‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రాబోతున్నట్లు ఇటీవల దిల్ రాజు ప్రకటించడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’కు కొత్త సమస్య మెుదలైనట్లు తెలుస్తోంది. దీని వల్ల ఈ ఏడాది సినిమా రిలీజ్ కాకపోవచ్చని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
కారణం ఏంటంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) చిత్రం ఈ ఏడాది విడుదల కాకపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిర్మాత దిల్ రాజు చెప్పినట్లు క్రిస్మస్‌కు విడుదల కాకపోవచ్చని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఈ సినిమాకు ఇంకా 15 రోజులకు పైగా షూటింగ్ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పైగా కొత్త లొకేషన్స్ కోసం దర్శకుడు శంకర్ వెతుకుతున్నట్లు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. కావాల్సిన లొకేషన్స్ దొరికి మిగిలిన షూటింగ్‌ను ఫినిష్ చేసే సరికి మరింత సమయం పట్టే అవకాశముంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, డబ్బింగ్ కంప్లీట్ చేసేసరికి డిసెంబర్ దాటి పోవచ్చని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలంటే మూవీ యూనిట్ మరింత వేగంగా పని చేయాల్సి ఉంటుంది. అయితే డైరెక్టర్ శంకర్ ప్రస్తుత స్పీడ్ చూస్తుంటే ఈ ఏడాది చరణ్ మూవీ రావడం కష్టమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
2024 సమ్మర్ కానుకగా!
రామ్ చరణ్ – శంకర్ కాంబోలోని ‘గేమ్ ఛేంజర్’ చిత్రం డిసెంబర్ నుంచి 2025 సమ్మర్‌కి వెళ్లే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ మిస్ అయితే సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే పలు చిత్రాలు పొంగల్ బరిలో నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే వెంకటేష్- అనిల్ రావిపూడి చిత్రంతో పాటు అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి రేసులో నిలిచాయి. ఈ నేపథ్యంలో వాటికి పోటీగా ‘గేమ్ ఛేంజర్’ను బరిలోకి దింపడం కరెక్ట్ కాదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఫిబ్రవరి, మార్చి పరీక్షల కాలం కావడంతో వేసవి సెలవుల్లో ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కావొచ్చని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.
గేమ్ ఛేంజర్‌పై భారీ ఆశలు!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ (Indian 2) చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్ ఛేంజర్’ పూడుస్తుందని దిల్ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
కియారా పోస్టర్ అదుర్స్!
గేమ్ ఛేంజర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని (Kiara Advani) ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ భామ బర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో కియారా ఓ మల్టీ కలర్ లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది. మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘జరగండి జరగండి’ పాటలోని లుక్ ఇది. ఇక ఈ చిత్రంలో చరణ్, కియారాలతో పాటు ఎస్.జే. సూర్య, అంజలి, శ్రీకాంత్, నాజర్, నవీన్ చంద్ర, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్