ఆదిసాయికుమార్, సువేక్ష జంటగా నటించన అతిథిదేవోభవ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించగా..శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు.
ఆదిసాయికుమార్ గ్యాప్‌లేకుండా సినిమాలు చేస్తున్నప్పటికీ వరుసగా అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. లవ్లీ తర్వాత ఆయన కెరీర్లో సరైన హిట్ పడలేదు. దీంతో ఈసారి కచ్చితంగా కొడుతున్నాం అంటూ ప్రమోషన్స్‌లో చెప్తూ వచ్చారు. మరి ఈ కొత్త సంవత్సరమైనా ఆదికి కలిసొచ్చిందా. అతిథిదేవోభవ సినిమా ఎలా ఉంది. కథ ఏంటి తెలుసుకుందాం
చిన్నప్పటినుంచి మోనోఫోబియో అనే మానసిక వ్యాధితో బాధపడుతుంటాడు అభయ్ (ఆది). అంటే ఒంటరిగా ఉండాలంటే భయపడుతుంటాడు. ఒక్కడే ఉంటే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తుంటాయి. అందుకే ఎప్పుడు అందరితో గుంపులో ఉండేదుకు ప్రయత్నిస్తుంటాడు. అతనికి ఉన్న లోపం కారణంగా ఎంతగానో ప్రేమించిన అమ్మాయి దూరమవుతుంది. అదే నిరాశలో ఉన్న అతడి జీవితంలోకి వైష్ణవి(సువేక్ష) అనే మరో అమ్మాయి అడుగుపెడుతుంది. ఆమెను ఇష్టపడతాడు. వైష్ణవి కూడా తనకు దూరం అవుతుందేమోననే భయంతో అతనికి ఉన్న మానసిక సమస్యను చెప్పకుండా దాచేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే ఒకసారి అభయ్ జీవితంలో అనుకోకుండా ఎదురయ్య సంఘటనలతో పోలీసులు అతడిని సైకోగా భావించి అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అభయ్ ఆ మానసిక వ్యాధి నుంచి బయటపడతాడా అనేదే కథ.
మోనోఫోబియా అనే ఒక పాయింట్‌ను తీసుకొని కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కించేందుకు ప్రయత్నం చేశాడు డైరెక్టర్ పొలిమేర నాగేశ్వర్. అయితే అదిగా ఆశించినంతగా వర్కవుట్ కాలేదు. థ్రిల్లర్ అంశాల కోసం బలవంతంగా కొన్నిసీన్లు దూర్చేందుకు ప్రయత్నించడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లుంటుంది. అయితే ఇంటర్వెల్ సమయానికి అభయ్ ఒంటరిగా ఉండాల్సి రావడం..దీంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఆ తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తి ఏర్పడుతుంది. కానీ, సెకండాఫ్‌లో అనుకున్నంత థ్రిల్లింగ్‌గా కథను కొనసాగించడంలో విఫలమయ్యారు. మొదట కామెడీ థ్రిల్లర్ కోణం కాస్త..సైకో థ్రిల్లర్ కథగా మారుతుంది. అయితే రెండురకాలుగాను విఫలమయ్యాడు దర్శకుడు. సప్తగిరి కామెడీ మాత్రం కాస్త ఊరటనిస్తుంది. అయితే ఆయన ఇదివరకు సినిమాల్లో చేసినంత కామెడీని మాత్రం ఆశించలేం. తన లోపాన్ని దాచుకునేందుకు హీరో ప్రయత్నించే నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్లు కొన్ని అలరిస్తాయి.
ఆదిసాయికుమార్ ఈ సినిమాలో తన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. సువేక్ష అందంగా కనిపించింది. అయితే ఆమె పాత్రకు సినిమాలో పెద్దగా స్కోప్ లేదు. సప్తగిరి కామెడీ అక్కడక్కడ కాస్త నవ్వించింది. శేఖర్ చంద్ర అందించిన పాటలు బాగున్నాయి.
ఇలా ఏదైనా ఒక లోపం కథాంశంతో ఇదివరకు చాలా కథలు వచ్చాయి. కానీ అవి అయితే అవి ఎంతో కొంత కామెడీ లేదా ఫ్యామిలీ సెంటిమెంట్‌తో అలరించాయి. కానీ ఈ సినిమా ఆ స్థాయిని చేరుకోలేకపోయింది. చివరిగా ఆదిసాయికుమార్ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. కథాంశం బాగున్నప్పటికీ దాన్ని తెరకెక్కించడంలో విఫలమయ్యారు
Rating: 2/5