార్ హీరోల సరసన చేయడం తప్పనిసరి. ఈ విషయం అనన్య నాగళ్ల (Ananya Nagalla)కు తెలిసినంతగా ఏ హీరోయిన్‌కు తెలీదు. 2019లో వచ్చిన ‘మల్లేశం’ చిత్రంతో హీరోయిన్‌గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’ వంటి సైన్స్ ఫిక్షన్ మూవీతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్ హీరోగా చేసిన ‘వకీల్ సాబ్’లో కీలక పాత్రే పోషించినప్పటికీ నటిగా ఆమెకు బ్రేక్ రాలేదు. దీంతో పలు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. అవకాశం దొరికినప్పుడుల్లా హీరోయిన్‌గా కనిపించి తనను తాను నిరూపించుకుంది. రీసెంట్‌గా వచ్చిన ‘తంత్ర’, ‘పొట్టేల్’ సినిమాలతో నటిగా మరో మెట్టు ఎక్కింది. స్టార్ హీరో చిత్రాల్లో నటించడమే లక్ష్యంగా ఆమె చేస్తున్న కృషికి ఇన్నాళ్లకు సరైన ఫలితం దక్కింది. అనన్య టాలెంట్‌ను గుర్తించిన ‘SDT 18’ టీమ్ తమ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి గౌరవించింది. ఈ సక్సెస్ అయితే అనన్య కెరీర్ మరోస్థాయికి వెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అనన్య సినీ ప్రయాణం ఈ తరం తెలుగమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది పేర్కొంటున్నారు.
1947-67 బ్యాక్‌డ్రాప్‌లో..
‘SDT 18’ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో వస్తోన్న చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు రోహిత్ కేపీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్స్ నిర్మించినట్లు ఇటీవల రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోను బట్టి తెలుస్తోంది. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్‌ను ఒక షాట్‌లో చూపించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం సరికొత్త మేకోవర్‌లోకి మారాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు.
పడిలేచిన కెరటంలా..
మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్‌ఫుల్ యాక్టర్‌గా మారారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలోనే అతడికి ఊహించని విధంగా యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులనూ ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేసింది. ప్రమాదం అనంతరం కోమాలోకి వెళ్లిన తేజ్ జీవన్మరణ సమస్య నుంచి కోలుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు. తన తల్లి పేరును తన పేరుకు జత చేసి సాయి ధరమ్ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మారాడు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం