రామ్‌చరణ్ – డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game changer). ‘ఆర్ఆర్‌ఆర్’ (RRR) తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఖాయమంటూ పలు వేదికలపై దిల్‌రాజు స్పష్టం చేశారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా సంక్రాంతి రేసులో నిలవనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే పొంగల్ బరిలో నిలిచిన చిరుకు చరణ్ నుంచి గట్టి పోటీ తప్పదా అన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది.
క్రిస్మస్ నుంచి సంక్రాంతికి లాక్!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి చాలా పెద్ద ఫెస్టివల్. బడా బడా హీరోలందరూ తమ చిత్రాలను సంక్రాంతికి లాక్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన అప్‌కమింగ్ చిత్రం ‘విశ్వంభర’ను పొంగల్ రేసులో నిలిపారు. ఈ క్రమంలోనే రామ్‌చరణ్ లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ను సైతం సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావడానికి ఇంకాస్త సమయం పట్టే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో క్రిస్మస్ నాటికి రిలీజ్ సాధ్యం కాకపోవచ్చని సమాచారం. దీంతో సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద చిరు-రామ్‌చరణ్ మధ్య బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు.
డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడే కారణమా?
గేమ్ ఛేంజర్ చిత్రం డిసెంబర్ నుంచి సంక్రాంతికి మారడం వెనక డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని క్రిస్మస్ కంటే సంక్రాంతికి తీసుకువస్తేనే తమకు లాభదాయకంగా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్ల అంటున్నారట. అలా కాదని క్రిస్మస్‌కు తీసుకొస్తే తమకు గిట్టుబాటు కాకపోవచ్చని తేల్చి చెబుతున్నారట. పైగా జనవరి 10 నుంచి సంక్రాంతి చిత్రాలు వస్తుండటంతో లాంగ్ పీరియడ్ కలెక్షన్స్ పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారట. 20 రోజుల కలెక్షన్స్‌తోనే ‘గేమ్ ఛేంజర్’ సరిపెట్టుకోవాల్సి వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారట. దీంతో ‘గేమ్ ఛేంజర్’ టీమ్ పూర్తిగా ఇరాకటంలో పడిపోయినట్లు తెలుస్తోంది.
చిరు వెనక్కి తగ్గేనా!
తండ్రి కొడుకులైనా చిరంజీవి, రామ్‌చరణ్ ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద తలపడలేదు. ‘విశ్వంభర’ వర్సెస్ ‘గేమ్ ఛేంజర్’గా పోటీ మారితే ఫ్యాన్స్‌కు తప్పుడు సంకేతం ఇచ్చినవారవుతారు. రిలీజ్ సందర్భంగా ఏ సినిమా చూడాలన్న విషయంలో మెగా ఫ్యాన్స్ తర్జనభర్జన అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కొడుకు కోసం ‘విశ్వంభర’ను పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం లేకపోలేదని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్‌పై ఎప్పటినుంచో సందిగ్దం నెలకొంది. నిర్మాత దిల్‌రాజు, సంగీత దర్శకుడు థమన్ క్రిస్మస్ కానుకగా సినిమా వస్తుందని చెప్పినా మెగా ఫ్యాన్స్ పూర్తిగా విశ్వసించలేదు. ఇప్పుడేమో సంక్రాంతికి సినిమా వస్తుందంటూ మరో ప్రచారం జోరందుకుంది. సంక్రాంతి కూడా మిస్ అయితే ‘గేమ్ ఛేంజర్’పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి తారాస్థాయికి చేరే ప్రమాదం ఉంది. కాబట్టి సంక్రాంతికే ‘గేమ్ ఛేంజర్’ను రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుబడితే మెగాస్టార్ వెనక్కి తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రీషూట్‌కు నో చెప్పిన చరణ్!
‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేసుకున్న రామ్‌చరణ్ తన ఫోకస్‌ను తర్వాతి చిత్రంపైకి మళ్లించారు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో రానున్న ‘RC16’ కోసం లాంగ్ హెయిర్‌తో పాటు బాడీని సైతం పెంచాడు. అయితే దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’కి సంబంధించిన కొన్ని సీన్లపై అసంతృప్తిగా ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. చరణ్‌తో వాటిని రీషూట్ చేాయాలని భావించినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని నిర్మాత దిల్‌రాజు ద్వారా చరణ్ దృష్టికి తీసుకెళ్లగా ఇందుకు అతడు నో చెప్పినట్లు తెలిసింది. తిరిగి ‘గేమ్ ఛేంజర్’ లుక్‌లోకి మారితే ‘RC16’ షూటింగ్‌లో జాప్యం జరుగుతుందని ఆయన భావించారట. ఇప్పటికే ‘RC16’ కోసం డేట్స్ కూడా ఇవ్వడంతో వాటిని అడ్జస్ట్ చేసుకునేందుకు చరణ్ సంసిద్ధంగా లేరని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపించింది.
చరణ్- నీల్ కాంబో లోడింగ్!
రామ్ చరణ్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బాస్టర్స్ అందించిన ప్రశాంత్ నీల్‌తో చరణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను డీవీవీ దానయ్య నిర్మించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు చాలా సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతం ప్రశాంత్ చేతిలో ‘NTR 31’తో పాటు సలార్ 2, కేజీఎఫ్ 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అటు చరణ్ సైతం బుచ్చిబాబుతో పాటు సుకుమార్‌తో ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. అవన్నీ పూర్తయిన తర్వాత చరణ్-నీల్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.