టాలీవుడ్ ఇండస్ట్రీకి గోల్డెన్ డేస్ మొదలయ్యాయి. ఒకేసారి 4 భారీ బడ్జెట్ , పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దానికి తగినట్లుగానే మన హీరోలు ప్రచారంలో వేగం పెంచారు. తెలుగుతో పాటు..చెన్నై, బెంగుళూరు, కేరళ, ముంబయికి వెళ్లి ప్రమోషన్స్ చేస్తున్నారు. మొదట ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ ట్రెండ్ మొదలుపెట్టగా..తర్వాత పుష్ప, శ్యామ్‌సింగరాయ్, సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది.
‘ఆర్ఆర్ఆర్’ మేనియా
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీప్రేమికులు ఎప్పుడెప్పుడు వస్తుందా..సినిమా బాహుబలి రికార్డులు తిరగరాస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ ప్రమోషన్స్‌లో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు మేకర్స్. వీలైనంత ఎక్కువగా సినిమాపై ఆసక్తి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
‘రాధేశ్యామ్’ క్రేజ్
ఇక ప్రభాస్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ప్రభాస్ సినిమా గురించి రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అప్‌డేట్స్ ఇవ్వనందుకు యూవీ క్రియేషన్స్‌ను ఇన్నిరోజులు సోషల్‌మీడియాలో మీమ్స్, కామెంట్స్‌తో ట్రోల్స్ చేశారంటే..ఆ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు.
‘పుష్ప’రాజ్- తగ్గేదే లే!
ఇక ఈ మద్య గత రెండు మూడు సినిమాల నుంచి బన్నీ బాలివుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. అక్కడ కూడా ఆయన డ్యాన్స్‌కు, సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు. అల్లు అర్జున్‌ను మలయాళంలో అయితే మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. మలయాళం సినిమాలకు దీటుగా అల్లు అర్జున్ సినిమాలకు అక్కడ కలెక్షన్లు వస్తాయి. పుష్ప కోసం డైరెక్టర్ సుకుమార్ ముంబయిలో ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే..బన్నీ, రష్మిక కలిసి చెన్నై, బెంగుళూరు, కేరళ , ముంబయి ఇలా వరుసగా ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్‌మీట్‌లతో వేగం పెంచారు.
ట్రెండ్ ఫాలో అవుతున్న ‘శ్యామ్ సింగరాయ్’
మరోవైపు నానీ శ్యామ్‌సింగరాయ్ కూడా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ప్రీ-రిలీజ్ ఈవెంట్ పూర్తిచేశారు. ఇప్పుడు వెంటనే ముంబయి, చెన్నై, బెంగళూరు వెళ్లి ప్రమోషన్స్‌లో పాల్గొనబోతున్నారట.
ఇలా నాలుగు తెలుగులో రూపొందుతున్న పాన్ఇండియా సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వబోతుండటం..ఈ రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తుండటతో తెలుగు సినిమా స్థాయి పెరిగిపోతుందనే చెప్పాలి. యంగ్ హీరోస్ అంతా తమ క్రేజ్‌ను దేశవ్యాప్తంగా పెంచుకునేందుకు ఇది మంచి సమయం. ఇక ఇప్పటినుంచి ఈ ట్రెండ్ కంటిన్యూ అవబోతుంది. దీంతో తెలుగు సినిమాకు మంచి రోజులు వచ్చాయి. ఇక్కడ ఏదైనా సినిమా వస్తుందంటే అన్ని ఇండస్ట్రీల వాళ్లు ఒక కంట కనిపెట్టే పరిస్థితి వచ్చింది. ఎన్‌టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లుఅర్జున్ లాంటి వాళ్లు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోలకి పూలబాట వేస్తున్నారు.
ఒకప్పుడు ఇండియన్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అనే ఒక ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు బాలీవుడ్‌కు ఇతర ఇండస్ట్రీలకు దూరం తగ్గిపోయింది. బాలివుడ్ నటులు వచ్చి సౌత్‌లో నటిస్తున్నారు. మనవాళ్లు వెళ్లి బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. ఇక మన సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేయడం లేదా మనవాళ్లే అన్ని భాషల్లో సినిమాలను రిలీజ్ చేసి ఫేమ్‌తో పాటు మార్కెట్‌ను పెంచుకుటున్నారు. ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ పెద్ద సినిమాలు టాలీవుడ్‌ను ఏ స్థాయిలో నిలబెడతాయో చూడాలి మరి.