ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సోదరుడు నాగబాబు (Nagababu)కు ఏపీ కేబినెట్‌లో చోటు దక్కింది. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu) అధికారికంగా ప్రకటించారు. తాజా నిర్ణయంతో నాగబాబు త్వరలోనే మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఏ శాఖ కేటాయిస్తారన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. మరోవైపు జనసేనలో చురుగ్గా పనిచేస్తోన్న నాగబాబు ప్రస్తుతం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీకి ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న నాగబాబుకు మంత్రిపదవి వస్తుండటంతో జనసేన క్యాడర్‌తో పాటు, మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే నాగబాబును కేబినేట్‌లోకి తీసుకోవడాన్ని సోషల్ మీడియా వేదికగా కొందరు తప్పుబడుతున్నారు.
నాగబాబుపై తీవ్ర విమర్శలు..
మెగా బ్రదర్ నాగబాబును మంత్రి ఎంపిక చేయడాన్ని నెట్టింట కొందరు తప్పుబడుతున్నారు. దీనిపై మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. ‘ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటున్నారు.. పాపం’ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. మంత్రిగా చేయడానికి ఆయనకు ఏ అర్హత ఉందని నిలదీస్తున్నారు. ప్రజా ఆశీస్సులు లేకుండా మంత్రి పదవి ఎలా ఇస్తారా? అని మండిపడుతున్నారు. కుటుంబ పాలనకు వ్యతిరేకమని చెప్పే పవన్ ఇప్పుడు సొంత అన్నకి మంత్రి పదవి ఇప్పించాడని ఆరోపిస్తున్నారు. ‘అన్న రూల్స్ పెడతాడు.. కానీ ఫాలో అవ్వుడు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
బాలయ్య ఫ్యాన్స్ అలక..
నాగబాబుకు మంత్రి పదవి ఖరారైన నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ నెట్టింట అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు. తమ హీరో హిందూపురంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారని గుర్తు చేస్తున్నారు. హిందూపురం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారని అంటున్నారు. అటువంటి బాలయ్యకి సైతం మంత్రి పదవి ఇచ్చుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ అలకను విపక్ష వైకాపా పార్టీ పావుగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. గతంలో బాలయ్యను విమర్శిస్తూ నాగబాబు చేసిన కామెంట్స్‌ను నెట్టింట వైరల్ చేస్తోంది.
త్వరలో ఎమ్మెల్సీగా ప్రమాణం..
జనసేన ముఖ్యనేత నాగబాబు ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా లేరు. ఆయన ఏపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయలేదు. అయితే ఏపీ తరపున ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు ఆయన్ను ఎంపిక చేస్తారని అంతా భావించారు. దీనిపై పవన్ ఢిల్లీ వెళ్లి మరి భాజపా అధినాయకత్వంతో చర్చలు జరిపారు. కానీ, కొన్ని రాజకీయ సమీకరణాల రిత్యా ఆ సీటును బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు భాజపా కేటాయించింది. ఈ నేపథ్యంలో ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం నాగబాబుకు స్టేట్ మినిస్ట్రీని కూటమి ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల వ్యవధిలో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా నాగబాబు బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పట్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణం చేసే ఛాన్స్ తొందర్లో ఉంది.
మెగా ఫ్యామిలీ అరుదైన రికార్డు
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన చిన్న తమ్ముడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన రెండో సోదరుడు నాగబాబు సైతం మంత్రిగా త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో దేశ రాజకీయ, సినీ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దేశంలో ఏ ఫ్యామిలీకి చెందిన ముగ్గురు హీరోలు ఇలా మంత్రులుగా వ్యవహరించలేదు. దేశ రాజకీయాల్లో మెగా ఫ్యామిలీకి లభించిన అరుదైన ఘనతగా దీనిని చెప్పవచ్చు.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’