నటీనటులు: వైభవ్ రెడ్డి, రితికా సింగ్, చరణ్, ఆకాంక్ష సింగ్, నయన్ సారిక, రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, వెంకటేష్ కాకుమాను తదితరులు
రచన, దర్శకత్వం : మానస శర్మ
సినిమాటోగ్రఫీ : ధనుష్ భాస్కర్
సంగీతం : పి.కె. దండి
నిర్మాత : నిహారిక కొణిదెల
నిర్మాణ సంస్థ: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్
ఓటీటీ వేదిక: సోనీలివ్
విడుదల తేదీ : సెప్టెంబర్ 12, 2024
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కొత్త నటీనటులతో సరికొత్త కథాంశాన్ని తెరెకెక్కించి నిహారిక ప్రశంసలు అందుకున్నారు. దీంతో తాజాగా ఆమె నిర్మించిన వెబ్‌సిరీస్ ‘బెంచ్ లైఫ్‘పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కష్టాల నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందడం, ఐటీ బ్యాక్‌డ్రాప్ ఉన్న మానస శర్మ అనే మహిళ డైరెక్షన్ చేయడంతో మరింత హైప్ ఏర్పడింది. ఇందులో వైభవ్ రెడ్డి, చరణ్ పెరి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. సోనీలివ్‌లో సెప్టెంబర్ 12 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? నిహారిక ఖాతాలో మరో సక్సెస్ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
బాలు (వైభవ్ రెడ్డి), రవి (చరణ్ పెరి), మీనాక్షి (రితికా సింగ్) ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులు. మంచి స్నేహితులు కూడా. అదే ఆఫీసులో పని చేసే ఇషా (ఆకాంక్ష సింగ్)ను తొమ్మిదేళ్లుగా బాలు ప్రేమిస్తుంటాడు. కానీ ఆమెకు చెప్పడు. మరోవైపు మీనాక్షి డైరెక్టర్ కావాలని కలలుకంటుంది. కథలు రాసుకొని నిర్మాతల చుట్టూ తిరుగుతుంటుంది. ఈ క్రమంలోనే భార్య (నయన్ సారిక), ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి రవి గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. అందుకు ముగ్గురు ఫ్రెండ్స్ బెంచ్ అడుగుతారు. బెంచ్ వచ్చిన తర్వాత ఏమైంది? కంపెనీలో ప్రసాద్ వశిష్ఠ (రాజేంద్ర ప్రసాద్) రోల్ ఏంటి? భార్యతో రవికి మనస్ఫర్థలు రావడానికి కారణం ఏంటి? రవి తన ప్రేమను ఇషాకు చెప్పాడా? లేదా? డైరెక్టర్ కావాలన్న ఇషా కల ఏమైంది? తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
బాలు పాత్రకు నటుడు వైభవ్ పూర్తిగా న్యాయం చేశాడు. తన కామెడీ టైమింగ్‌తో ఫన్ జనరేట్ చేశాడు. ఆయన ప్రేమించే అమ్మాయిగా ఆకాంక్ష సింగ్ చక్కగా నటించింది. మనసులోని భావాలను బయటకు చెప్పలేని సెటిల్డ్ యువతిగా ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో హైలెట్ అంటే చరణ్ పెరి, నయన్ సారిక అని చెప్పవచ్చు. వాళ్లిద్దరి నటనతో పాటు వారి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. మీనాక్షి పాత్రలో రితిక చక్కగా ఒదిగిపోయింది. ఇష్టంలేని జాబ్ చేయలేక డైరెక్టర్ అయ్యేందుకు కష్టపడే యువతి పాత్రలో ఆమె మెప్పించింది. తులసి ఎప్పటిలా తన పాత్రకు న్యాయం చేశారు. రాజేంద్ర ప్రసాద్ మరోసారి కామెడీ టైమింగ్, ఎమోషన్స్ పరంగా మెప్పించారు. తనికెళ్ల భరణి పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ కథలో కీలమైన సందర్భంలో హుందాగా నటించారు. నిహారిక కొణిదెల, సంగీత్ శోభన్, వెంకట్ అతిథి పాత్రల్లో మెరిశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకురాలు మానస శర్మ యువతరానికి ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ప్రతి పాత్రను ఒక అర్థం ఉండేలా రూపొందించారు. ముఖ్యంగా చరణ్ పెరి-నయన్ సారిక జంటకు ఇచ్చిన ముగింపు బాగుంది. అయితే రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ పాత్రలకు ఇచ్చిన ఎండింగ్ మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. సహజత్వం కనిపించదు. రాజేంద్రప్రసాద్-వైభవ్ రెడ్డి కామెడీ ట్రాక్ బాగా ప్లస్ అయ్యింది. అలాగే రాజేంద్రప్రసాద్ & నయన్ సారిక పాత్రలతో పండించిన సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా డైరెక్టర్ మానస శర్మ మంచి మార్కులే సంపాదించుకుంది. అయితే వైభవ్ నోటి నుంచి వచ్చే బూతులు, ఐటీ ఉద్యోగులకు మాత్రమే కనెక్ట్ అయ్యేలా సిరీస్ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ మంచి పనితీరు కనబరిచాడు. సాఫ్ట్‌వేర్ ఆఫీస్ వాతావరణాన్ని చక్కగా ప్రజెంట్ చేశాడు. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ వంటి ఇతర విభాగాలు కూడా మంచి పనితీరు కనబరిచాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- ప్రధాన తారాగణం నటన
- డైరెక్షన్ స్కిల్స్
- కామెడీ
మైనస్ పాయింట్స్
- అక్కడక్కడా బోల్డ్ డైలాగ్స్
- ఐటీ ఉద్యోగులకు మాత్రమే కనెక్ట్ కావడం
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం