ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ‘ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కమల్ హాసన్ (Kamal Hassan), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), దీపికా పదుకొనే (Deepika Padukone) వంటి స్టార్ క్యాస్ట్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అందరి అంచనాలను అందుకుంటూ రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై అందరి దృష్టి పడింది. ‘కల్కి 2’ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఇప్పటి నుంచే ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ‘కల్కి 2’ షూట్ ఇప్పట్లో మెుదలయ్యేలా కనిపించడం లేదు. ఇందుకు స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే కారణమని ప్రచారం జరుగుతోంది.
షూటింగ్స్‌కు బ్రేక్!
‘కల్కి 2’ చిత్రం వచ్చే ఏడాది జూన్ – జులై కల్లా రిలీజ్ అవుతుందని నిర్మాత అశ్వని దత్ గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కూడా పూర్తైనట్లు పేర్కొన్నారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ‘కల్కి 2’ రీమైనింగ్ షూటింగ్‌కు దీపిక పదుకొనే వల్ల బ్రేకులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రెగ్నెంట్. సెప్టెంబర్‌లో ఆమె బిడ్డకు జన్మనివ్వనుంది. బిడ్డ పుట్టాక కనీసం ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా తనకు ఎంతో ఇష్టమైన రోహిత్ శెట్టి ప్రాజెక్టును వదులుకున్నారట. అలాగే ఓ ప్రముఖ బాలీవుడ్ షోకు సైతం దీపిక నో చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ‘కల్కి 2’ షూటింగ్‌కు కూడా ఆమె దూరంగా ఉండే ఛాన్స్ ఉంది.
దీపికనే కీలకం!
‘కల్కి 2’ చిత్రానికి దీపికా పదుకొనే పాత్రే కీలకం. ఆమె చుట్టూనే సెకండ్ పార్ట్ తిరగనుంది. సంక్రాంతి తర్వాత నుంచి ‘కల్కి 2’ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారు. అటు హీరో ప్రభాస్ కూడా ‘కల్కి 2’ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దీపికా షూటింగ్ హాజరుకాకపోతే ఎలా అని కల్కి టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కల్కి కోసం ప్రభాస్ సిద్ధం చేసుకున్న డేట్స్ కూడా తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఊహించని పరిణామం ప్రభాస్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టినట్లు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ‘కల్కి 2’ చిత్రం వచ్చే ఏడాది కాకుండా 2026లో రిలీజయ్యే అవకాశముందని విశ్లేషిస్తున్నాయి.
అసలు కథ ‘పార్ట్ 2’లోనే!
‘కల్కి 2898 ఏడీ’ సినిమాను గమనిస్తే తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికి సరిపోయినట్లు అనిపిస్తుంది. భైరవగా ప్రభాస్ (Prabhas), సుమతిగా దీపికా పదుకొనే (Deepika Padukone), అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), విలన్ సుప్రీమ్ యాష్కిన్‌గా కమల్ హాసన్ (Kamal Hassan), అర్జునుడుగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పాత్రల చుట్టే కల్కి తిరిగింది. ఒక్కో పాత్ర నేపథ్యం, కథలో వారి ప్రాధాన్యతలను దర్శకుడు నాగ్ అశ్విన్ తొలి భాగంలో చూపించాడు. కలియుగం అంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు, విలన్ సుప్రీమ్ యాష్కిన్ వారిని పెడుతున్న బాధలు కళ్లకు కట్టాడు. మహా విష్ణువు పదో అవతారమైన ‘కల్కి’ రాకకు ముందు ఉన్న పరిస్థితులను ‘పార్ట్ 1’లో చూపించారు. అయితే హీరో ప్రభాస్, విలన్ సుప్రీమ్ యాష్కిన్ ఒక్కసారి కూడా తొలి భాగంలో ఎదురెదురు పడలేదు. అయితే ‘పార్ట్ 2’లో వీరిద్దరు ఒకరితో ఒకరు నేరుగా తలపడవచ్చు. ఇది సెకండ్ పార్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనుంది.
కమల్ హాసన్ విశ్వరూపం
కల్కి సినిమాలో కమల్ హాసన్ పాత్ర నిడివి 15 నిమిషాల కంటే తక్కువే. రెండు మూడు డైలాగ్స్ మినహా ఆయన నటనను వీక్షించే అవకాశం ఆడియన్స్‌కు లభించలేదు. సుమతి (దీపిక పదుకొనే) గర్భం నుంచి సేకరించిన సీరాన్ని ఇంజెక్ట్ చేసుకొని సుప్రీమ్ యాష్కిన్ దైవ శక్తి పొందుతాడు. అతడు మరింత శక్తివంతంగా మారడాన్ని ‘కల్కి’ క్లైమాక్స్‌లో చూపించారు. దీంతో ‘కల్కి 2’లో కమల్ హాసన్ పాత్ర పూర్తి స్థాయిలో ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ కమల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘కల్కి 2’ తాను ఎక్కువ సేపు కనిపిస్తానని చెప్పుకొచ్చారు. ఫలితంగా భైరవ నుంచి కర్ణుడిగా మారిన ప్రభాస్, అశ్వత్థామ అమితాబ్‌తో సుప్రీమ్ యాష్కిన్ నేరుగా తలపడే అవకాశముంది. ఈ క్రమంలో నటన పరంగా కమల్ హాసన్ విశ్వరూపం చూసే ఛాన్స్ ఫ్యాన్స్‌కు లభించవచ్చు.
కల్కి పాత్రలో ఎవరు?
పురాణాల ప్రకారం కలిని మహా విష్ణువు అవతారమైన కల్కి అంతం చేస్తాడు. కల్కి షూటింగ్ మెుదలైనప్పటి నుంచి కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అంతా భావించారు. అయితే అతడ్ని కర్ణుడుగా చూపించి డైరెక్టర్ ఝలక్ ఇచ్చాడు. దీంతో సినిమాకు మూలమైన కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తొలి భాగం పూర్తయ్యే వరకూ కల్కి సుమతి గర్భంలోనే ఉన్నాడు. కాబట్టి సెకండ్ పార్ట్‌లో ఒక్కసారిగా పెరిగి పెద్దవాడైనట్లు చూపించే అవకాశం లేదు. కాబట్టి కల్కిని ఓ బాలుడిగా చూపించే ఛాన్స్ ఉంది. కలి అయిన సుప్రీమ్ యష్కిన్‌ను ఆ బాలుడు చంపేందుకు ప్రభాస్ (కర్ణుడు/భైరవ), అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) సాయం చేయవచ్చు.