మలయాళంలో బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన ‘ప్రేమలు’ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయడంతో ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ ప్రమోషన్స్ నేపథ్యంలో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. ఫలితంగా తెలుగులో రూ.15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఇక్కడ ఆ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా ప్రేమలు నిలిచింది. అయితే అదే సమయంలో వచ్చిన విశ్వక్ సేన్ ‘గామి’ చిత్రం మాత్రం మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, శుక్రవారం (ఏప్రిల్ 12).. ఆహా (ప్రేమలు), జీ 5 (గామి) వేదికగా ఈ రెండు సినిమాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చాయి. ఈ రెండు సినిమాలను చూసిన నెటిజన్లు.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
బిల్డప్ ఎక్కువ.. మేటర్ తక్కువ!
ప్రేమలు చిత్రాన్ని ఓటీటీలో చూసిన కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. సినిమా సూపర్బ్ అంటూ జరిగిన ప్రచారానికి.. మూవీకి సంబంధమే లేదని కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమలు చిత్రం పర్వాలేదని.. సూపర్ డూపర్ హిట్ అనేంత స్థాయిలో తమకు అనిపించలేదని అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం యూత్‌ను మాత్రమే ఆకట్టుకునే చిత్రమని అంటున్నారు. మరోవైపు విశ్వక్ సేన్ నటించిన గామీ మాత్రం తమకు విపరీతంగా నచ్చిందని చెబుతున్నారు. ‘ప్రేమలు’తో పోలిస్తే.. ‘గామి’ అన్ని విధాలుగా ఆకట్టుకుందని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. ‘ప్రేమలు’కు ఓవర్ బిల్డప్, ప్రమోషన్స్ ఇవ్వడంతో.. ఆ ప్రభావం ‘గామి’పై నెగిటివ్‌గా పడిందని విశ్లేషిస్తున్నారు.
గామి Vs ప్రేమలు
మరికొందరు నెటిజన్లు గామి, ప్రేమలు కథలను విశ్లేషిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘ప్రేమలు’ సినిమా చూసి తాను బోర్‌గా ఫీల్ అయినట్లు ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఈ తరహా కథలను చిన్నప్పటి నుంచి చాలా సినిమాల్లో చూసినట్లు తెలిపాడు. క్లైమాక్స్ కూడా ‘తొలి ప్రేమ’ సినిమాకు చాలా దగ్గరగా ఉందని పేర్కొన్నాడు. హీరోయిన్ మమితా బైజునూ కూడా మరి ఎక్కువగా పబ్లిసిటీ ఇచ్చారని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఎటువంటి సందేహం లేకుండా గామీ ఎక్స్ట్రార్డినరీ ఫిల్మ్ అంటూ మరోకరు కామెంట్ చేశారు.
విశ్వక్ నటనపై ప్రశంసల జల్లు
‘గామి’ సినిమా ఓటీటీలో విశేష ఆదరణ పొందుతోంది. ఈ సినిమాను తొలిసారి ఓటీటీలో చూసిన వారంతా విశ్వక్ నటనకు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా కథ, విజువల్స్, నేపథ్య సంగీతం, స్క్రీన్‌ప్లే, విశ్వక్ నటన అద్భుతంగా ఉన్నాయంటూ మెజారిటీ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మూవీలో తమకు నచ్చిన సీన్లకు సంబంధించిన క్లిప్స్‌ను #Gaami హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టు చేస్తున్నారు. ఫలితంగా ఈ పేరు.. ఎక్స్ (ట్విటర్)లో ట్రెండింగ్ అవుతోంది. క్లైమాక్స్‌లో వచ్చే చివరి రెండు నిమిషాలు గూస్బంప్స్ తెప్పించిందని నెటిజన్లు అంటున్నారు. వినూత్నమైన కథలతో సినిమాలు తీయడంతో విశ్వక్‌కు సాటి లేరని ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి