బిగ్‌బాస్ స్టేజ్‌పై హోస్ట్ నాగార్జున.. ఒకవైపు సన్నీ, మరోవైపు షణ్ముఖ్ చేతి పట్టుకొని నిలబడ్డాడు. విన్నర్ ఎవరా అని ఉత్కంఠగా అందరూ ఎదురుచూస్తున్న వేళ.. నాగార్జున సన్నీ చేయి పైకెత్తగానే సన్నీ ఎగిరి గంతులేశాడు. కళావతి నువ్వు అడిగిన గిఫ్ట్ ఇదిగో అంటూ బీబీ ట్రోఫీని అమ్మ చేతిలో పెట్టాడు. బిగ్‌బాస్ సీజన్5 విన్నర్‌గా సన్నీ అవతరించేందుకు గల కారణాలు ఏంటి. ఎందుకు ప్రేక్షకులకు అంతగా నచ్చాడో తెలుసుకుందాం.
సన్నీ ఖమ్మం జిల్లా, తెలంగాణలో పుట్టాడు. వయసు 32 సంవత్సరాలు. మొదట ఒక న్యూస్ ఛానల్‌లో జర్నలిస్ట్‌గా ప్రయాణం మొదలుపెట్టిన సన్నీ..ఆ తర్వాత యాంకర్‌గా మారాడు. సీరియల్స్‌లో హీరోగా నటించాడు. సీరియల్స్ చూసేవారందరికీ సన్నీ పరిచయం. కానీ యూత్‌కి అంత తెలియకపోవచ్చు.
బిగ్‌బాస్‌కు ముందు సకల గుణాభిరామ అనే సినిమా చేశాడు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. తానేంటో నిరూపించుకోవాలని, అందరూ తనను గుర్తించాలనే ధ్యేయంతో హౌజ్‌లోకి అడుగుపెట్టాడు.
సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. కానీ అందరికీ ఆయన సన్నీగానే తెలుసు. వచ్చిన మొదటిరోజు నుంచి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న సన్నీ ఎక్కడ తగ్గలేదు.
కేవలం అదొక్కటే కాదు. నిజాయతీగా ఉండటం, స్నేహానికి విలువ ఇవ్వడం. అందరితో ముచ్చట్లు పెడుతూ నవ్విస్తుండటం. టాస్క్‌లు గట్టిగా ఆడటం ఇవన్నీ సన్నీని విజేతగా నిలబెట్టాయి. ఎంత గొడవ పడినా వెంటనే వెళ్లి వాళ్లతో దాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించేవాడు సన్నీ. ఆ గుణం హౌజ్‌లో వాళ్లకు నచ్చకపోయినా చూసే ప్రేక్షకులకు దగ్గర చేసింది.
ఒక టాస్క్‌లో అప్పడం అని కోపంగా అన్న మాటకు అందరూ అదేదో బూతు అన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడం, వీకెండ్‌లో నాగార్జున వచ్చి కూడా సన్నీనే తిట్టడంతో ప్రేక్షకుల్లో సన్నీ పట్ల జాలీ, ప్రేమ, దయ పెరిగాయి. ముఖ్యంగా ఆ వీక్ నుంచే సన్నీ ఓటింగ్‌లో మొదటి స్థానానికి వెళ్లాడు. అప్పటి వరకు బయట అంత ఫాలోయింగ్ ఉన్న షన్నును అధిగమించి ముందుకెళ్లాడు.
ఇక హౌస్‌మేట్స్‌తో ముఖ్యంగా కాజల్‌తో చేసే సరదా అల్లరి, ఆమెను ఏడిపించడం ఇవన్నీ ఫన్నీగా ఉండేవి. ఒంటరిగా కూర్చొని బిగ్‌బాస్‌తో మాట్లాడటం..పాటలు పాడుకోవడం కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. రెండు వారాల కింద చేసిన బాలయ్య గెటప్‌తో రోల్‌ప్లేతో కడుపుబ్బా నవ్వించాడు.
అలా సామాన్య కంటెస్టెంట్‌గా వచ్చిన సన్నీ ఇప్పుడు బిగ్‌బాస్ తర్వాత.. ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికీ చేరువయ్యాడు.