• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 700ఏళ్ల తర్వాత మాతృ భూమికి కాకతీయుల వారసుడు

    కాకతీయుల పూర్వవైభవాన్ని చాటిచెబుతూ కాకతీయ సప్తాహం ఉత్సవాలు వరంగల్ లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ సర్కారు ఈ వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నేటి నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ కాకతీయ వైభవ సప్తాహంలో కాకతీయుల అలనాటి విశిష్టత, గొప్పతనాన్ని నేటి తరాలకు చాటిచెప్పేలా పలు కార్యక్రమాలను రూపొందించింది. ఈ ఉత్సవాలకు ఛత్తీస్ గఢ్-బస్తర్‌లో కాకతీయుల వారసుడైన కమల్‌చంద్ర భంజ్ దేవ్‌ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ సందర్భంగా అసలు నిజంగా కాకతీయుల వారసులు ఇప్పటికీ ఉన్నారా? ప్రతాప రుద్రుడి తర్వాత కాకతీయులు ఎటు వెళ్లారు? భంజ్ దేవ్ లను కాకతీయులు అనడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? ఓసారి చూద్దాం..

    అసలు ఎవరీ ఈ కమల్ చంద్ర భంజ్ దేవ్?

    కమల్ చంద్ర భంజ్ దేవ్.. బస్తర్ రాజవంశంలో 22వ పాలకుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆయన్నే తెలంగాణ సర్కారు కాకతీయుల వారసుడిగా గుర్తించింది. కమల్ చంద్ర భంజ్ దేవ్ అంతర్జాతీయ వాణిజ్యంలో మాస్టర్ డిగ్రీ సాధించారు.రాజమాత క్రిష్ణ కుమారీ దేవి,మహారాజ పుత్రిక గాయత్రీదేవితో కలిసి జగదల్‌పూర్‌లోని రాజభవనంలో నివసిస్తున్నారు.

    ప్ర‌తాప‌రుద్రుడి మరణం తర్వాత కాకతీయులు ఎటు వెళ్లారు?

    చరిత్ర ప్రకారం… 1323లో తుగ్లక్‌ల చేతిలో చివరి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఓటమి పాలయ్యాడు. ఆయన్ను ఢిల్లీకి బందీగా తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో యమునా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనతోనే కాకతీయ వంశం అంతమైందనేది చరిత్ర సారాంశం. కానీ కొందరు చరిత్రకారుల ప్రకారం… ‘ప్రతాపరుద్రునితోనే కాకతీయ వంశం అంతంకాలేదు. ఓరుగల్లులో కాకతీయ పాలన ముగియగానే…ప్రతాప రుద్రుని సోదరుడైన అన్నమదేవుడు తన పరివారంతో గోదావరిని దాటి వెళ్లాడు. దండకారణ్యంలో బస్తర్ పేరుతో కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అక్కడ విస్తరించిన కాకతీయ సామ్రాజ్యమే నేటి చత్తీస్‌గఢ్‌లోని అయిదు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్. అన్నమదేవుని వారసుల్లో 22వ వాడే కమల్ చంద్ర భంజ్‌దేవ్. ప్రస్తుతం బస్తర్ మహారాజు. వీరి రాచకుటుంబం ప్రస్తుతం జగదల్‌పూర్‌లోని రాజభవనంలో నివసిస్తున్నారు. 

    ఆధారాలు

    అన్నమదేవుని కాలం నుంచి వస్తున్న కాకాతీయుల ఆచారాలను ఇప్పటికీ బస్తర్ ప్రజలు పాటిస్తున్నారు.బస్తర్ రాజులు కాకతీయులే అనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. 1940లో బ్రిటీష్ ప్రభుత్వం ముద్రించిన ది ఇండియన్ స్టేట్స్ పుస్తకంలో కాకతీయులే  ఈ భంజ్ రాజ్య వంశీయులు అని చెప్పింది. సుమారు 13వేల చ.కి.మీ విస్తీర్ణంలో రెండో కాకతీయ సామ్రజ్యం విస్తరించిందని వివరించింది. ఈ సామ్రాజ్యాన్ని 6వందల ఏళ్ల పాటు 20మంది కాకతీయ రాజులు  పరిపాలించినట్లు పేర్కొంది. ఆచార్య ఎన్‌జీ రంగా రాసిన కాకతీయనాయక్స్ అనే పుస్తకంలో కూడా కాకతీయ రెండో రాజ్యం బస్తర్‌లో తిరిగి మొదలైందనే ధ్రువీకరణ ఉంది. బస్తర్ పాత రాజధానుల్లో తవ్వకాలు జరిపితే మరిన్ని ఆధారాలు వెలుగులోకి రావచ్చని చరిత్రకారుల అభిప్రాయం.

    పోలికలు

    బస్తర్‌లో కాకతీయుల శిలాశాసనాలను పోలి అనేక శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలు సైతం తెలుగులో ఉండటం విశేషం. కాకతీయుల ఆరాధ్య దైవం కాకతీ మాత. భద్రకాళి దేవి. బస్తర్ లో దంతేశ్వరీ దేవిని తమ కుల దైవంగా భంజ్ దేవ్ వంశస్థులు భావిస్తున్నారు. దంతేశ్వరి దేవికి కాకతీ మాతకు దగ్గరి పోలికలు ఉన్నాయి. కాకతీయుల శిల్పకళ ఇక్కడి ఆలయాల్లోనూ గమనించవచ్చు.

    మలి కాకతీయులకు భంజ్ దేవ్ పేరు ఎలా వచ్చింది?

    1891-1921 మధ్య బస్తర్ రాజ్యాన్ని పాలించిన ప్రతాపరుద్రదేవ్ కు మగ సంతానం లేరు. దీంతో ఆయన తన కుమార్తె ప్రఫుల్ లకుమారీదేవికి రాజ్యాధికారం అప్పగించారు.ఆమె ఒడిశాలోని మయూర్‌భంజ్ రాజైన ప్రఫుల్ చంద్ర భంజ్‌ను వివాహం చేసుకున్నారు.దీంతో భర్త పేరులోని భంజ్ అనే పదం ఆ తర్వాతీ కాలంలో బస్తర్ కాకతీయ రాజుల పేరు చివర చేరింది. మయూర్‌భంజ్‌లు చంద్రవంశస్తులు కావడంతో చంద్ర పదం కూడా తోడైంది.

    బస్తర్ లో మలి కాకతీయలు ఏం చేశారు?

    బస్తర్ సామ్రజ్యాన్ని స్థాపించిన రెండో కాకతీయలు తమ పూర్వ వాసనను కొనసాగించారు. కాకతీయుల మాదిరి పెద్దపెద్ద చెరువులు, ఆలయాలు నిర్మించారు. జనరంజకమైన పాలన అందించారు. అక్కడి గిరిజనులకు అండగా నిలిచారు.విద్యాలయాలు, కాలేజీలు నిర్మించారు. 

           700 ఏళ్ల తర్వాత కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ తన మాతృభూమికి వస్తుండటంలో ఆయన రాక కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర సర్కారు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv