దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరేక్టరేట్… విచారణకు హాజురు కాలేనన్న కవిత విజ్ఞప్తిని అంగీకరించి మరో తేదీని ఖరారు చేసింది. ఈ నెల 20న వ్యక్తిగతంగా విచారణకు రావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు, ఇప్పటివరకు ఆమెను సాక్షిగా పరిగణించిన ఈడీ… ఇప్పుడు అనుమానితురాలిగా పేర్కొంది. దీంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
విచారణకు డుమ్మా
ఉదయం నుంచి ఈ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 11 గంటలకు విచారణ కావాల్సి ఉండగా.. కవిత బుధవారమే దిల్లీ వెళ్లారు. ఆమె వెంట హరీశ్ రావు, కేటీఆర్, ఆమె న్యాయవాది భరత్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో కవిత విచారణకు వెళ్తోందని అంతా భావించారు. కానీ, సరైన సమయానికి తాను విచారణకు రావట్లేదని ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించారు. తన కేసు కోర్టులో పెండింగ్ ఉన్నందునా వీలు కాదని చెప్పారు. మరో రోజు విచారణకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన కవిత… ఈడీ అధికారులు అడిగిన సమాచారాన్ని లాయర్ ద్వారా పంపించారు.
కవిత ఏం చెప్పారంటే?
“ మహిళలను కార్యాలయానికి పిలిచి విచారించొద్దు. ఆడియో, వీడియో విచారణకు నేను సిద్ధం. అధికారులు నా నివాసానికి వచ్చి ప్రశ్నించవచ్చు. వ్యక్తిగతంగా రావాలని నాకు ఇచ్చిన సమన్లలో లేదు. నా ప్రతినిధిగా భరత్‌ను ఈడీ కార్యాలయానికి పంపుతున్నాను. నా ప్రతినిధిగా లాయర్ భరత్‌ను పంపుతున్నాను. మీరు అడిగిన వివరాలను పంపాను. నా హక్కుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించా. ఈ నెల 24న కోర్టులో విచారణకు రానుంది” అని కవిత అన్నారు.
సుప్రీంకోర్టులో కేసు
ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 11న తమను ఇతరులతో కలిసి విచారిస్తామని చెప్పారని.. కానీ, అలా చేయలేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం… మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, తక్షణమే విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. ఈ నెల 24న వాదనలు వింటామని స్పష్టం చేసింది.
వ్యక్తిగతంగా రండి
ఇక కవిత అభ్యర్థనను ఈడీ పరిగణించింది. ఈ నెల 20న విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే, ఈసారి మాత్రం వ్యక్తిగతంగా రావాలని అధికారులు సూచించారు. దీంతో సుప్రీంకోర్టులో విచారణకు ముందే ఆమె ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. ఆ రోజున ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఒక్కరినే రమ్మన్నారంటే కవితను అరెస్ట్ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.
పిళ్లై కస్టడీ పొడగింపు
మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా తొలుత కవిత ప్రతినిధిగా చెప్పి తర్వాత వాంగ్ములాన్ని మార్చిన అరుణ్ పిళ్లైకి రౌజ్ ఎవెన్యూ కోర్టు కస్టడీ పొడగించింది. వాదనలు వినిపించిన ఈడీ “ ఈ కేసులో కొందరితో కలిపి పిళ్లైని విచారించాల్సి ఉంది. నిందితులు, సాక్షులను కలిపి జరుపుతున్న విచారణ ముగియలేదు” అని పేర్కొన్నారు. జోక్యం చేసుకున్న బెంచ్ “ అందరినీ కలిపి విచారిస్తే ఎలా ? కొన్ని డాక్యుమెంట్ల ద్వారా విచారణ ఉంటుది” కదా అని ప్రశ్నించింది. స్పందించిన అధికారులు.. లిక్కర్ స్కాంలో అనుమానుతిరాలిగా ఉన్న కవితను, పిళ్లైతో కలిపి విచారించాలని పేర్కొన్నారు. కానీ, ఆమె విచారణకు రాకపోవటంతో మరోసారి నోటీసులు ఇచ్చామని చెప్పారు. పిళ్లై కస్టడీ పొడగించాలని కోరగా.. మూడ్రోజులకు అనుమతిచ్చారు.
సాక్షి నుంచి అనుమానితురాలు
కవితను మెుదట్నుంచి సాక్షిగా పేర్కొంది ఈడీ. కానీ, ఇప్పుడు అనుమానితురాలిగా కోర్టులో చెప్పింది. దీంతో ఆమె చుట్టు ఉచ్చు బిగుస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. ఆమె అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు భాజపా నేతలు వ్యాఖ్యానిస్తుండటంతో భారాస నేతల్లో ఆందోళన నెలకొంది.
ఎంపీ మాగుంట శ్రీనివాసులుకు నోటీసులు
ఈ కేసులో వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులకు కూడా నోటీసులు పంపించింది ఈడీ. ఈ నెల 18న విచారణకు రావాలని పేర్కొంది. ఇప్పటికే మాగుంట కుమారుడు రాఘవ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న విషయం తెలిసిందే.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..