• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాక్‌లోనే ఆసియా కప్; భారత్ మాత్రం..

    పాకిస్తాన్‌లోనే ఆసియా కప్ జరుగుతుందని ఏసీసీ స్పష్టం చేసింది. ‘‘టీమిండియా ఆసియా కప్ ఆడుతుంది. ఆసియా కప్ పాక్‌లోనే జరుగుతుంది. కానీ తటస్థ వేదికలపై మాత్రమే భారత్ ఆడుతుంది. ఒమన్, శ్రీలంక, యూఏఈ, ఇంగ్లండ్ వేదికలు సూచించాం. ఈ వేదికల్లో ఎక్కడో ఒక చోట భారత్ తన మ్యాచ్‌లు ఆడుతుంది. ఒక వేళ భారత్ ఫైనల్ చేరినా.. ఫైనల్ కూడా తటస్థ వేదికలోనే జరుపుతాం. ఇందుకు పీసీబీ కూడా అంగీకరించింది. ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లోనే నిర్వహిస్తాం.’’ అంటూ ఏసీసీ పేర్కొంది.

    ప్రపంచకప్ సమరాల ముంగిట సన్నద్ధత కోసం ఆసియా కప్ నిర్వహించడం సంప్రదాయం. ఈ పద్ధతిని అనాదిగా పాటిస్తూ వస్తున్నారు. గతేడాది టీ20 ప్రపంచకప్‌కి ముందు పొట్టి ఫార్మాట్లో ఆసియా కప్ నిర్వహించారు. ఈ సారి అక్టోబరు-నవంబరులో వన్డే వరల్డ్‌కప్ జరగనున్న దృష్ట్యా 50 ఓవర్ల ఫార్మాట్‌లోనే ఆసియా కప్ ఉండనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఆసియా కప్‌ని నిర్వహించే అవకాశం ఉంది. 

    ఏసీసీ సమావేశం..

    ఆసియా కప్‌నకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండటంతో భారత్ పర్యటనపై సర్వత్రా చర్చ నెలకొంది. భద్రతా పరమైన కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌లో భారత్ ఆడకపోవచ్చని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా జైషానే కావడంతో పాక్ క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ఆసియా కప్ ఆతిథ్య బాధ్యతల నుంచి పాకిస్థాన్ తప్పించకూడదని ఆ దేశ బోర్డు డిమాండ్ చేసింది. దీంతో మార్చి 24న పాక్ క్రికెట్ బోర్డుతో ఏసీసీ సమావేశమైంది. హైబ్రిడ్ విధానంలో టోర్నీ నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. 

    ఏమిటీ హైబ్రిడ్ విధానం?

    అధికారికంగా పాకిస్థాన్ ఆసియా కప్‌నకు ఆతిథ్యం ఇస్తుంది. కానీ, భారత్ ఆడే మ్యాచ్‌లకు మాత్రం తటస్థ వేదికలు ఆతిథ్యం ఇస్తాయి. ఒకవేళ భారత్ ఫైనల్‌కి చేరితే ఆ మ్యాచ్ కూడా న్యూట్రల్ వేదికలోనే జరగేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే, మిగతా అన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోనే జరగేలా ప్లాన్ ఉంటుందని పాక్ బోర్డుకు ఏసీసీ హామీ ఇచ్చినట్లు సమాచారం. న్యూట్రల్ వేదికలుగా యూఏఈ, ఒమన్, శ్రీలంక, ఇంగ్లాండ్‌లను పరిగణనలోకి తీసుకుని ఫైనలైజ్ చేయనున్నారు. 

    పాక్ బోర్డు డిమాండ్..

    ఆసియా కప్‌ కోసం పాకిస్థాన్‌కు భారత్ రాకపోతే, పాకిస్థాన్ కూడా భారత్‌కు రాబోదని పాక్ బోర్డు భీష్మించుకుని కూర్చుంది.  భారత్ మ్యాచ్‌లను న్యూట్రల్ వేదికల్లో నిర్వహిస్తే.. పాక్ ఆడే ప్రపంచకప్ మ్యాచ్‌లను కూడా తటస్థ వేదికల్లోనే నిర్వహించాలని పాక్ పట్టుబడుతోంది. ఈ మేరకు ఆ దేశ బోర్డు అధ్యక్షుడు నజాం సేతి ఏసీసీకి తెలియజేసినట్లు సమాచారం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv