సమ్మర్ క్రీడా సంబరం షురూ కాబోతోంది. ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ క్రికెట్ లీగ్ IPL సందడి మార్చి 31న మొదలు కాబోతోంది. ఇలాంటి సమయంలో ఓ ఆటగాడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడే లక్నో సూపర్ జయంట్స్ కెప్టెన్ KL రాహుల్. గత కొంతకాలంగా సరైన ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న రాహుల్ ఈ మధ్యనే BCCI కాంట్రాక్ట్ లిస్ట్‌లోనూ డిమోషన్‌కు గురయ్యాడు. గ్రేడ్ A లిస్ట్ నుంచి రాహుల్‌ను గ్రేడ్Bకు BCCI డిమోట్ చేసింది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అతడి పరిస్థితి ఎలా ఉన్నా.. IPLలో మాత్రం అతడికి తిరుగులేదు.
LSG ఆశాదీపం
గతేడాది మెగా వేలం తర్వాత కొత్తగా ఏర్పడిన LSGకి KL రాహుల్ కెప్టెన్‌గా వెళ్లాడు. ఆరంభ సీజన్‌లో మంచి ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు జట్టును చేర్చగలిగాడు. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. అది జరగాలంటే వారి ప్రధాన ఆయుధం KL రాహుల్. కెప్టెన్‌గానే కాదు బ్యాట్‌తో పరుగులు రాబట్టడంలోనూ జట్టుకు రాహుల్ కీలకం కానున్నాడు.
IPL పరుగుల వీరుడు
IPL పరుగుల వీరుడు అని ఊరికే అనడం లేదు. 109 IPL ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 48.01 సగటుతో 3,889 పరుగులు చేశాడు. మరో 111 పరుగులు చేస్తే అతడు 4000 రన్స్ క్లబ్‌లో చేరతాడు. ఇప్పటిదాకా ఈ ఫీట్‌ను 13 మంది సాధించారు. రాహుల్ 14వ వాడు అవుతాడు. ఈ సీజన్‌లో అతడు రాణిస్తే అజింక్య రహానే (4,074), అంబటి రాయుడు (4,190)లను సులభంగా అధిగమించగలడు.
2018 నుంచి ఇప్పటిదాకా
2018 నుంచి జరిగిన అన్ని సీజన్లను గమనిస్తే రాహుల్ IPL పరుగుల రారాజుగా కొనసాగుతున్నాడు. 70 మ్యాచుల్లో 3,164 పరుగులు చేశాడు. ఈ నాలుగేళ్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు.ఇందులో నాలుగు సెంచరీలతో పాటు 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి.అంతేకాదు ఈ సీజన్లలో 3,000కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ రాహుల్. ఆ తర్వాత 2683 పరుగులతో శిఖర్ ధావన్ రాహుల్ వెనక ఉన్నాడు.
సూపర్ నంబర్స్
IPLలో 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన వారిలో రాహుల్‌దే బెస్ట్ యావరేజ్. 48.01తో రాహుల్ టాప్‌లో ఉన్నాడు. 2018 నుంచి గమనిస్తే అతడి యావరేజ్ 55.50గా ఉంది. ఇది 2000కు పైగా పరుగులు సాధించిన వారందరి కన్నా చాలా మెరుగైన సగటు. IPL సెంచరీల జాబితాలోనూ రాహుల్ 4 శతకాలతో మూడో స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ 6, విరాట్ కోహ్లీ 5, జోస్ బట్లర్ 5 మాత్రమే రాహుల్ కన్నాముందున్నారు. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ రాహుల్‌కు సమానంగా 4 సెంచరీలు చేశారు.
ఫాస్టెస్ట్ IPL 50
ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం కూడా రాహుల్ పేరుమీదనే ఉంది. రాహుల్‌తో పాటు KKR జట్టు ఆటగాడు ప్యాట్ కమిన్స్ కూడా ఈ రికార్డును పంచుకుంటున్నాడు. కేవలం 14 బంతుల్లో వీరిద్దరూ అర్ధశతకం బాదారు. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 318కి పైగా స్ట్రైక్ రేటుతో రాహుల్ ఈ అర్ధశతకం సాధించాడు. దురదృష్టవశాత్తు దానిని బిగ్ ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయాడు. 16 బంతుల్లో 51 పరుగులు చేసి ఔటయ్యాడు.
అత్యధిక 50+ స్కోర్లు
2018 తర్వాత అత్యధిక 50+ స్కోర్లు సాధించిన వారిలోనూ రాహుల్ ముందున్నాడు. 31 అర్ధ శతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో రాహుల్ ఉన్నాడు. రాహుల్ తర్వాతి స్థానంలో శిఖర్ ధావన్ 21 అర్ధ శతకాలు చేశాడు.
కెప్టెన్‌గా రాహుల్
గతేడాది కొత్త జట్టు LSGకి కెప్టెన్‌గా మారిన రాహుల్ అంతకుముందు పంజాబ్ కింగ్స్‌కు సారథ్య బాధ్యతలు నిర్వహించాడు. అయితే అక్కడ అతడికి అదృష్టం అస్సలు కలిసి రాలేదని చెప్పాలి. సులభంగా గెలవాల్సిన చాలా మ్యాచ్‌లు రాహుల్ సారథ్యంలో ఓడిపోయారు. ఇప్పటిదాకా రాహుల్ 42 మ్యాచ్‌లకు సారథ్యం వహిస్తే అందులో సూపర్ ఓవర్ మ్యాచ్‌లు మినహా 20 మ్యాచుల్లో విజయం సాధించి.. 20 మ్యాచుల్లో ఓటమి పాలయ్యారు. కానీ గతేడాది లక్నో జట్టును రాహుల్ ప్లేఆఫ్స్‌కు చేర్చగలిగాడు.
రాహుల్ రికార్డులు
- రాహుల్ 132 నాటౌట్ IPL చరిత్రలోనే భారత బ్యాటర్ నుంచి బిగ్గెస్ట్ స్కోర్. ఓవరాల్‌గా ఇది ఐదో భారీ వ్యక్తిగత స్కోరు. పంజాబ్ జట్టుకు రాహుల్ 2,548 పరుగులు చేశాడు. ఆ జట్టుకు వ్యక్తిగతంగా రాహుల్‌దే అత్యధిక భాగస్వామ్యం.
- వరుసగా 5 సీజన్లలో 500+ స్కోర్లు సాధించిన ఏకైక ఇండియన్ బ్యాటర్ రాహుల్.
- గత సీజన్‌లో రాహుల్-డికాక్ కలిసి చేసిన 210 పరుగుల భాగస్వామ్యం IPL చరిత్రలోనే హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్.
ఈ ఏడాది కూడా రాహుల్ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించి మరిన్ని రికార్డులు చెరిపివేస్తాడని అంచనా.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం